logo

రుణమివ్వరు.. డబ్బులివ్వరు!

తలమడుగు మండలంలో పని చేసే గంగయ్య జమ డబ్బుల గడువు ముగిసింది. వడ్డీతో సహా కలిపి ఆయనకు రావాల్సిన రూ.8.10 లక్షలను 2023 ఫిబ్రవరిలోనే అందించాలి.

Published : 22 Sep 2023 05:57 IST

అక్కరకు రాని ఉద్యోగుల జీవిత బీమా
న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ పట్టణం

ఆదిలాబాద్‌లోని రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం

  • తలమడుగు మండలంలో పని చేసే గంగయ్య జమ డబ్బుల గడువు ముగిసింది. వడ్డీతో సహా కలిపి ఆయనకు రావాల్సిన రూ.8.10 లక్షలను 2023 ఫిబ్రవరిలోనే అందించాలి. ఆయన తన వద్ద ఉన్న బాండు కార్యాలయంలో సమర్పించగా చెక్కు ఖజనా శాఖకు పంపించారు. డబ్బులు ఇప్పటి వరకు ఆయన చేతికందలేదు.

  • గుడిహత్నూర్‌లో పని చేసే హెడ్‌ కానిస్టేబుల్‌ ఇంటి నిర్మాణం కోసం జమ చేసుకున్న డబ్బుల్లోంచి రూ.2.50 లక్షలు రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 2022 డిసెంబరు నుంచి ఆయన రుణం కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అడిగితే ట్రెజరీ కార్యాలయంలో ఈ-కుభేర్‌లో పెండింగ్‌లో ఉందని సమాధానం దాటవేస్తున్నారు. ఇలా ఒకరిద్దరు కాదు వందల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా శాఖ అక్కరకు రాకుండా పోతోంది. ఉద్యోగులు తమ వేతనం నుంచి ప్రతి నెల జమ చేసుకున్న డబ్బుల్లోంచి రుణం ఇవ్వడం మాట అటుంచి గడువు ముగిసినా ఇవ్వాల్సిన డబ్బులు సైతం చెల్లించడం లేదు. గట్టిగా అడిగితే తమ తప్పిదమేమి లేదని ఖజానా శాఖలో పెండింగ్‌లో ఉందంటూ కార్యాలయ ఉద్యోగులు చేతులు దులుపేసుకుంటుండటం విమర్శలకు తావిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో పని చేసే అన్ని శాఖల ఉద్యోగులు, అధికారులకు వారి వేతనాన్ని బట్టి బీమా కార్యాలయంలో డబ్బులు జమ అవుతుంటాయి. ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పోలీసులు, ఆబ్కారీ, అటవీ, పురపాలక, పంచాయతీ, ఐసీడీఎస్‌, వైద్యారోగ్య శాఖ ఇలా అందరు ఉద్యోగులు తప్పనిసరిగా ఇందులో బీమా తీసుకోవాల్సిందే. వీరందరి కోసం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌లో రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా శాఖ జిల్లా కార్యాలయాన్ని అందుబాటులో ఉంచారు. ఇందులో ప్రత్యేకంగా సహాయ సంచాలకులు(డైరెక్టర్‌), ఇతర సిబ్బందిని నియమించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇక్కడి నుంచే పర్యవేక్షణ ఉంటుంది. ఉద్యోగుల మూలవేతనం(బేసిక్‌ పే) ఆధారంగా నెలకు కనిష్ఠంగా రూ.750 జమ చేయాల్సిందే. గరిష్ఠంగా రూ.20 వేల వరకు జమ చేసుకునే వీలుంది. ఎంత ఎక్కువ జమ చేసుకుంటే అంత ఎక్కువ ప్రయోజనాలు వర్తిస్తాయి. ఒకవేళ ప్రమాదవశాత్తు మరణిస్తే బీమా వర్తిస్తుంది. ఉద్యోగి పాలసీ గడువు ముగిశాక వడ్డీతో సహా డబ్బులు తిరిగి ఇస్తారు. ఇందులో ఒక వెసులుబాటు సైతం కల్పించారు. జమ చేసుకున్న డబ్బుల్లోంచి అవసరమున్నప్పుడు రుణం తీసుకోవచ్చు. ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉన్నా డబ్బులు రాకపోవడమే అసలు సమస్యగా మారింది. డీడీఓ(డ్రాయింగ్‌ అధికారుల) ద్వారా దరఖాస్తు చేసుకొని నెలల తరబడి ఉద్యోగులు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం ఆదిలాబాద్‌లోనే ప్రభుత్వ జీవిత బీమా కార్యాలయం(టీఎస్‌ జీఎల్‌ఐ) కార్యాలయం ఉండటం వల్ల మంచిర్యాల, నిర్మల్‌, కుమురం భీం జిల్లావాసులు సైతం ఆదిలాబాద్‌కు వచ్చి తమ గోడు వెల్లబోసుకుంటున్నారు. ట్రెజరీ కార్యాలయానికి సైతం వెళ్లి ఆరా తీస్తున్నారు. ఈ-కుభేర్‌లో పెండింగ్‌లో ఉందని తెలియడంతో వెనుదిరుగుతున్నారు. పదవీ విరమణ పొందిన చాలామంది డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు.

28 వేల మందికిపైగా ఖాతాదారులు..

జీవిత బీమా కార్యాలయంలో 28,102 మంది వరకు ఖాతాదారులున్నారు. వీరికి రూ.కోట్లలో నిధులు రావాలి. ప్రస్తుతం ఇందులో 800 మందికిపైగా ఉద్యోగులు రుణాల కోసం ఎదురుచూస్తున్నారు. పదవీ విరమణ పొందిన, బాండు గడువు ముగిసిన ఉద్యోగులు మరో 200 మంది వరకు ఉంటారు. వీరందరికి రావాల్సిన డబ్బులు చేతికందక ఉద్యోగుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

  • ఈ విషయమై కార్యాలయ అధికారులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా తాము వివరాలు వెల్లడించడానికి వీల్లేదంటూ సమాధానం దాటవేశారు. తమ వద్ద ఎలాంటి సమస్య లేదని.. ట్రెజరీలోనే పెండింగ్‌ ఉందంటూ తెలిపారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని