logo

పడిపోయిన పండ్ల వాణిజ్యం

మండలంలోని చిట్రాళ్లగుప్పుకు పండ్ల వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది చిన్న గ్రామమే అయినా ఇక్కడ ఏటా కోట్లాది రూపాయల పండ్ల వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా పండ్ల వ్యాపారం దెబ్బతింది.

Published : 13 Aug 2022 01:48 IST


ఎగుమతులకు నోచుకోని మన్యం పనస

చింతపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని చిట్రాళ్లగుప్పుకు పండ్ల వాణిజ్య కేంద్రంగా పేరుంది. ఇది చిన్న గ్రామమే అయినా ఇక్కడ ఏటా కోట్లాది రూపాయల పండ్ల వ్యాపారం జరుగుతోంది. రెండేళ్లు కరోనా మహమ్మారి కారణంగా పండ్ల వ్యాపారం దెబ్బతింది. ఈ ఏడాది వర్షాలు, వ్యాధుల భయం ఈ వ్యాపారాన్ని పూర్తిగా దెబ్బతీసింది. దీంతో ఉద్యాన పంటలను నమ్ముకున్న రైతులతోపాటు చిరువ్యాపారులు ఆర్థికంగా నష్టపోయారు.

* ఏటా ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెలాఖరువరకూ సుమారు ఐదు నెలలపాటు చిట్రాళ్లగుప్పులో పండ్ల వ్యాపారం సాగుతుంది. మే నుంచి జులై వరకూ ఈ వ్యాపారం ముమ్మరంగా ఉంటుంది. చింతపల్లి మండలంలోని గొందిపాకలు, పెదబరడ, లంబసింగి పంచాయతీలకు ప్రధాన కూడలిగా ఉన్న చిట్రాళ్లగుప్పు పండ్ల వాణిజ్య కేంద్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ పంచాయతీల్లోని అధిక సంఖ్యలో గిరిజనులు ఉద్యాన పంటలు పండిస్తుంటారు. మామిడి, పనస, అనాసపనస వంటి పంటల ఉత్పత్తులతో ఈ ప్రాంతం నిత్యం కళకళలాడేది. రెండేళ్లపాటు కరోనా మహమ్మారి  కారణంగా దూరప్రాంతాల నుంచి వ్యాపారులు ఈ ప్రాంతానికి రావడం మానేశారు. దీంతో రెండేళ్లపాటు ఈ వ్యాపారం పడకేసింది. ఈ ఏడాదైనా వ్యాపారం పుంజుకుంటుందని చిరువ్యాపారులు, గిరిజనులు భావించినా వారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఈ ఏడాది మన్యంలో రుతుపవనాలకంటే ముందుగానే వర్షాలు ప్రారంభం అయ్యాయి. మే నెల నుంచే వర్షాలు ప్రారంభం అయ్యాయి. అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. వర్షాల కారణంగా వ్యాపారులూ రావడం తగ్గించారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడింది. ఏటా సీజనులో ఇక్కడ సుమారు రూ.మూడు కోట్ల వరకూ పండ్ల వాణిజ్యం జరుగుతుంది. అటువంటిది ఈ ఏడాది రూ.కోటికి మించి వ్యాపారం జరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు వర్షాలతో దోమల బెడద కారణంగా వ్యాధులు ప్రబలుతున్నాయి. పండ్ల క్రయవిక్రయాలు, వినియోగం బాగా తగ్గాయి. దీంతో ఈ ఏడాది సీజను ముగుస్తున్నా పండ్ల వ్యాపారం మందకొడిగా సాగుతోందని ఇటు వ్యాపారులు, గిట్టుబాటు ధరలు రావడం లేదని గిరిజనులు వాపోతున్నారు.

వ్యాధుల విజృంభణ
చింతపల్లి మండలంలో మలేరియా, డెంగీ, డయేరియా వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. మన్యంలో లభించే పనస, అనాసపనస వంటి పండ్లను తిని వాటి వ్యర్థాలను ఇళ్ల పరిసరాల్లోనే వదిలేస్తుండటంతో అవి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దీంతో దోమలు విజృంభిస్తున్నాయి. ఈ పరిస్థితులను గుర్తించిన అధికారులు గ్రామాల్లో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నారు. ఇళ్లు, గ్రామ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సూచిస్తున్నారు. పరిమితికి మించి పనస, మామిడి, అనాసపనస వంటి పండ్లను తినవద్దని మరో వైపు వైద్యారోగ్యశాఖ అధికారులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో గిరిజనులు పండ్లను తినడం తగ్గించారు. వినియోగం తగ్గడంతో కేవలం ఎగుమతులపైనే ఆధారపడుతున్నారు. చిట్రాళ్లగుప్పులో పండ్ల వ్యాపారం అంతా జరుగుతుండటంతో ఇక్కడ సీజనులో పరిసరాలన్నీ అపరిశుభ్రంగా తయారవుతున్నాయి. వ్యాపారులు పాడయిన పండ్లను ఇక్కడే వదిలి వెళుతున్నారు.  దీంతో అక్కడ దోమలు పెరిగి వ్యాధులకు కారణం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు చిట్రాళ్లగుప్పులో వ్యాపారులకు నోటీసులు జారీచేశారు. వ్యాపారాలు చేసుకునేవారు పరిసరాల శుభ్రతనూ పాటించాలని, రహదారులపై వ్యర్థాలను వదిలేసి వెళితే వారిపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. వ్యాపారం మందకొడిగా జరుగుతుండటంతో మైదాన ప్రాంతాల నుంచి వ్యాపారులు ఈ ఏడాది చిట్రాళ్లగుప్పు రావడం తగ్గించారు. సీజను ప్రారంభం నుంచి ఈ ఏడాది పసస, మామిడి, అనాస పనస వంటి పండ్లకు ధరలు తగ్గాయి.


కొనుగోలుదారులు లేక గిరిజనుల ఇళ్లలోనే ఉండిపోయిన అనాస పనస


గిట్టుబాటు ధరలు రావడం లేదు

వ్యవసాయ పంటలకు దీటుగా ఉద్యాన పంటలను గిరిజనులు అధికంగా పండిస్తున్నారు. చిక్కుడుబట్టి, పెదబరడ, గొందిపాకలు, చినబరడ గ్రామాల్లో రైతులు ఏటా అనాసపనస, మామిడి,  పనస పళ్ల అమ్మకాలపైనే ఆధారపడతారు. ఈఏడాది దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా ఆశించిన గిట్టుబాటు ధరలు రావడం లేదు. పండిన పంటలను నిల్వ చేసుకునేందుకు ఎటువంటి సదుపాయాలూ లేవు. గతంలో శీతల గిడ్డంగిని చిట్రాళ్లగుప్పు వద్ద నిర్మిస్తామని అధికారులు ప్రకటించారు. అది కార్యరూపం దాల్చితే గిరిజనుల ఉత్పత్తులు దాచుకుని ధరలు పెరిగాక అమ్ముకునేందుకు అవకాశం ఉంటుంది.

- అబ్బాయినాయుడు, రైతు, దిగువపాకలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని