logo

మరోమారు సర్వే?

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్‌ కమిటీ, ప్రదేశ్‌ సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లను పరిశీలించిన విషయం విదితమే.

Published : 22 Sep 2023 05:49 IST

కాంగ్రెస్‌ అభ్యర్థుల్లో ఉత్కంఠ..

ఈనాడు, ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే, ఆసిఫాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాపై స్క్రీనింగ్‌ కమిటీ, ప్రదేశ్‌ సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు, ముగ్గురు పేర్లను పరిశీలించిన విషయం విదితమే. స్క్రీనింగ్‌ కమిటీ పరిశీలన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకోనుంది. ఈ నేపథ్యంలో మరోసారి సర్వే చేయడానికి అధిష్ఠానం నిర్ణయించినట్లుగా సమాచారం. జిల్లాలో మారుమూల గ్రామాలకు సైతం సర్వే బృందాలు తిరుగుతూ అభ్యర్థుల బలాలు, బలహీనతలు, ప్రజల్లో ఉన్న పట్టు తదితర అంశాల గురించి సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు. ఈ నివేదిక ఆధారంగానే అభ్యర్థులకు టికెట్ కేటాయించే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

  • ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో అజ్మీరా శ్యాంనాయక్‌, మర్సుకోల సరస్వతీ, రాఠోడ్‌ గణేశ్‌ల మధ్య టికెట్ పోరు తీవ్రంగా ఉంది. ఇందులో ఎవరికి వారే అధిష్ఠానాన్ని తమ మద్దతు తెలిపే నాయకులతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ తరుణంలో డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాద్‌ అనారోగ్యానికి గురయ్యారు. పదవిని వదులుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావుకు జిల్లా ఇన్‌ఛార్జిగా డీసీసీ పదవి ఇస్తున్నారనే ప్రచారం సాగగా.. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటున్నారని, వారం రోజుల్లో తిరిగి పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ప్రస్తుతం టికెట్ కేటాయించే సర్వేనే కీలకమని, అభ్యర్థుల వడపోత తుదిదశకు చేరుకుందని, పార్టీ అధ్యక్షుల మార్పు ప్రధానాంశం కాదని వారు చెబుతున్నారు. సిర్పూర్‌-కాగజ్‌నగర్‌ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల మధ్యే టికెట్ పోరు ఉంది. కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
  • సర్వే బృందాలు ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ నుంచి పోటీ పడుతున్న ఓ అభ్యర్థి వద్దే బస చేసి, నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో మమేకమవుతూ వివరాలు సేకరిస్తున్నారు. ఈ తరుణంలో ఆయనకే సర్వే నివేదిక అనుకూలంగా ఉంటుందేమోననే అభిప్రాయాలు పోటీపడే ఇతర అభ్యర్థులు వ్యక్తం చేస్తున్నారు. అభ్యర్థులను ఖరారు చేసే సమయంలో పార్టీ పెద్దలు అన్ని చోట్ల ర్యాపిడ్‌ సర్వే చేయిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. సర్వే బృందం ఓ అభ్యర్థి వద్ద ఉన్నంత మాత్రాన ఆయనకు అనుకూలంగా నివేదిక ఏమీ ఉండదని, గెలిచే సత్తా ఉన్న వారికే వీరు గుర్తిస్తారని మరో వర్గం అభిప్రాయపడుతోంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని