logo

విలువైన స్థలంపై తాత్సారం..

బల్దియాకు కాసుల వర్షం కురిపించే రూ.కోట్ల విలువైన స్థలంపై పురపాలక యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న లీజు స్థలాన్ని స్వాధీనం చేసుకుని దాదాపు రెండేళ్లు కావొస్తున్నా తగిన నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తోంది.

Updated : 22 Sep 2023 06:10 IST

ఎటూ తేల్చని బల్దియా

పట్టణం నడిబొడ్డున ఖాళీగా ఉన్న అత్యంత డిమాండ్‌ కలిగిన బల్దియా లీజు స్థలం

న్యూస్‌టుడే, ఆదిలాబాద్‌ అర్బన్‌: బల్దియాకు కాసుల వర్షం కురిపించే రూ.కోట్ల విలువైన స్థలంపై పురపాలక యంత్రాంగం నిర్లక్ష్యం వహిస్తోంది. పట్టణ నడిబొడ్డున ఉన్న లీజు స్థలాన్ని స్వాధీనం చేసుకుని దాదాపు రెండేళ్లు కావొస్తున్నా తగిన నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తోంది. అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించి ఆదాయ వనరులను పెంచుకునేందుకు అద్భుత అవకాశాలున్నాయి. పార్కింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేసి ప్రజల ట్రాఫిక్‌ ఇబ్బందులను తీర్చేందుకు వెసులుబాటు సైతం ఉంది. అయినా ఆ లీజు స్థలంపై ఎటూ తేల్చక వృథాగా వదిలేయడం విమర్శలకు తావిస్తోంది. కార్మికులకు జీతభత్యాలు చెల్లించేందుకు సైతం నిధుల సమస్యను ఎదుర్కొంటున్న యంత్రాంగం, ఆదాయం పెంచుకునే అవకాశమున్నా సద్వినియోగం చేసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

స్వాధీనం చేసుకుని 22 నెలలు..

జిల్లా కేంద్రంలో వ్యాపారపరంగా అత్యంత డిమాండ్‌ ఉన్న సినిమా రోడ్డులోని బల్దియా లీజు స్థలాన్ని 2002లో గణేష్‌ థియేటర్‌కు లీజుకు ఇచ్చారు. ఏడాదికి రూ.2.50 లక్షలు అద్దె నిర్ణయించి 15 ఏళ్ల కాలానికి ఒప్పందం చేసుకున్నారు. లీజు గడువు 2017లోనే ముగిసింది. న్యాయవివాదాల కారణంగా నాలుగేళ్ల తర్వాత లీజు స్థలం బల్దియా వశమైంది. కోర్టు ఆదేశాలతో 2021 నవంబరు 10న బల్దియా అధికారులు థియేటర్‌కు తాళం వేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లీజుదారు అప్పటికే అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నిర్మించి ఉండటంతో గతేడాది నవంబరులో దాన్ని సైతం జేసీబీలతో నేలమట్టం చేశారు. అప్పటి నుంచి ఆ స్థలం ఖాళీగానే ఉంది. అక్కడ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేస్తే అద్దె గదులను దక్కించుకునేందుకు బహిరంగ వేలంలో విపరీతమైన పోటీ నెలకొనే అవకాశముంది.


కాలయాపనతో నష్టం..

గతంలో అక్కడున్న 31 దుకాణాలను అద్దె ప్రాతిపదికన వేలం వేయాలని నిర్ణయించి కౌన్సిల్‌ సమావేశ ఎజెండాలో పొందుపర్చారు. అయితే ఆ నిర్ణయాన్ని విపక్ష సభ్యులు స్వాగతించినా అనూహ్యంగా కొందరు అధికార పక్ష సభ్యులు అడ్డుపడటంతో అది మరుగునపడింది. తర్వాత ఆ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను నేలమట్టం చేశారు. వ్యాపారపరంగా అత్యంత రద్దీగా ఉన్న ప్రాంతం కావడంతో ప్రజలు ట్రాఫిక్‌ ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అయిదు నెలల కిందట మరోసారి ఆ ప్రాంతంలో పార్కింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నారు. నిర్ణీత రుసుము చెల్లించి వాహనాలు పార్కింగ్‌ చేసుకునేందుకు ఆసక్తి ఉన్న ఏజెన్సీల నుంచి టెండర్‌ పిలిచారు. ఆ స్థలానికి బల్దియా అధికారులు కనీస అద్దె నెలకు రూ.2 లక్షలు నిర్ణయించడంతో టెండర్‌లో పాల్గొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కొత్త చట్టం ప్రకారం లీజు స్థలాల విషయంలో కౌన్సిల్‌తో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఉంది. అయినా రూ.కోట్ల విలువైన స్థలంపై ఓ నిర్ణయానికి రావడం లేదు.


త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం
ఎ.శైలజ కమిషనర్‌, బల్దియా

బల్దియా లీజు స్థలంలో పార్కింగ్‌ జోన్‌ను ఏర్పాటు చేయాలని అనుకున్నా నిర్వహణకు ఎవరూ ముందుకు రాలేదు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్వరలోనే లీజు స్థలంపై ఓ నిర్ణయం తీసుకుంటాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు