logo

ఆదివాసీ వేడుకలకు సీఎం రానట్లే!

ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాడేరు పర్యటన ఎడతెరిపి లేని వర్షం కారణంగా రద్దయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం.

Updated : 08 Aug 2022 06:05 IST

నిరంతర వర్షంతో పర్యటన రద్దు?

పాడేరు జూనియర్‌ కళాశాల ప్రాంగణం వద్ద సభా వేదిక

పాడేరు, న్యూస్‌టుడే: ఈ నెల తొమ్మిదో తేదీన జరగాల్సిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాడేరు పర్యటన ఎడతెరిపి లేని వర్షం కారణంగా రద్దయినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ విషయాన్ని యంత్రాంగం అధికారికంగా ప్రకటించకపోవడం గమనార్హం. ప్రపంచ ఆదివాసీ వేడుకలను జిల్లా కేంద్రం పాడేరులో నిర్వహిస్తున్న నేపథ్యంలో సీఎంను ఆహ్వానించారు. ఆయన సానుకూలంగా స్పందించడంతో ఆ దిశగా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేశారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్ద సభావేదిక ఏర్పాటు చేయాలని భావించి శనివారం ఉదయం నుంచి పెండాల్స్‌ను భారీస్థాయిలో ఏర్పాటు చేశారు. ఇదే సమయంలో పాడేరు పట్టణ శివారులో వర్తనాపల్లి వద్ద హెలిప్యాడ్‌ నిర్మాణానికి సంబంధించి సిమెంట్‌, కంకర, ఇతర సామగ్రిని సిద్ధం చేశారు. రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లు నిర్మించేందుకు సంబంధిత సామగ్రిని శనివారం సాయంత్రానికి మైదానం నుంచి తీసుకొచ్చారు. మరో వైపు సీఎం పర్యటన రద్దవుతున్నట్లు సీఎంవో కార్యాలయం నుంచి ఆదివారం సాయంత్రం వరకు అధికారులకు అధికారికంగా ప్రకటన అందలేదు. దీంతో ఏర్పాట్లను నిలిపేయాలా, కొనసాగించాలా, అనేది తేల్చుకోలేకపోతున్నారు. సీఎం పర్యటన రద్దుపై అధికారికంగా తెలపక పోవడంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఏ విధంగా తయారు చేయాలనే విషయంపై ఇంజినీర్లు డైలమాలో పడ్డారు. ఆర్‌అండ్‌బీ అధికారులు మాత్రం హెలిప్యాడ్‌ నిర్మాణ పనులు నిలిపేశారు.

రోడ్డుకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు తెచ్చిన బ్యారికేడ్లు

ఉప ముఖ్యమంత్రుల రాక ఖరారు
ప్రపంచ ఆదివాసీ వేడుకలకు సీఎం హాజరు కాకపోయినా ఉప ముఖ్యమంత్రులు రాజన్నదొర, బూడి ముత్యాలనాయుడు హాజరు కానున్నట్లు అధికారులకు సమాచారం అందింది. వేడుకలకు వీరితో పాటు జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి అమర్‌నాథ్‌ రానున్నట్లు తెలిసింది. దీంతో వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. కలెక్టర్‌, ఐటీడీఏ పీఓ పర్యవేక్షిస్తున్నారు.

హెలిప్యాడ్‌ కోసం సిద్ధం చేసిన సిమెంట్‌, కంకర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని