logo

‘రేలా’రే రేలా.. చిందేసే వేళ!

మన్యంలోని గిరిజన గ్రామాలకో ప్రత్యేకత ఉంది. వ్యవసాయం చేయాలంటే ముందుగా భూమి పండగలు చేస్తేనే సాగు మొదలుపెడతారు. ఈ పండగలను ఖరీఫ్‌ ఆరంభానికి ముందు వర్షాకాలం వచ్చిన వెంటనే మొదలు పడతారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసులు

Published : 28 Jun 2022 02:53 IST
మన్యంలో ఊపందుకున్న భూమి పండగలు
కూనవరం, చింతూరు - న్యూస్‌టుడే
రహదారిపై గిరిజన మహిళల నృత్యాలు

మన్యంలోని గిరిజన గ్రామాలకో ప్రత్యేకత ఉంది. వ్యవసాయం చేయాలంటే ముందుగా భూమి పండగలు చేస్తేనే సాగు మొదలుపెడతారు. ఈ పండగలను ఖరీఫ్‌ ఆరంభానికి ముందు వర్షాకాలం వచ్చిన వెంటనే మొదలు పడతారు. ఆయా గ్రామాల్లోని ఆదివాసులు మొత్తం ఒక్కటై సంప్రదాయ పద్ధతిలో వీటిని నిర్వహిస్తారు. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటికీ ఆచరిస్తున్నారు. ఈ కాలంలో ఏ గ్రామానికి వెళ్లినా రేలా నృత్యాలతో సందడి చేస్తూ ఆదివాసులు కన్పిస్తుంటారు.

ప్రతి గిరిజన గ్రామంలోనూ ఓ ఇంటి పేరు వారు పెద్దరికం చేస్తూ ఉంటారు. ఆ గ్రామంలో ఆ ఇంటి పేరు వారే ఎక్కువగా ఉంటారు. దీంతో ఏ పండగలు జరగాలన్నా, శుభకార్యాలు జరగాలన్నా వారి ఆధ్వర్యంలోనే జరిపిస్తారు. భూమి పండగలకు ముందు ఆ ఇంటి పేరు వారు ఇలవేల్పు పండగ చేస్తారు. ఆ ఇంటి పేరు ఉన్న వారు మాత్రమే కొంత నగదు వేసుకుని దీన్ని జరుపుతారు. ఇలవేల్పుగా కొలుస్తున్న చెట్టు వద్ద పూజలు చేసి అన్ని రకాల విత్తనాలను అక్కడ ఉంచుతారు. తరువాత గ్రామంలోని ఆ ఇంటిపేరు వారు మొత్తం కలసి సహపంక్తి భోజనాలు చేస్తారు.

ఇలవేల్పు పూజలో గ్రామస్థులు

సంప్రదాయ క్రీడలో అందరూ...

ఇలవేల్పు పండగ జరిగిన మరుసటి రోజు భూమి పండగలు మొదలుపెడతారు. ముందుగా గ్రామంలో కొలుపులు చేసే ప్రాంతంలో పెద్ద గొయ్యి తీసి అందులో సాగులో వినియోగించే పరికరాలు ఉంచుతారు. పూజల అనంతరం మొక్కులు (జంతు బలి) చెల్లించుకుని వేటకు సిద్ధమవుతారు. పరికరాలు ఉంచిన గుంత చుట్టూ మహిళలు రేలా నృత్యాలతో పాటలు పాడుతూ పురుషులను వేటకు ఉత్సాహపరుస్తారు. ఇక్కడ పట్టభద్రులైనా... ఉద్యోగులైనా ఈ సంప్రదాయ క్రీడలో పాల్గొనాల్సిందే. వేటకు ముందు ఓ ప్రాంతంలో కోడిగుడ్డును పెట్టి అక్కడ నుంచి ఏడు విల్లంబులు దూరంలో నిలబడి మహిళలు బాణాలతో దానిని కొడతారు. వారు కొట్టలేని సమయంలో పురుషులు ఆ కోడిగుడ్డును కొడతారు. గుడ్డు పగిలిన ప్రాంతంలో మూడు పుల్లలను పైనుంచి కిందకు వేస్తారు. అవి ఏ దిక్కును చూపిస్తే ఆ దిక్కులో పురుషులు వేటకు వెళతారు. ఈ సమయంలో పురుషులు వేటకు త్వరగా బయలుదేరకపోవడంతో వారిపై మహిళలు రంగు నీళ్లు, పేడ నీళ్లు చల్లి వారిని వేటకు పంపుతారు.

కుక్కలతో కలసి వేటకు సిద్ధమైన గిరిజనులు

తొమ్మిది రోజుల్లోపు...

పురుషులతో పాటు గ్రామంలోని కుక్కలు సాయంగా వెళతాయి. అడవిలో కన్పించిన జంతువులను కుక్కలు నిలువరించడంతో వేటగాళ్లు దానిని సులభంగా వేటాడతారు. జంతువులు దొరికే వరకు వారు అడవిలోనే ఉండాలి. మూడు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. వారు తిరిగొచ్చే వరకు మహిళలు రహదారులపై నృత్యాలు చేస్తూ బాటసారుల నుంచి విరాళాలు సేకరిస్తారు. వేటాడిన జంతువును పూలదండలు వేసి ఘనంగా ఊరిలోకి తీసుకువస్తారు. దానిని గ్రామస్థులంతా కలసి వండుకుని తింటారు. ఇక్కడితో భూమి పండగ ప్రక్రియ పూర్తవుతుంది. తరువాత ఎవరికి ఏది అనుకూలం అనుకుంటే ఆ సాగుకు ఉపక్రమిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని