logo

బస్సులు రావు.. బాధలు తీరవు!

మన్యంలో గిరిజనులను రవాణా సదుపాయం దూరభారంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు వేస్తున్నా వీరికి కష్టాలు వీడటం లేదు. కొన్ని గ్రామాలకు తారురోడ్లున్నా ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. మరికొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేక రవాణా

Published : 08 Aug 2022 02:29 IST

చింతపల్లి, న్యూస్‌టుడే

జీపుపై ప్రమాదకరంగా..

మన్యంలో గిరిజనులను రవాణా సదుపాయం దూరభారంగా మారింది. ఏళ్లు గడుస్తున్నా రోడ్లు వేస్తున్నా వీరికి కష్టాలు వీడటం లేదు. కొన్ని గ్రామాలకు తారురోడ్లున్నా ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. మరికొన్ని గ్రామాలకు సరైన రహదారులు లేక రవాణా సాధనాలు అందుబాటులో ఉండటం లేదు. దీంతో చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో అనేక గ్రామాల గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయంగా ఆటోలు, జీపులు వంటి ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.

తారురోడ్లున్నా తమ గ్రామాలకు ఆర్టీసీ బస్సులు రాకపోవడంతో తప్పనిసరై ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నామని ఆయా గ్రామాల వారు చెబుతున్నారు. ప్రయాణికులు ప్రైవేటు వాహనాలనే అధికంగా ఆశ్రయిస్తుండటంతో రాబడి రాక తాము బస్సులు నడపలేకపోతున్నామని ఆర్టీసీ అధికారులంటున్నారు. ఏదిఏమైనా గిరిజనులను రవాణా కష్టాలు మాత్రం నిత్యం వెంటాడుతూనే ఉన్నాయి.

మన్యాన్ని వీడని రవాణా కష్టాలు
చింతపల్లి, గూడెంకొత్తవీధి మండలాల్లో ఆర్టీసీ వివిధ మార్గాల్లో తగినన్ని బస్సులను నడపటం లేదు. దూరప్రాంత సర్వీసులు మినహా పాడేరు, నర్సీపట్నంకు తగినన్ని బస్సులు లేవు. గతంలో ఉన్న బస్సులను నష్టాల సాకుతో కుదించారు. చింతపల్లి మండలంలోని గొందిపాకలు, తాజంగి, కిల్తారి, ఎర్రబంద, కొమ్మంగి, కోరుకొండ గ్రామాలకు గతంలో ఆర్టీసీ బస్సులు తిరిగేవి. రహదారులు బాగోలేవంటూ వీటిని రద్దుచేశారు. గూడెంకొత్తవీధి మండలంలోని జర్రెల, వంచుల, మొండిగెడ్డ, తీములబంద గ్రామాలకూ కొద్దికాలంగా బస్సులను తిప్పడం మానేశారు. గతంలో ప్రతి మండల కేంద్రంనుంచి నేరుగా ఉమ్మడి జిల్లా కేంద్రం అయిన విశాఖకు వేకువజామున బస్సులు నడిపారు. కొద్దికాలం అనంతరం వాటిని రద్దుచేశారు. సీలేరు రాత్రి సర్వీసు బస్సును తొలగించారు. విజయనగరం-భద్రాచలం, భద్రాచలం-శ్రీకాకుళం, విశాఖపట్నం-మల్కన్‌గిరి సర్వీసులను రద్దుచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం- భద్రాచలం సర్వీసులు మాత్రమే కొనసాగుతున్నాయి. నర్సీపట్నం నుంచి గూడెంకొత్తవీధికి వెళ్లే రాత్రి సర్వీసు బస్సును ఆపేశారు. ఇలా ఉన్న సర్వీసులన్నింటినీ తొలగించడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారపు సంతలరోజున చింతపల్లి మండలం కిటుముల, మామిడిపల్లి వరకూ బస్సులు తిరిగేవి. వాటినీ తిప్పడం మానేశారు

బస్సులకోసం నిరీక్షిస్తున్న గిరిజనం (దాచినచిత్రం)

రోడ్లున్నా తప్పని తిప్పలు
గతంలో మన్యంలో తగినన్ని రహదారులు ఉండేవి కావు. కాలక్రమంలో మన్యంలో రూ. కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణాలు జరిగాయి.  ఒకప్పుడు మట్టిరోడ్లకు నోచుకోని గ్రామాల్లో నేడు సీసీ రోడ్లు, తారురోడ్లు వెలిశాయి. పీఎంజీఎస్‌వైలో అనేక గ్రామాలకు తారురోడ్లు నిర్మించారు. ఇలాంటి గ్రామాలకు కూడా ఆర్టీసీ బస్సులు నడపటం లేదు. దీంతో మన్యంలో గిరిజనులంతా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు వాహనాలనే ఆశ్రయిస్తున్నారు. లెక్కకు మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, పరిమితి, నిబంధనలను పాటించకపోవడంతో ఒక్కోసారి ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు మన్యంలో ఉన్న పరిస్థితులను గుర్తించి అవసరమైన ప్రాంతాలకు బస్సు సర్వీసులను నడపాలని, రద్దుచేసిన సర్వీసులను పునరుద్ధరించాలని ఈ ప్రాంత ప్రయాణికులు కోరుతున్నారు.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని