logo

పరీక్ష తప్పానని ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి ఆదివారం విగతజీవిగా మారాడు. పట్టణ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని కుంచంగి గ్రామానికి చెందిన పల్లెల చందు (17) ఇంటర్‌ పరీక్షల్లో తప్పాడు.

Updated : 26 Sep 2022 06:23 IST

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విద్యార్థి ఆదివారం విగతజీవిగా మారాడు. పట్టణ ఎస్సై రామకృష్ణ కథనం ప్రకారం.. మండలంలోని కుంచంగి గ్రామానికి చెందిన పల్లెల చందు (17) ఇంటర్‌ పరీక్షల్లో తప్పాడు. సప్లిమెంటరీ ఫలితాల్లోనూ ఉత్తీర్ణుడు కాకపోవడంతో మనస్తాపానికి గురై ఎన్టీఆర్‌ క్రీడామైదానం వద్ద ఆగస్టు 30న పురుగు మందు తాగాడు. చికిత్స నిమిత్తం గాజువాకలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా ఆదివారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు. తండ్రి నర్సింగరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

మాడుగుల గ్రామీణం, న్యూస్‌టుడే: సాగరం కాలనీ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిందని ఎస్సై దామోదరనాయుడు తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం.. మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన బొడ్డేటి నాగయ్యమ్మ (59) ఆదివారం వంట్లమామిడిలో జరిగే వారపు సంతకు వెళ్లి ఆటోలో వస్తోంది. ఈ సమయంలో ఆటో నుంచి జారిపడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌ తలారి ఏసుబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

విద్యుదాఘాతంతో కార్మికుడు..

చోడవరం పట్టణం: భవన నిర్మాణ పనులు చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై కార్మికుడు మృతిచెందాడు. ఎస్సై యమున కథనం ప్రకారం.. చెట్టుపల్లికి చెందిన పాతాళం వెంకటరమణ (27) అన్నవరం గ్రామంలో శనివారం రాత్రి భవన నిర్మాణ పనులకు హాజరయ్యాడు. పనుల్లో భాగంగా ఇనుప ఊచలను హ్యాండ్‌ కట్టర్‌తో కోస్తుండగా విద్యుత్తుఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. చోడవరం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటరమణకు భార్య నిరీష, నాలుగేళ్ల కుమారుడు జశ్వంత్‌, ఏడాదిన్నర పాప జ్ఞానేశ్వరి ఉన్నారు. నిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని