logo

కొద్దిపాటి చదువు.. కోరుకున్న కొలువు

పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ (ఐటీఐ) కోర్సులు ఆలంబనగా నిలుస్తున్నాయి. శిక్షణ పొందిన వారి ఉపాధికి బాటలు వేస్తున్నాయి. పదోతరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదవలేని వారికి బాసటగా నిలిచే వాటిల్లో ఐటీఐ ఒకటి.

Published : 28 Sep 2022 01:53 IST

ఐటీఐలకు పెరుగుతున్న ఆదరణ

మోటారు మెకానిక్‌లో శిక్షణ

చింతపల్లి, న్యూస్‌టుడే: పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు పారిశ్రామిక శిక్షణ (ఐటీఐ) కోర్సులు ఆలంబనగా నిలుస్తున్నాయి. శిక్షణ పొందిన వారి ఉపాధికి బాటలు వేస్తున్నాయి. పదోతరగతి పూర్తిచేసి ఉన్నత చదువులు చదవలేని వారికి బాసటగా నిలిచే వాటిల్లో ఐటీఐ ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పేరొందిన ప్రైవేటు సంస్థల్లోనూ ఉపాధి అవకాశాలు పొందేందుకు ఈ కోర్సులు దోహదపడుతున్నాయి. పారిశ్రామిక అవసరాలకు తగిన మానవ వనరులు పారిశ్రామిక శిక్షణ సంస్థల నుంచే లభ్యమవుతుండటంతో ఈ కోర్సుల్లో చేరేందుకు యువత మొగ్గు చూపుతున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఐటీఐల్లో రెండు విడతల కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. ప్రస్తుతం మూడోవిడత కౌన్సిలింగ్‌ జరుగుతోంది.

* చింతపల్లి ఆర్‌ఐటీఐలో రెండేళ్ల కాలపరిమితి గల కోర్సులు ఎలక్ట్రీషియన్‌ 60, ఫిట్టర్‌ 40,  డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ 24, మోటారు మెకానిక్‌ 48 సీట్లు ఉన్నాయి. ఏడాది కాలపరిమితి కలిగిన వాటిలో వెల్డర్‌ 40, కార్పెంటర్‌ 24, ప్లంబర్‌ 24, స్టెనోగ్రఫీ 24 సీట్లు ఉన్నాయి. ఇందులో  కార్పెంటర్‌, ప్లంబర్‌, స్టెనోగ్రఫీ ట్రేడులను సీలేరులో కొనసాగిస్తున్నారు.

* అరకులో మోటర్‌ మెకానిక్‌, కంప్యూటర్‌ కోర్సు (కోపా), ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, డీజిల్‌ మెకానిక్‌, వెల్డర్‌ సీట్లు ఉన్నాయి. హుకుంపేట పేరిట నరవలో కొనసాగుతున్న ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌, డీజిల్‌ మెకానిక్‌ ట్రేడులు ఉన్నాయి.


ప్రస్తుత పోటీ ప్రపంచంలో సాధారణ డిగ్రీలు, పీజీలు పూర్తిచేసిన వారిలో చాలా మందికి ఉపాధి అవకాశాలు లభించని పరిస్థితులు నెలకొన్నాయి. పదో తరగతి పూర్తయ్యాక ప్రభుత్వ రంగ, ప్రైవేటు కంపెనీల్లో ఉపాధినిచ్చే వాటిలో ఐటీఐ కోర్సులు ప్రధానమైనవి కావడంతో ప్రస్తుతం యువతరం వీటిపై దృష్టి సారిస్తోంది. ఐటీఐలో ఏడాది, రెండేళ్ల కాలపరిమితి కలిగిన కోర్సులు పూర్తిచేసిన అనంతరం ఏడాదినుంచీ రెండేళ్లపాటు అప్రెంటిస్‌ చేయాల్సి ఉంటుంది. ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి.

సచివాలయాల్లో కొలువులు : ప్రభుత్వం కొద్దికాలం కిందట గ్రామ సచివాలయ కొలువులను పెద్దఎత్తున భర్తీ చేసింది. ఇందులో ఐటీఐల్లో ఎలక్ట్రీషియన్‌ పూర్తిచేసిన సచివాలయాల్లో జూనియర్‌ లైన్‌మెన్‌లుగా ఉద్యోగాలు సాధించారు. చింతపల్లిలో ఐటీఐ చేసిన వారిలోనే సుమారు 20మంది వరకూ ఈ కొలువులు సాధించారు. డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ ట్రేడులో శిక్షణ పొందినవారు డిగ్రీ చేసి ఉంటే వారిని వీఆర్వోలుగా తీసుకున్నారు. మిగిలిన వారికి సర్వేయర్లుగా సుమారు 40 మంది వరకూ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి.

చింతపల్లి ఆర్‌ఐటీఐలో యంత్ర పరికరాలు


కొత్తగా ఏర్పడిన అల్లూరి జిల్లాలో ప్రభుత్వ ఐటీఐలు నాలుగున్నాయి. అందులో చింతపల్లి, సీలేరు, అరకుతోపాటు హుకుంపేట ఉన్నాయి. హుకుంపేటలో ఆర్‌ఐటీఐ మంజూరైనా భవనాలు లేకపోవడంతో ప్రస్తుతం దీన్ని విశాఖలోని నరవ వద్ద కొనసాగిస్తున్నారు.


ఆర్‌ఆర్‌బీ, బీహెచ్‌పీవీ, షిప్‌యార్డు, నేవల్‌ డాక్‌యార్డు ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో ట్రాన్స్‌ఫార్మర్ల తయారీ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలతోపాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు పొందొచ్చు.


ఉద్యోగావకాశాలు త్వరగా లభిస్తాయనే..: ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేశాను. డైట్‌లోనూ శిక్షణ పొందాను. సాంకేతిక విద్య ఉంటే త్వరగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న ఆశతో ప్రస్తుతం చింతపల్లి ఆర్‌ఐటీలో డ్రాఫ్ట్స్‌మెన్‌ సివిల్‌ చేస్తున్నాను.

-రమ్యతేజ, చింతపల్లి


స్వయం ఉపాధికి అవకాశాలు : ఐటీఐ చేస్తే ప్రభుత్వ ఉద్యోగం రాకపోయినా ప్రైవేటు రంగంలో అనేక ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ప్రైవేటుగా పనులు చేసుకున్నా ఉపాధి దొరుకుతుంది. అందుకే చింతపల్లి ఆర్‌ఐటీఐలో ఎలక్ట్రీషియన్‌ కోర్సు చేస్తున్నా.

-సందీప్‌కుమార్‌ సీలేరు


సాంకేతిక విద్యలో అనూహ్యమార్పులు

మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విద్యలోనూ అనేక మార్పులు జరుగుతున్నాయి. ఐటీఐ చేసిన వారు ఆసక్తి ఉంటే పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరొచ్చు. ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు పేరొందిన ప్రైవేటు పరిశ్రమలూ ఐటీఐ చేసిన వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఐటీఐ చేసిన విద్యార్థుల వివరాలను అప్రెంటిస్‌ కోసం ముందుగానే వారి పేర్లను ఆన్‌లైన్లో నమోదు చేస్తున్నాం. దీంతో పరిశ్రమలకు అవసరమైన విద్యార్థులను ఆయా కంపెనీ యాజమాన్యాలే ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్గుతోంది.

-రాజారావు, ప్రిన్సిపల్‌ చింతపల్లి ఆర్‌ఐటీఐ


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని