logo

జాగాలమామిడిలో అల్లూరి గుహ

స్వాతంత్య్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయం. సాయుధ పోరాటంతో బ్రిటిష్‌వారిని గడగడలాడించారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో అల్లూరి పోరాట శైలి, స్థావరాల విశేషాలు తెలుసుకుందామా..

Published : 13 Aug 2022 01:48 IST

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

స్వాతంత్య్ర సమరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం చిరస్మరణీయం. సాయుధ పోరాటంతో బ్రిటిష్‌వారిని గడగడలాడించారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అమృత మహోత్సవాలు జరుపుకొంటున్న తరుణంలో అల్లూరి పోరాట శైలి, స్థావరాల విశేషాలు తెలుసుకుందామా..

అల్లూరితోపాటు ఆయన అనుచరులు బ్రిటిష్‌వారికి దొరక్కుండా ఓ గుహను రక్షణగా వినియోగించుకున్నారు. గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డొకులూరు సమీపంలోని జాగాలమామిడి కొండపై సముద్ర మట్టానికి సుమారు 2 వేల అడుగుల ఎత్తులో పెద్ద బండరాయి చాటున ఈ గుహ ఉంది. డొకులూరు నుంచి కొయ్యూరు వైపు అడవి మార్గంలో వెళ్తే రెండున్నర కిలోమీటర్ల దూరంలో పెద్ద రాతికొండ ఉంది. దానిపై ఈ గుహ కనిపిస్తుంది. దీని చుట్టూ అల్లూరి ప్రధాన అనుచరులు గాం మల్లుదొర, గాం గంటన్నదొర, వీరయ్యదొర, గోకిరి ఎర్రేసు, పండుపడాల్‌, అగ్గిరాజు తదితరులు రాతికట్టుతో గోడ నిర్మించారని డొకులూరు గ్రామ పెద్దలు చెబుతుంటారు.


ఇక్కడి నుంచే పోలీస్‌స్టేషన్లపై దాడి


బండరాయికి, గుహకు మధ్య అల్లూరి సేన కట్టిన రాతిగోడ

గూడెంకొత్తవీధి, కొయ్యూరు మండలాల సరిహద్దు కొండపై ఉన్న ఈ గుహలోనే అల్లూరి సీతారామరాజు పూజలు చేసి సేనను దాడులకు పంపేవారని స్థానిక పెద్దలు చెబుతున్నారు. ఈ గుహ నుంచి కొయ్యూరు, మంప మీదుగా రాజవొమ్మంగి, అడ్డతీగల, రంపచోడవరం, చింతపల్లి ప్రాంతాలకు రాకపోకలు సాగించేవారట. ఈ గుహను రక్షణ కవచంగా (షెల్టర్‌జోన్‌గా) వినియోగించుకుని రాజవొమ్మంగి, అడ్డతీగల, చింతపల్లి, కృష్ణదేవిపేట పోలీస్‌స్టేషన్లపై దాడులు చేశారు. తీసుకొచ్చిన ఆయుధాలను గుహలోనే దాచేవారని స్థానిక పెద్దలు చెబుతున్నారు. ఆంగ్లేయులకు చిక్కకుండా ఈ గుహ నుంచే అల్లూరి సేన పోరాటం చేసినట్లు పేర్కొంటున్నారు. ఎత్తైన కొండపై ఉండటం, గుహలో ఎలుగుబంట్లు, క్రూరమృగాలు ఉన్నాయని ప్రచారంలో ఉండటంతో దీనిని ఎక్కేందుకు ఎవరూ సాహసించలేదు.


వ్యూహాలకు అండ... ఉర్లకొండ


మంప సమీపంలోని ఉర్లకొండ గుహ ఇదే..

అల్లూరి సీతారామరాజు, ఆయన ముఖ్య అనుచరులు మంప సమీపంలోని ఉర్లకొండ గుహలో తరచూ సమావేశమవుతూ బ్రిటిష్‌వారిపై పోరాటానికి వ్యూహాలు రచించేవారు. ఈ గుహ నుంచి చూస్తే ఇతర ప్రాంతం నుంచి వచ్చే వారంతా రహదారులపై కన్పిస్తారు. శత్రువుల జాడను బట్టి ఇక్కడి నుంచి ప్రణాళికలు రూపొందించేవారు. ఈ గుహ నుంచి రహస్యమార్గం ఉందని స్థానికులు చెబుతుంటారు. సీతారామరాజు ఉర్లకొండ గుహను స్థావరంగా ఏర్పాటు చేసుకొని పోరాటం సాగించారు. అక్కడ నుంచి మంపలోని మడుగులో స్నానం చేస్తుండగా ఆంగ్లేయులకు చిక్కారు.

-కొయ్యూరు, న్యూస్‌టుడే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని