logo

పట్టదా రోగుల గోడు

వైద్యారోగ్య శాఖలో చేపట్టిన నాడు-నేడు పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. రహదారులు భవనాల శాఖ అధ్వర్యంలో చేస్తున్న ఈ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్త భవనాలు పూర్తిచేయడంలో తాత్సారం చేస్తుండడంతో శిథిల భవనాల్లోనే చికిత్సలు అందించాల్సి వస్తోంది. ఆధునికీకరణ పనులు సైతం సకాలంలో

Published : 30 Sep 2022 04:17 IST

పీహెచ్‌సీల్లో రెండేళ్లుగా సాగుతున్న నిర్మాణాలు

-ఈనాడు డిజిటల్‌, పాడేరు, న్యూస్‌టుడే బృందం

వైద్యారోగ్య శాఖలో చేపట్టిన నాడు-నేడు పనులు నత్తకు నడక నేర్పిస్తున్నాయి. రహదారులు భవనాల శాఖ అధ్వర్యంలో చేస్తున్న ఈ పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొత్త భవనాలు పూర్తిచేయడంలో తాత్సారం చేస్తుండడంతో శిథిల భవనాల్లోనే చికిత్సలు అందించాల్సి వస్తోంది. ఆధునికీకరణ పనులు సైతం సకాలంలో చేయలేక చేతులెత్తేస్తున్నారు. మరికొన్నిచోట్ల పైపై మెరుగులద్ది నాసిరకం నిర్మాణాలతో సరిపెట్టేస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 88 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. వీటిలో తొమ్మిది చోట్ల రూ.15.40 కోట్లతో కొత్త భవనాలు నిర్మించడానికి అనుమతించారు. మరో 77 పీహెచ్‌సీల్లో రూ.39.40 కోట్ల అంచనాతో మరమ్మతులు, నిర్వహణ పనులను రెండేళ్ల క్రితమే మొదలుపెట్టారు. ఆరు నెలల్లోనే వీటిని పూర్తిచేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కనీసం 50 శాతం కూడా చేయలేకపోయారు. కొన్నిచోట్ల బిల్లుల సమస్య కారణంగా గుత్తేదారులు పనులు చేయలేమని చేతులెత్తేశారు. అసంపూర్తి పనులతో ఇటు వైద్య సిబ్బంది, అటు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కిల్లోగుడలో పూర్తవ్వని ప్రసూతి విభాగం గది

కలెక్టర్‌కే తప్పుడు నివేదికలు

పాడేరు డివిజన్‌ పరిధిలో నాడు-నేడు ద్వారా 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు రూ.17 కోట్ల వరకు నిధులొచ్చాయి. ఈ పనులపై రెండు రోజుల కిందట సమీక్షించిన కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ పనుల మందగమనం, డొల్లతనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చేయని పనులను కూడా చేసినట్లు చూపుతూ తప్పుడు నివేదికలు ఇస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

రంపచోడవరం డివిజన్‌ పరిధిలో 18 పీహెచ్‌సీలుంటే అందులో పది ఆసుపత్రుల మరమ్మతులకు రూ.3.85 కోట్లు మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో గుత్తేదారులు ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారు.  మరమ్మతులు పూర్తయిన పీహెచ్‌సీల్లో గోడలు బీటలు వారడంతో పాటు శ్లాబు పెచ్చులూడి వర్షపునీరు లీకవుతున్నాయి. మందులను ఉంచే గదులు, రోగులు ఉండే వార్డులు తడుస్తున్నాయి.
డుంబ్రిగుడ ఆసుపత్రిలో రూ.లక్షలు ఖర్చుచేసినా ప్లంబింగ్‌ పనులు చేయలేదు. బేసిన్లు అసంపూర్తిగా బిగించి వదిలేశారు. ఆసుపత్రి ముఖద్వారానికి గేటు కూడా వేయలేదు. కిల్లోగుడ పీహెచ్‌సీలో మరుగుదొడ్లు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. పీహెచ్‌సీలో ప్రసూతి విభాగం గది సిద్ధం కాకపోవడంతో ప్రసవాలకు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


మినుములూరులో శుద్ధజలం ప్లాంటు దుస్థితి

హుకుంపేట మండలం ఉప్ప  పీహెచ్‌సీకి అరకొరగా మరమ్మతులు చేపట్టి వదిలేశారు. జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం ఈ పనులను పరిశీలించి నాణ్యత లోపాలను గుర్తించారు. వాటిని జడ్పీ సమావేశంలో ప్రస్తావించారు. ఐటీడీఏ పీవో ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

పాడేరు మండలం మినుములూరు పీహెచ్‌సీలో రోగులు విశ్రాంతి గది చిన్నపాటి వర్షానికే చెమ్మ చేరుతోంది. మరుగుదొడ్లలో నీటి సరఫరాకు గొట్టాలు అమర్చలేదు. కిటికీ అద్దాలు ఏర్పాటు చెయ్యలేదు. శుద్ధ జలం ప్లాంటు మరమ్మతులతో అలంకారప్రాయంగానే ఉంది. నాడు-నేడు పనులు చేపట్టక ముందే బాగుండేదని, మరమ్మతులు మొదలెట్టి ఇలా వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నట్లు రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు.

గూడెంకొత్తవీధి మండలం పెదవలస పీహెచ్‌సీకి రూ.50 లక్షలు కేటాయించినా పనులే మొదలు కాలేదు. టెండరు దక్కించుకున్న గుత్తేదారు జాప్యం చేయడంతో ఆయన్ని తప్పించి మరొకరికి పనులు అప్పగించారు. ఆయన కూడా పనులు చేపట్టలేదు. ఫలితంగా పెదవలస ఆస్పత్రిలో ప్రహరీ లేక, మరుగుదొడ్లు మరమ్మతులు చేపట్టక స్థానిక సిబ్బంది, రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.  


పెదవలసలో మరుగుదొడ్ల దుస్థితి


పనులు పూర్తిచేయిస్తాం.. : ఆసుపత్రుల్లో నాడు-నేడు పనులు చాలావరకు పూర్తిచేయించాం. కొన్నిచోట్ల గుత్తేదారులు మధ్యలో నిలిపేశారు. అలాంటి పీహెచ్‌సీల్లో మిగిలిన పనులకు మరలా టెండర్లు పిలుస్తున్నాం. అసంపూర్తి పనులన్నీ త్వరితగతిన అయ్యేలా చూస్తాం. నాణ్యత లోపిస్తే బాధ్యులపై చర్యలుంటాయి.

-జాన్‌ సుధాకర్‌, ఎస్‌ఈ, ర.భ.శా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని