logo

తేలనున్న సింగరేణి ఎన్నికల భవితవ్యం

సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల భవితవ్యం నేడు తేలే అవకాశం ఉంది. రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల విషయంలో వేసిన రిట్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది.

Published : 22 Sep 2023 05:42 IST

నేడు హైకోర్టు తీర్పు

న్యూస్‌టుడే, శ్రీరాంపూర్‌: సింగరేణిలో కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికల భవితవ్యం నేడు తేలే అవకాశం ఉంది. రాష్ట్ర హైకోర్టులో ఎన్నికల విషయంలో వేసిన రిట్‌ పిటిషన్లపై తీర్పు వెలువడనుంది. గురువారం వాదనలు పూర్తయ్యాయని శుక్రవారం మధ్యాహ్నంలోగా తీర్పు వెలువడుతుందని తెబొగకాసం ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, కార్పొరేట్‌ చర్చల కమిటీ ప్రతినిధి ఏనుగు రవిందర్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఎన్నికల షెడ్యూల్‌ నిర్ణయం కోసం నేడు కేంద్ర కార్మికశాఖకు చెందిన డిప్యూటీ లేబర్‌ కమిషనర్‌(డీఎల్‌సీ) సమక్షంలో యాజమాన్యం, కార్మిక సంఘాలతో చర్చలు జరగనున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన అనంతరం దానికి అనుగుణంగా చర్చల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
గుర్తింపు ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే అంశంపై అందరి దృష్టి నేటి కోర్టు తీర్పు, డీఎల్‌సీ వద్ద జరిగే చర్చలవైపు మళ్లింది. జమిలి ఎన్నికలపై పార్లమెంటు సమావేశాల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం, తెలంగాణ శాసనసభకు అక్టోబరు నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం ఉండటంతో సింగరేణి కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు ఎలా నిర్వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. సింగరేణి విస్తరించిన ఆరు జిల్లాల పాలనాధికారులు చొరవ తీసుకుని ఎన్నికల నిర్వహణకు ముందుకు రావాల్సి ఉంటుంది. సింగరేణి యాజమాన్యం సొంతగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. ఎన్నికల వాయిదా కోరుతూ గతంలో సింగరేణి యాజమాన్యం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించిన విషయం విదితమే. గుర్తింపు సంఘం కాలపరిమితిని ముందుగానే నిర్ణయించాలంటూ తెబొగకాసం.. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగియడంతో ఎన్నికలు వెంటనే జరపాలంటూ ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మూడు పిటిషన్లపై శుక్రవారం తుది తీర్పు వెలువడనుంది. ఒకవేళ కోర్టు ఎన్నికలకు అనుకూలంగా తీర్పునిస్తే డీఎల్‌సీ సమక్షంలో నోటిఫికేషన్‌ ఖరారు కానుంది.

సమాన ప్రాతినిధ్యం కల్పించాలంటూ..

రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దగ్గరలో ఉండటంతో రెవెన్యూ, పోలీసు యంత్రాంగం సింగరేణి ఎన్నికల నిర్వహణకు ముందుకు వస్తే తప్ప సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బ్యాలెట్‌ బాక్సులు వినియోగించాలా, ఈవీఎంలు వాడాలా అన్న విషయంలోనూ కార్మిక సంఘాల మధ్య ఇప్పటివరకు ఏకాభిప్రాయం కుదరలేదు. కొన్ని సంఘాలకు అసలు ఎన్నికలు నిర్వహించడమే ఇష్టం లేదు. ఎన్నికలు జరిగితే ఓటమి తప్పదనే విషయం వాటికి తెలుసు. తమ అంతరంగం బయటపడకుండా ఎన్నికలు జరపాలంటూనే.. అప్పటి వరకు అన్ని సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలంటూ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నాయి. యాజమాన్యంతో చర్చలు జరిపే అవకాశం ఉంటే సరిపోతుందనే ఉద్దేశంతో చాలా సంఘాలు ఉన్నాయి. కోల్‌ ఇండియా మాదిరిగా జాతీయ సంఘాలన్నింటికీ సమాన ప్రాతినిధ్యం కల్పించాలని నాయకులు దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. సంఘాలన్నీ యాజమాన్యంతో చర్చలు జరపడానికి తహతహలాడుతున్నాయే తప్ప, కార్మికవర్గం సమస్యలపై పూర్తిస్థాయిలో దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణిలో గుర్తింపు ఎన్నికల జరిగితే తమకు మేలు జరుగుతుందని తెబొగకాసం, ఏఐటీయూసీ అంచనా వేస్తున్నాయి. మిగతా సంఘాల నేతల్లో కొందరు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తుండటంతో సింగరేణి ఎన్నికలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పైకిమాత్రం ఎన్నికలు జరగాల్సిందేనంటూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు