logo

సరిహద్దులో నిద్రపోతున్న నిఘా

ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటారు. కానీ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేక నిఘా వైఫల్యం, భద్రతా లోపాలు బహిర్గతమవుతున్నాయి.

Published : 22 Sep 2023 06:04 IST

సీసీ కెమెరాల మరమ్మతులు కరవు

న్యూస్‌టుడే, బోథ్‌, తలమడుగు: ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం అంటారు. కానీ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు లేక నిఘా వైఫల్యం, భద్రతా లోపాలు బహిర్గతమవుతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌, సొనాల, తలమడుగు, జైనథ్‌, బేల మండలాలతో మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కలిసి ఉంది. కొన్ని చోట్ల ప్రభుత్వం చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినా అవి నామమాత్రంగానే ఉన్నాయి. పోలీసు సిబ్బందిని నియమించటం లేదు. తనిఖీలు నామమాత్రంగానే కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ అంతర్రాష్ట్ర రహదారుల గుండా అక్రమ రవాణా సులువుగా సాగుతోంది. ఆదిలాబాద్‌ పట్టణంలో తరచూ దొంగలు చోరీలు చేసి సులభంగా తప్పించుకుంటున్నారు. దేశీదారు, మట్కా, జూదం లాంటి వాటికి బానిసైన వారు, నిర్వాహకులు యథేచ్ఛగా సరిహద్దులు దాటుతూ దర్జాగా వారి వ్యాపారాలను కొనసాగిస్తున్నారు.

రాష్ట్రంలో త్వరలో ఎన్నికల హడావుడి మొదలవనున్న దృష్ట్యా సరిహద్దు ప్రాంతాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాల ఏర్పాటుతో అక్రమ రవాణాను, డబ్బు రవాణాను సులభంగా అరికట్టవచ్చు. జిల్లాలో ఇటీవల వరుస చోరీలు జరుగుతున్న నేపథ్యంలో సీసీ కెమెరాలు అత్యంత అవసరం. సరిహద్దులో మట్కా యథేచ్చగా కొనసాగుతున్న దృష్ట్యా ఇక్కడి ప్రజలు వాటికి బానిసలుగా మారుతున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా సరిహద్దు చెక్‌పోస్టుల్లో, సరిహద్దు ప్రాంతాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.  


నిండా నిర్లక్ష్యం..

సొనాల ప్రయాణప్రాంగణంలో సీసీ కెమెరాల స్థానంలో మిగిలిన ఖాళీ డబ్బా, చెట్టు కొమ్మల్లో కలిసిపోయిన సీసీ కెమెరా

జిల్లాలో ఇటీవల నూతనంగా ఏర్పడిన మండలం సొనాల మహారాష్ట్ర సరిహద్దును ఆనుకొని ఉంది. అంతర్రాష్ట్ర రహదారిపై ఈ గ్రామం గుండా ప్రతి రోజు వందల సంఖ్యలో వాహనాలు మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఇచ్చోడ, బోథ్‌, నిర్మల్‌ వైపు వెళుతుంటాయి. ఈ గ్రామంలో సీసీ కెమెరాలు పని చేయక పలు కేసుల్లో పోలీసులకు ఇబ్బందిగా మారింది. గతంలో గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు గతేడాది మరమ్మతులకు గురికాగా.. ఇప్పటికీ ఏర్పాటు చేయటంలో అలసత్వం వహిస్తున్నారు. కెమెరాలు ఉన్నా పని చేయని పరిస్థితి నెలకొంది. నిత్యం వందలాది వాహనాలు ప్రయాణించే ప్రయాణ ప్రాంగణంలో ఖాళీ డబ్బానే మిగిలింది. సరిహద్దు గ్రామం నిగినిలో వీటిని ఏర్పాటు చేయాలి.


పని చేయని కెమెరాలు

లక్ష్మీపూర్‌ అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద నిరుపయోగంగా సీసీ కెమెరాలు

తలమడుగు మండలం సరిహద్దు ప్రాంతంలో లాలూగాడ్‌, లక్ష్మీపూర్‌ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల గుండా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు మహారాష్ట్రకు, మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌కు రాకపోకలు సాగిస్తుంటాయి. కేసుల్లో దర్యాప్తునకు ఉపయోగపడేలా గతంలో లాలూగాడ్‌ గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారి పక్కనే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కెమెరాలు వినియోగంలో లేవు. వాటికి మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద సైతం కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

అంతర్రాష్ట్ర రహదారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని