logo

అనూహ్యం.. అనూషాకు అవకాశం!

వంతల బాబూరావు ఎంపీపీ పదవి కోల్పోవడానికి సొంత పార్టీలో విభేేదాలే కారణమని చర్చ జరుగుతోంది. గత ఏడాది సరిగ్గా సెప్టెంబరు 29న చింతపల్లిలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైకాపాకు మెజారిటీ ఉన్నా పార్టీలో అసమ్మతి సెగల కారణంగా లాటరీలో బాబూరావుకు పదవి వరించింది. ఇప్పుడు అదే పదవి సొంత పార్టీ నేతల

Published : 30 Sep 2022 00:53 IST

చింతపల్లి/గ్రామీణం, న్యూస్‌టుడే:

గత ఏడాది లాటరీ పద్ధతిలో ఎన్నిక నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి

వంతల బాబూరావు ఎంపీపీ పదవి కోల్పోవడానికి సొంత పార్టీలో విభేేదాలే కారణమని చర్చ జరుగుతోంది. గత ఏడాది సరిగ్గా సెప్టెంబరు 29న చింతపల్లిలో జరిగిన ఎంపీపీ ఎన్నిక ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. వైకాపాకు మెజారిటీ ఉన్నా పార్టీలో అసమ్మతి సెగల కారణంగా లాటరీలో బాబూరావుకు పదవి వరించింది. ఇప్పుడు అదే పదవి సొంత పార్టీ నేతల కారణంగా పోయింది. మండలంలో మొత్తం 20 సెగ్మెంట్లకు వైకాపా పది, తెదేపా 1, కాంగ్రెస్‌ 2, సీపీఐ 1 స్ధానాల్లో గెలుపొందగా స్వతంత్రులు ఆరు స్ధానాల్లో విజయం సాధించారు. ఎంపీపీ పదవికి మొదటి నుంచి రెండు సామాజికవర్గానికి చెందిన నాయకులు పోటీ పడ్డారు. వీరిలో తాజంగి ఎంపీటీసీ సభ్యురాలు కోరాబు అనూషాదేవి, బాబూరావు ఉన్నారు. ఎంపీపీ ఎన్నికకు వైకాపాకు పది మంది సభ్యులున్నప్పటికీ ఏకాభిప్రాయం కుదరలేదు. సొంత పార్టీలోనే అసంతృప్తులు, వ్యతిరేకులు ఉండటంతో పోటీ ఏర్పడింది. వైకాపా అధిష్ఠానం అనూషాదేవికి బీఫాం ఇచ్చింది. దీంతో ఆమె ఎంపీపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఈమె అభ్యర్థిత్వాన్ని సీపీఐ తరపున పోటీచేసి గెలుపొందిన ఎర్రబొమ్మలు ఎంపీటీసీ సభ్యుడు సెగ్గె సత్తిబాబు ప్రతిపాదించారు. అంజలీశనివారం ఎంపీటీసీ సభ్యుడు సాగిన వెంగళరావు బలపరిచారు. చేతులెత్తే పద్ధతిలో మొత్తం పదిమంది సభ్యులు అనూషా దేవికి మద్దతు తెలిపారు. బలపం, లోతుగెడ్డ, చింతపల్లి-1, చింతపల్లి-2, చౌడుపల్లి, ఎర్రబొమ్మలు, లంబసింగి, కిటుముల, అంజలీశనివారం ఎంపీటీసీ సభ్యులు వీరిలో ఉన్నారు. వైకాపా అధిష్ఠానం నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీలో నిలిచిన బాబూరావును అన్నవరం ఎంపీటీసీ సభ్యుడు కొర్రా సూరిబాబు ప్రతిపాదించగా పెదబరడ ఎంపీటీసీ సభ్యుడు పొట్టిక లోవరాజు బలపరిచారు. బాబూరావుకు కుడుముసారి, తమ్మంగుల, అన్నవరం, బెన్నవరం, కొత్తపాలెం-1, కొత్తపాలెం-2, కొమ్మంగి, పెదబరడ, గొందిపాకలు ఎంపీటీసీ అభ్యర్థులు మద్దతు తెలిపారు. ఎంపీపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న ఇద్దరికీ చెరో పది మంది ఓటేయడంతో అప్పటి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీంద్రనాథ్‌ నిబంధనల ప్రకారం లాటరీ వేయగా బాబూరావు పేరు వచ్చింది. దీంతో ఈయన్ను ఎంపీపీగా ఎంపిక చేసినట్టు ప్రకటించారు. వైకాపాకు ఎంపీపీ పదవి చేపట్టేందుకు సొంతంగానే మెజారిటీ ఉన్నా వర్గపోరు కారణంగా లాటరీ వరకూ వెళ్లింది. అప్పటి నుంచి అధిష్ఠానం ఎంపీపీ బాబూరావుపై గుర్రుగా ఉంది. ఆ తరువాత కొద్దికాలంపాటు పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆయనపై పార్టీ సీరియస్‌గానే ఉంది. ఇప్పుడు ఇదే ఆయన పదవి కోల్పోవడానికి కారణం అయ్యిందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మాట కాదని ఎంపీపీగా ఎన్నికవడంతోనే తనపై కక్షకట్టి అంతర్గతంగా కుట్రలు చేస్తున్నారని ఇటీవల బాబూరావు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాను హైకోర్టును ఆశ్రయిస్తానని పేర్కొన్నారు.

* చింతపల్లి ఎంపీపీ విషయంలో మొదటి నుంచీ అనూహ్య పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. గతంలో పాడేరు ఎమ్మెల్యేగా గిడ్డి ఈశ్వరి ఉన్న సమయంలో ప్రభుత్వం జారీ చేసిన విప్‌ను ధిక్కరించడంతో అప్పటి ఎంపీపీ కవడం మచ్చమ్మ పదవి కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు బాబూరావు విషయంలోనూ అదే జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని