logo

అల్లూరి పంచాయితీలు నడిపింది.. ఇక్కడే!

బ్రిటీష్‌ దొరల అణిచివేత, దోపిడీ నుంచి గిరిజనులకు విముక్తి కలిగించడం లక్ష్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేపట్టారు. ఆ యోధుని స్మృతులను అడుగడుగునా సంతరించుకున్న ప్రాంతం కృష్ణదేవిపేట. అల్లూరి అప్పట్లో న్యాయ పంచాయితీలు నిర్వహించేవారు.

Published : 12 Aug 2022 01:13 IST

నర్సీపట్నం గ్రామీణం, కృష్ణదేవిపేట, న్యూస్‌టుడే

పాత కృష్ణదేవిపేటలో అల్లూరి పంచాయితీ నడిపిన చోట స్మారక మందిరం

బ్రిటీష్‌ దొరల అణిచివేత, దోపిడీ నుంచి గిరిజనులకు విముక్తి కలిగించడం లక్ష్యంగా విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చేపట్టారు. ఆ యోధుని స్మృతులను అడుగడుగునా సంతరించుకున్న ప్రాంతం కృష్ణదేవిపేట. అల్లూరి అప్పట్లో న్యాయ పంచాయితీలు నిర్వహించేవారు.

పాత కృష్ణదేవిపేటలో బండమీద కూర్చుని సీతారామరాజు న్యాయ పంచాయితీలు నిర్వహించే ప్రదేశంలో స్థానికులు స్మారక మందిరాన్ని నిర్మించారు. విగ్రహాన్ని గాం మల్లుదొర ఆవిష్కరించారు. 1917లో విశాఖ మన్యం చేరుకున్న సీˆతారామరాజుకు కృష్ణదేవిపేటకు చెందిన చిటికెల భాస్కరనాయుడు తల్లిగారు అప్పట్లో కొన్నాళ్లు ఆతిథ్యం ఇచ్చారు. 1922 ఆగస్టు 22న కృష్ణదేవిపేట నీలకంఠేశ్వర ఆలయం వద్ద నుంచే అల్లూరి సమరభేరి మోగించారు. దాడి చేసే ముందు మిరపకాయ చుట్టిన బాణంతో బ్రిటీష్‌ దొరలకు హెచ్చరికలు పంపి వారికి తెల్లవారికి సింహస్వప్నమయ్యారు. చింతపల్లి పోలీసు స్టేషన్‌పై దాడితో ఆరంభమైన మెరుపుదాడులు కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి, అడ్డతీగల తదితర చోట్ల కొనసాగాయి. 1924 మేలో నిరాయుధుడైన అల్లూరిని మేజర్‌ గుడాల్‌ కర్కశంగా కాల్చిచంపాడు. దేశభక్తితో సాగిన మన్యం పితూరీ ఈ ప్రాంతంలోని అనేకమందిలో పౌరుషాగ్ని రగిలించింది. నేటికీ అనేకమంది ఆయన స్ఫూర్తిని స్మరించుకుంటారు. ఈ వీరుని సమాధిని కృష్ణదేవిపేటలోనే నిర్మించారు. ఇప్పుడిది సందర్శనీయ స్థలంగా ఉంది. ఆ ప్రాంతాన్ని ఉద్యానంగా అభివృద్ధి చేశారు.

ఎ.ఎల్‌.పురంలో బొడ్డేరు నది పక్కన అల్లూరి సీతారామరాజు, ఆయన అనుచరుడు

గంటందొర సమాధులు

 


ఉత్తరాలు చదివేసి.. కాల్చేసేదిక్కడే!

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే

స్వాతంత్య్ర పోరాటం సాగే రోజుల్లో గిరిజనులకు మేలు జరిగే కీలక ఉత్తరాలను వారికి చేరకుండా దహనం చేసేందుకు బ్రిటిష్‌ అధికారులు చింతపల్లిలో ఓ స్తూపం ఏర్పాటుచేశారు. మన్యం ప్రాంతానికి వచ్చే ఉత్తరాలు, కీలక పత్రాలు బ్రిటిష్‌ వారు చదివిన అనంతరం, వాటిని బహిర్గతం చేయకుండా ఈ స్తూపంలో పడేసి కాల్చేసేవారు. ఇప్పటికీ ఈ స్తూపం చింతపల్లి పోలీస్‌స్టేషన్‌ పక్కన చెక్కుచెదరకుండా ఉంది.


సమర యోధుల స్తూపం

స్వాతంత్య్ర సమరయోధుల సంస్మరణార్థం చింతపల్లి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద స్మారక స్తూపాన్ని నెలకొల్పి యోధుల పేర్లను లిఖించారు. అల్లూరి సీతారామరాజు వెన్నంట నడిచిన టగ్గి వీరయ్యదొర, గబులంగి సింగన్నదొర, కంకిపాటి శరబన్న పడాల్‌, ముత్తాడం వీరయ్యదొర, గబులంగి లక్ష్మయ్య, కంకిపాటి పెంటన్నపడాల్‌ పేర్లు ఈ స్తూపంపై ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని