logo

కందిపప్పు చూస్తే కంగుతినాల్సిందే!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం డ్రైరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన కందిపప్పును చూస్తే ఎవరైనా కంగుతినాల్సిందే. ఎందుకంటే ప్యాకింగ్‌పై ముద్రించిన గడువు తేదీ ముగిసినా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఈ నిల్వలు కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఎప్పుడు ప్యాకింగ్‌ చేసింది

Published : 03 Jul 2022 02:29 IST
డ్రై రేషన్‌లో కాలం చెల్లిన ప్యాకెట్ల పంపిణీ
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి, న్యూస్‌టుడే, నక్కపల్లి

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల కోసం డ్రైరేషన్‌ ద్వారా పంపిణీ చేసిన కందిపప్పును చూస్తే ఎవరైనా కంగుతినాల్సిందే. ఎందుకంటే ప్యాకింగ్‌పై ముద్రించిన గడువు తేదీ ముగిసినా ఇంకా కొన్ని పాఠశాలల్లో ఈ నిల్వలు కనిపిస్తున్నాయి. మరికొన్నిచోట్ల ఎప్పుడు ప్యాకింగ్‌ చేసింది కనిపించకుండా నల్లటి ఇంకుతో దిద్దడం నాణ్యతపై అనుమానాలకు తావిస్తోంది. విద్యార్థులకు పంపిణీ చేసే ఆహారం విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో ఈ ప్యాకెట్లు చూస్తేనే తెలుస్తుంది.

ఏడాది ఆలస్యంగా పంపిణీ..

కొవిడ్‌ సమయంలో పాఠశాలలన్నీ మూతపడడంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం స్థానంలో డ్రై రేషన్‌ పంపిణీ చేపట్టింది. 2020-21లో అయిదారు దశలుగా బియ్యం, గుడ్లు, పప్పులు అందజేశారు. గత విద్యా సంవత్సరంలో కూడా పాఠశాలలు రెండు నెలలు ఆలస్యంగానే తెరుచుకున్నాయి. ఆ కాలానికి సంబంధించిన డ్రైరేషన్‌ అప్పుడు ఇవ్వకుండా విద్యా సంవత్సర ముగింపు సమయంలో పంపిణీ చేశారు. ఏడాది ఆలస్యంగా వీటిని అందించడమే కాకుండా కాలం చెల్లిన కందిపప్పును అంటగట్టడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. జగనన్న గోరుముద్ద పథకంలో కందిపప్పును కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ద్వారా సరఫరా చేస్తుంటుంది. ఆ సంస్థ స్థానికంగా ఓ ఏజెన్సీకి ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిసింది. వారు నాణ్యతతో కూడిన ఈ సరకును పాఠశాలలకు సకాలంలో అందజేస్తుండాలి. పర్యవేక్షణ లోపం కారణంగా నచ్చినప్పుడు వీటిని పాఠశాలలకు సరఫరా చేస్తుండడంతో సమస్యలు వెలుగుచూస్తున్నాయి.

ఓ పాఠశాలలో పంపిణీ చేయకుండా ఉన్న బస్తాలు

ప్యాకింగ్‌పై దిద్దుబాటు..

ఉమ్మడి జిల్లాలో 3,919 పాఠశాలల్లో 3.05 లక్షల మంది పిల్లలు మధ్యాహ్న భోజనం తింటున్నారు. వీరందరికీ  గతేడాది డ్రైరేషన్‌ ద్వారా 40 రోజులకు సరిపడా ఒక్కో విద్యార్థికి 2.5 కేజీల కందిపప్పును అందచేయాలి. వాటిని ఈ ఏడాది మార్చిలో సరఫరా చేయడం మొదలుపెట్టారు. ఈ కందిపప్పు ప్యాకెట్లపై ప్యాకింగ్‌ తేదీ ఫిబ్రవరి/మార్చిగా ముద్రించారు. మూడు నెలల లోపు ఈ పప్పును వినియోగించుకోవడానికి మంచిదని ప్యాకింగ్‌పై పేర్కొన్నారు. అంటే మే లోగా ఈ పప్పుని వండుకుని తినేయాలి. తర్వాత ఉపయోగించడానికి అంత మంచిది కాదని అర్థం. అయితే వీటి నిల్వలను అన్ని పాఠశాలలకు మార్చి, ఏప్రిల్‌లో చేర్చలేదు. కొన్ని పాఠశాలలకు వేసవి సెలవులకు రెండు, మూడు రోజుల ముందు అందజేశారు. తొలుత సరఫరా అయిన పాఠశాలల్లో వీటిని పిల్లలకు సకాలంలోనే అందజేశారు. ఆఖరిలో పాఠశాలకు చేరిన కందిపప్పుని మాత్రం పిల్లలకు పూర్తిస్థాయిలో అందించలేకపోయారు. ఇప్పటికీ కొన్ని పాఠశాలల్లో వీటి నిల్వలున్నాయి. అవన్నీ మూడు నెలలు కాలపరిమితి దాటిపోయినవే. పాఠశాలలకు కందిపప్పుని చేర్చడం ఆలస్యం అవుతుందని ముందే గ్రహించిన గుత్తేదారు ఆఖరిలో సరఫరా చేసిన ప్యాకెట్లపై ప్యాకింగ్‌ తేదీతో పాటు, ఎంత పరిమాణమో కనిపించకుండా నల్లని ఇంకు పూసేశాడు. దీంతో ఈ పప్పు నాణ్యతపైనే కాదు.. బరువుపైనా అనుమానించాల్సి వస్తోందని ఉపాధ్యాయులంటున్నారు. ఈ విషయమై మధ్యాహ్నభోజన పథకం విభాగం సూపరింటెండెంట్‌ జగన్నాథం వద్ద ప్రస్తావించగా, పిల్లలకు గడువు తేదీలోగానే కందిపప్పు అందించామని చెప్పారు. ప్యాకింగ్‌పై దిద్దుబాటు ఎలా వచ్చిందో తెలియదన్నారు. అనకాపల్లి డీఈవో లింగేశ్వరరెడ్డి వద్ద ప్రస్తావించగా సెలవులకు ముందుగానే పిల్లలకు అందజేయాలని సూచించామని, ఇంకా నిల్వలు ఉంటే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని