logo

చమురు @ నల్లబజారు

జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో వారం రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీవ్రమైంది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు నిల్వలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతోపాటు సరఫరాదారులు

Published : 28 May 2022 03:46 IST

బంకుల్లో ‘నోస్టాక్‌’

పట్టణ శివారులోని ఓ దుకాణం వద్ద పెట్రోల్‌ నిల్వలు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో వారం రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ కొరత తీవ్రమైంది. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో చమురు నిల్వలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతోపాటు సరఫరాదారులు దిగువస్థాయి డీలర్లకు విధించిన కొత్త నిబంధనలతో బంకులకు పూర్తిస్థాయిలో నిల్వలు చేరని పరిస్థితి నెలకొంది. ఫలితంగా వినియోగదార్లకు సరిపడా చమురు బంకుల వద్ద అందుబాటులో ఉండడం లేదు. గత వారం రోజులుగా పెట్రోల్‌ బంకుల్లో నోస్టాక్‌ బోర్డులు ప్రత్యక్షమవుతున్నాయి. ఇదే సమయంలో బయట మార్కెట్‌లో నిల్వలు సమృద్ధిగా ఉంటుండటంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. డిమాండ్‌ను ఆసరాగా తీసుకున్న బయట వ్యాపారులు ఒక్కో లీటరుకు అదనంగా రూ.30 వరకు వసూలు చేస్తున్నారు.

సరఫరాలో కోత : పెట్రోల్‌ బంకులకు గతంలో సరఫరా చేసే నిల్వల్లో కోత విధిస్తుండడంతో పూర్తిస్థాయిలో నిర్వాహకులు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది  ఇటీవల మారిన మారిన నిబంధనల ప్రకారం బంకులకు ఇచ్చే నిల్వల్లో 40 శాతం కోత విధించారు. గతంలో రోజుకు ఓ ట్యాంకు తెప్పించుకునే స్థాయి ఉన్న బంకులకు సైతం తాజాగా రెండు రోజులకు ఒకటి రావడం కష్టంగా మారింది. పాడేరు పట్టణంలో నాలుగు పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ఒక్కో బంకు ఓ ట్యాంకును ఒక రోజు మొత్తం విక్రయించేవారు. ఒక ట్యాంకులో 12 వేల లీటర్ల వరకు ఉంటుంది. ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో వచ్చిన నిల్వలు గంటలోనే అమ్మేస్తూ నోస్టాక్‌ బోర్డులు పెట్టేస్తున్నారు. పాడేరు జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో వాహన సంచారం, రద్దీ ఎక్కువైంది. దీనికి అనుగుణంగానే చమురు వినియోగశాతం పెరిగిందని భావిస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో ప్రత్యేక అనుమతులతో నిల్వలు పెంచి కొరత లేకుండా చూడాలని వినియోగదారులు కోరుతున్నారు.

పాడేరులో రద్దీగా ఉన్న ఓ పెట్రోల్‌ బంకు


అదనంగా రూ.30

పాడేరు పట్టణ శివారు ప్రాంతాల్లో పెట్రోల్‌, డీజిల్‌ను అనధికారికంగా విక్రయిస్తున్నారు. ప్రధానంగా చింతలవీధి, బంధవీధి, గుత్తులపుట్టు, నక్కలపుట్టు, మినుములూరు, బొక్కెళ్లు గ్రామాల్లో ఆయిల్‌ దొరుకుతోంది. పెట్రోల్‌ బంకుల వద్ద నోస్టాక్‌ బోర్డులు చూసిన వినియోగదారులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు, ఆసుపత్రి, ఇతర అత్యవసరాలకు వెళ్లేవారు పెట్రోల్‌, డీజిల్‌ కోసం బయట మార్కెట్లపై ఆధారపడుతున్నారు. దీనిని అవకాశంగా తీసుకున్న బయట వ్యాపారులు లీటరు పెట్రోల్‌ను రూ.140 చొప్పున విక్రయిస్తున్నారు. మరోవైపు బయట మార్కెట్‌ ధరలతో తమకు సంబంధం లేదని స్థానిక బంకు నిర్వాహకులు పేర్కొంటున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీటరు పెట్రోల్‌ ధర రూ.10 వరకు తగ్గించింది. కొత్త ధర ప్రకారం లీటరు రూ.110 వరకు ఉంది. అంతకు ముందు రోజు నుంచే జిల్లా కేంద్రమైన పాడేరులో ఆయిల్‌ కొరత ఏర్పడింది. దీని ఫలితంగా దేశమంతా చమురు ధరలు తగ్గినా పాడేరులో మాత్రం రూ. 30 ఎక్కువ ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఇబ్బందులు లేకుండా చూస్తాం

- రుద్రరాజు సత్యనారాయణరాజు, జిల్లా పౌరసరఫరాల అధికారి

జిల్లాలోని పెట్రోల్‌ బంకులపై నివేదిక సేకరిస్తున్నాం. జిల్లా కేంద్రంలో నాలుగు బంకుల్లో డీజిల్‌, పెట్రోల్‌ ట్యాంకులు ఏ మేరకు సరఫరా అవుతున్నాయి. వాటిని ఏ విధంగా విక్రయిస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నాం. నిల్వలు ఉండి నోస్టాక్‌ బోర్డులు ప్రదర్శించే వారిపై ప్రత్యేక దృష్టి పెడతాం. బయట మార్కెట్‌కు నిల్వల తరలింపుపై ఆకస్మిక తనిఖీలు చేపడతాం. పెట్రోల్‌ బంకుల్లో మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనపై పరిశీలన చేస్తున్నాం. వినియోగదార్లకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని