logo

ప్రణాళిక బాగు.. పంపిణీ జాగు!

వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, స్వయం ఉపాధి తదితర వాటికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఇందుకు ఏటా బ్యాంకర్ల కమిటీ వార్షిక రుణ ప్రణాళిక రూపొందిస్తుంది.

Published : 22 Sep 2023 05:55 IST

రూ. 2,653.03 కోట్లతో ఖరారు..

వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేస్తున్న జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, న్యూస్‌టుడే: వ్యవసాయం, విద్య, గృహ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, స్వయం ఉపాధి తదితర వాటికి బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తారు. ఇందుకు ఏటా బ్యాంకర్ల కమిటీ వార్షిక రుణ ప్రణాళిక రూపొందిస్తుంది. దీనిలో ఏ రంగాలకు ఎంత మొత్తం రుణం ఇవ్వాలన్న లక్ష్యాలను బ్యాంకుల వారీగా నిర్దేశిస్తుంది. జిల్లాలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వ్యవసాయ, అనుబంధ, ఇతర రంగాలకు రూ.2,653.03 కోట్లతో వార్షిక రుణ ప్రణాళిక ఖరారు చేసి విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే.. 7.15 శాతం పెంచి రూపొందించారు.  ఏటా లక్ష్యాన్ని పెంచి ప్రణాళిక తయారు చేస్తున్నా.. పంపిణీలో 50 శాతం చేరకపోవడంతో రైతులు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఎదురవుతోంది.

జిల్లాలో 1.22 లక్షలకు పైగా రైతులు ఉండగా.. సుమారు 4.40 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేస్తున్నారు. ఏటా సుమారు 70-80 వేల మంది రైతులకే బ్యాంకుల ద్వారా రుణాలు అందుతున్నట్లు సమాచారం. గతంలో కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు అందించేవి. కానీ మూణ్నాలుగేళ్లుగా నిలిపి వేశారు. జిల్లాలో ఈ ఏడాది పంట రుణ లక్ష్యం రూ.1,519.40 కోట్లుగా నిర్దేశించారు. కిందటిసారితో పోలిస్తే 1.77 శాతం పెంచారు. వీటిలో జూన్‌ వరకు రూ.396.91 కోట్లు (26.1 శాతం) పంపిణీ చేసినట్లు లెక్కల్లో చూపారు. మొత్తం నిర్దేశించిన రుణ లక్ష్యం రూ.2,653.03 కోట్లలో జూన్‌ 30వ తేదీ వరకు రూ.600.04 కోట్లు(22.6 శాతం) పంపిణీ చేసినట్లు చెబుతున్నారు.

కాగితాల్లోనే లెక్కలు..

ప్రభుత్వం ఏటా పంట పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తున్నా.. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు.. ఇలా ఖర్చులు పెరిగాయి. ఆ డబ్బులు సరిపోక బ్యాంకు రుణాలపై ఆధారపడుతుంటారు. పూర్తిస్థాయిలో రుణాలు ఇచ్చేందుకు బ్యాంకుల వెనుకడుగు వేస్తున్నాయి. కొందరు సక్రమంగా ఇస్తున్నా.. కొన్ని బ్యాంకుల కొర్రీలతో రైతులు ఏమీ చేయలేక, ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు.

గతేడాది 49.82 శాతమే..  

గతేడాది పంట రుణ లక్ష్యం రూ.1492.55 కోట్లు నిర్దేశించగా.. రూ.738.35 కోట్లు పంపిణీ చేశారు. అంటే లక్ష్యంలో సగం మాత్రమే ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. వ్యవసాయ, అనుబంధ, ఇతర రంగాలకు కలిపి మొత్తం వార్షిక రుణ ప్రణాళిక రూ.2463.44 కోట్లు కాగా పంపిణీ చేసింది రూ.1,227.37 కోట్లు. అంటే 49.82 శాతమే. ఇచ్చే పంట రుణాల్లోనూ పూర్తి స్థాయిలో కాకుండా మెజారిటీ రైతులవి, పాతవి పునరుద్ధరించి కొంత అదనంగా కలిపి కొత్తగా ఇచ్చినట్లు లెక్కలు చూపుతున్నట్లు రైతులు చెబుతున్నారు.


లక్ష్యం మేరకు ఇవ్వాలి
దీపక్‌ తివారీ, అదనపు కలెక్టర్‌

వార్షిక రుణ ప్రణాళికలో కేటాయించిన లక్ష్యం మేరకు వ్యవసాయ, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, విద్య, మహిళ సంఘాలకు బ్యాంకులు రుణాలు అందించాలి. ప్రతి మూడు నెలలకు బ్యాంకర్ల సమావేశంలో ఏ మేరకు సాధించారో బేరీజు వేసుకోవాలి. వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న స్వయం ఉపాధి పథకాల రుణాలు, ట్రైకార్‌ రుణాలను అందించి ఆదుకునేలా చూస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు