logo

గోపాలకృష్ణ.. పచ్చదనంపై తృష్ణ

ఆయనకు పచ్చని వాతావరణమంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంటి ప్రాంగణమంతా మొక్కలతో నింపి ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు.  రాజవొమ్మంగి మండలం జడ్డంగి నివాసి గుత్తా గోపాలకృష్ణ కొన్నేళ్ల నుంచి మొక్కలతో సుందరంగా తీర్చి దిద్దారు.

Published : 03 Jul 2022 02:29 IST

ఇంటి ప్రాంగణం ఆహ్లాదకరం
రాజవొమ్మంగి, న్యూస్‌టుడే

పంపర పనసను చూపుతూ...

ఆయనకు పచ్చని వాతావరణమంటే ఎంతో ఇష్టం. అందుకే ఇంటి ప్రాంగణమంతా మొక్కలతో నింపి ఆహ్లాదకర వాతావరణంలో గడుపుతున్నారు.  రాజవొమ్మంగి మండలం జడ్డంగి నివాసి గుత్తా గోపాలకృష్ణ కొన్నేళ్ల నుంచి మొక్కలతో సుందరంగా తీర్చి దిద్దారు. ఎటు చూసినా రకరకాల మొక్కలతో ఆవరణంతా నందన వనంలా కనిపిస్తోంది.

గుత్తా గోపాలకృష్ణ కృష్ణాజిల్లా మొవ్వ గ్రామానికి చెందిన వారు. ఈయన కుటుంబం సుమారు 50 ఏళ్ల క్రితం రాజవొమ్మంగి మండలం జడ్డంగి వచ్చి స్థిరపడింది. ఆయనకు చిన్ననాటి నుంచి మొక్కలంటే ఎంతో ఇష్టం ఉండటంతో పలు రకాల జాతులకు చెందిన మొక్కలను చిత్తూరు, కడియం ఇతర ప్రాంతాల నర్సరీల నుంచి తీసుకొచ్చేవారు. ఇంటి ప్రాంగణంలో ఔషధ, పూల, పండ్ల, సుంగధ ద్రవ్యాలు, పూజకు సంబంధించిన మొక్కలను పెంచుతున్నారు. ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు అక్కడ నర్సరీలను చూసి కచ్చితంగా ఏదో ఒక మొక్క తెచ్చి ఇంటి ప్రాంగణంలో నాటడం అలవాటుగా చేసుకున్నారు. సుమారు ఎకరాన్నర స్థలంలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. సేంద్రియ ఎరువులు వాడుతూ మొక్కల సంరక్షణకు రూ. 25 వేల వరకు వెచ్చిస్తున్నారు. మొక్కలు కొన్ని చెట్లుగా ఎదగడంతో వాటికి కాసిన కాయలు, పండ్లను చూసి ఆయన మురిసిపోతుంటారు.  


చలవజామ

పర్యావరణానికి మేలు

గోపాలకృష్ణకు వ్యవసాయమంటే మక్కువ కావడంతో వరి, కొబ్బరి సాగు కూడా చేపడుతుంటారు. ఇంట్లో నాటు కోళ్లను కూడా పెంచుతున్నారు. రోజు ఇంటికి వచ్చిన వెంటనే వాటి ఆలనాపాలనా చూస్తుంటారు. మొక్కల పెంపకానికి కొంత సమయం కేటాయిస్తుండటంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనడంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ దోహదం చేస్తుందని ఆయన పేర్కొన్నారు. భావితరాల మనుగడకు బంగారు బాటలు వేసే మొక్కలను పెంచడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని చెబుతున్నారు.

పెంచుతున్న మొక్కలివే

* ఒక వైపు ఆకు కూరలు, మరో వైపు అవసరమైన కూరగాయలు పెంచుతున్నారు.

* పుష్పాలు: మల్లి, గులాబి, కనకాంబరం, మందారం, పూజకు ఉపయోగించే వివిధ జాతుల పుష్పాలు ఉన్న మొక్కలు.

* పండ్ల జాతి: పంపరపనస, మామిడి, నేరేడు, జంబో నేరేడు, బత్తాయి, పనస, జామ, చలవ జామ, కమల, నిమ్మ, నారింజ, అరటి, దానిమ్మ, చెరకు, సపోటా, జీడిగింజలు, సీతాఫలం, కాశీరేగు.

* ఔషధ జాతి: ఉసిరి, వేప, కలబంద, రావి, తమలపాకు, మారేడు, వెలగ, తెల్ల జిల్లేడు.

విరగకాసిన పనస

అందరూ ఉన్నత విద్యావంతులే..

రాజవొమ్మంగి:  గోపాలకృష్ణ బీఏ (బీఎల్‌) చదివారు. ఆయన భార్య లీలావతి బీటెక్‌ చేశారు. వివాహ అనంతరం వారిద్దరు టెలిఫోన్‌ ఎక్స్ఛేంజీల కాంట్రాక్టు పనులు చేశారు. ఉన్నత విద్య చదివినా వ్యవసాయం అంటే ఇష్టంతో వరి, పత్తి ఇతర పంటలు సాగుచేస్తున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో సుమారు ఎకరాన్నర స్థలంలో (ఇంటి ఆవరణలో) రకరకాల మొక్కలు పెంచుతున్నారు. వీళ్లకు ఇద్దరు సంతానం. కుమార్తె భావన కృష్ణ ఎంబీబీఎస్‌, పీజీ (రేడియాలజీ) చదివారు. ప్రస్తుతం బెంగళూరు ప్రైవేటు వైద్యురాలిగా పనిచేస్తున్నారు.

* కుమారుడు కృష్ణ సాయిరాం. బిట్స్‌ పిలానీలో బీటెక్‌, ఎంఎస్సీ (బయాలజీ) పూర్తి చేసి పుణెలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని