logo

కలప రవాణాలో కొత్త కోణాలు..

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉన్న కలప డిపోల్లోని దుంగలు తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే తక్కువ ధరకే వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆసక్తి కనబరుస్తున్నారు.

Published : 22 Sep 2023 05:55 IST

మహారాష్ట్ర నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా వస్తున్న కలప లారీని నెల కిందట చింతలమానెపల్లి గూడెం వంతెన వద్ద అధికారులు స్వాధీనం చేసుకున్నారు

ఈనాడు, ఆసిఫాబాద్‌: మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో ఉన్న కలప డిపోల్లోని దుంగలు తెలంగాణ రాష్ట్రంతో పోలిస్తే తక్కువ ధరకే వస్తున్నాయి. దీంతో ఇక్కడివారు ఆసక్తి కనబరుస్తున్నారు. కాగజ్‌నగర్‌ కలప డిపోలో ఒక ఫీట్ దుంగ రూ.3,500-4,000 వరకు ఉండగా.. మహారాష్ట్రలో రూ.1500-2500 వరకే వస్తోంది. మూడు రోజుల కిందట చింతగూడకు చెందిన ఓ మినీ వ్యాన్‌లో సోఫా సెట్ తరలించుకుపోతుండగా.. రెబ్బెన వద్ద అటవీ అధికారులు పట్టుకున్న విషయం విదితమే. ఈ ఘటనతో కలప దందాలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. చింతగూడలో అనాదిగా 30 కుటుంబాలవారు కలపతో ఫర్నిచర్‌ తయారు చేసుకుంటూ జీవిస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో కలప తక్కువ ధరకే వస్తున్నాయనే కారణంతో.. వీరిలో చాలా మంది కలపను అక్కడి నుంచి అన్నీ అనుమతులతో తీసుకువస్తున్నారు. అయితే స్థానిక కలప డిపోలో సైతం దుంగలను తీసుకోవాలని అధికారుల నుంచి వీరిపై ఒత్తిడి వస్తోంది. ఇక్కడ చెడిపోయినవి, చెదలు పట్టినవి తీసుకోలేక, మహారాష్ట్రకు వెళ్తున్నామని, ఒకవేళ తీసుకోని తరుణంలో తరచూ దాడులు చేస్తారనే ఆ భయంతోనే పనికిరాని కర్రలను కొనుగోలు చేస్తున్నామని వీరంతా వాపోతున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టేకుతో పోలిస్తే జిల్లా టేకు కలప నాణ్యంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ తరుణంలో ఇక్కడ తయారు చేసే కలప సామగ్రికి బయట ప్రాంతాల్లో డిమాండ్‌ ఉంటోంది. మహారాష్ట్ర నుంచి వచ్చే కలప లారీలకు వేబిల్లు, పర్మిట్లు తేదీలతో సహా ఉంటాయి. అయితే కొందరు వ్యక్తులు, సామిల్‌ల యజమానులు ఒకే పర్మిట్‌తో రెండు, మూడు లారీల్లో కలపను తెస్తున్నారనే ఆరోపణలు  ఉన్నాయి. పర్మిట్లతో తేదీలు దూరాన్ని బట్టి, ఒకటి రెండు రోజుల వ్యవధిలో మాత్రమే అనుమతులు ఇస్తారు. ఇందులో తీసుకెళ్తున్న కలప పొడవు, రకం, అడ్రస్‌ వివరాలన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా తనిఖీలు లేకపోవడంతో సామిళ్లలో అక్రమ దందా జోరుగా సాగుతోంది. అయితే జిల్లాలో ఏ సామిల్‌ పైనా ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తేనే..

ఇతర రాష్ట్రాల్లో, స్థానిక కలప డిపోల్లో కొనుగోలు చేసిన కలపతో చేసిన సామగ్రిని అటవీ అధికారులు సులువుగా గుర్తుపడతారు. అక్రమ కలప దందాకు అడ్డుకట్ట వేయడానికి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి, నిరంతరం పర్యవేక్షిస్తేనే పచ్చదనం పరిరక్షించబడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

పర్మిట్‌ నమూనా


టింబర్‌ డిపోలోని కర్ర గురించి అటవీ అధికారి ఆదేశాలు..

‘‘సార్‌ ఫుల్‌ క్లాస్‌ తీసుకుంటున్నాడు. చింతగూడ వాళ్లకు చెప్పినావా, ఎవరు ఎంత అమౌంట్ కట్టాలో చెప్పు, మొత్తం రూ.4 లక్షల విలువైన కర్ర దుంగలు ఉన్నాయనుకుంటా. మనిషి బట్టి రూ.50 వేలు, రూ.20 వేలు, రూ.10 వేలు ఇలా చెప్పి, లాట్లు రాసుకో. సీఎఫ్‌ సార్‌ వస్తాడు. ఆయనకు మొత్తం సేల్‌ చేస్తానని చెప్పాను. కరాబ్‌ అయినవి, బాంబో, టేకు అన్నీ తీసేయాలి. మొత్తం ఖతం చేయాలి. 20 మంది వ్యక్తులతోనూ రూ.5 వేల చొప్పున ఎంఈడీ కట్టేయ్యాలి. రేపు పని పూర్తయ్యేలా చూడాలి.’.. ఓ అటవీ అధికారి చిరుద్యోగితో కలప డిపోలో ఉన్న దుంగలు ఎలాగైనా విక్రయించాలని అన్న మాటలివి.


అధికారులపై ఆరోపణలు..

తెలంగాణ కలప డిపోలో కర్ర దుంగలను కొనుగోలు చేసిన వారు ఫర్నిచర్‌ తయారు చేసిన అనంతరం, వాటిని విక్రయించుకోవడానికి మళ్లీ సంబంధిత అధికారితో ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అడిగినంత ఇవ్వకుంటే సంతకం చేయమని కొందరు అధికారులు భీష్మించుకుంటున్నారని తయారీదారులు ఆరోపిస్తుండగా.. వాస్తవంగా టింబర్‌ డిపోలో కొనుగోలు చేసిన కర్రతో కాకుండా ఇతర ప్రాంతాల్లో గుట్టుచప్పుడు కాకుండా, జీరోగా తీసుకువచ్చిన కర్రతోనే సామగ్రిని తయారు చేయడంతోనే అభ్యంతరం చెబుతున్నామని అధికారులు పేర్కొంటున్నారు. కలపతో తయారు చేసే ఫర్నీచర్‌ను తరలించే క్రమంలో డబ్బులు ఇచ్చిన వాహనాలను కొన్నిచోట్ల అధికారులు విడిచిపెడుతున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని