logo

పుడమి విశేషాల కలిమి

భూమి.. మానవాళికి అవసరమైన అన్నింటినీ సమకూర్చే వనరు. ఎన్నో వింతలు, విచిత్రాలకు వేదిక. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యభరితంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరంగా చూస్తే ఎన్నో ప్రత్యేకతలున్నాయి.

Published : 05 Oct 2022 02:47 IST

రేపు అంతర్జాతీయ భూవైవిధ్య దినోత్సవం

కోట్లాది సంవత్సరాల కిందటి కీటకాలు, ఆల్చిప్ప

పాయకరావుపేట, న్యూస్‌టుడే: భూమి.. మానవాళికి అవసరమైన అన్నింటినీ సమకూర్చే వనరు. ఎన్నో వింతలు, విచిత్రాలకు వేదిక. ప్రాంతాన్ని బట్టి వైవిధ్యభరితంగా ఉంటూ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. ఉమ్మడి విశాఖ జిల్లా పరంగా చూస్తే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. బంగారు వర్ణంతో మెరిసే ఇసుక తిన్నెలతో హొయలు ఒలకబోసే తీర ప్రాంతం, ఎర్రమట్టి దిబ్బలు, బొర్రా గుహలు ఇలా ఒక్కటేమిటీ ప్రతిదీ చూడదగిన ప్రదేశమే. అంతే కాదండోయ్‌.. బాక్సైట్‌, లేటరైట్‌ లాంటి ఖనిజాలు, గొలుగొండ మండలం కరక ప్రాంతాల్లో రంగురాళ్ల కొండల సమాహారంతో అలరారుతోంది. గురువారం అంతర్జాతీయ భూవైవిధ్య దినోత్సవం. ఈ సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

శిలాజాలు.. వయసు ఘనం
కోట్లాది సంవత్సరాల కిందట భూమిపై నడయాడిన రాక్షస బల్లులు (డైనోసార్లు) అంతరించిపోయిన విషయం తెలిసిందే. ఆ ఆనవాళ్లు ఇప్పుడు దొరికితే చూసేందుకు ఎంతో ఆసక్తి చూపుతాం. చేపలు, కీటకాలు, ఆల్చిప్పలు, వృక్షాలకు సంబంధించి శిలాజాల రూపంలో లభ్యమైతే ఆ ఆనందమే వేరు. ఇవన్నీ దొరకాలంటే భూమే ఆధారం. తవ్వకాల్లో అడపాదడపా శిలాజాలు బయటపడుతూ నాటి చరిత్రను కళ్ల ముందుంచుతున్నాయి. భూమిలో కూరుకుపోయిన వృక్షాలు, ఇతర అవశేషాలు కోట్లాది సంవత్సరాలపాటు జరిగిన రసాయన చర్యల ఫలితంగా ఇంధనంగా మారుతున్న విషయం విదితమే. కోనసీమ ప్రాంతంలో దొరుకుతున్న గ్యాస్‌, ఆయిల్‌ నిక్షేపాలే ఇందుకు తార్కాణం. తీరప్రాంతంలో దొరికే ఇసుకలో విలువైన ఖనిజాలున్నాయని తేలడంతో నక్కపల్లి మండలంలోని బంగారమ్మపేటలో పరిశ్రమను ఏర్పాటు చేశారు. కొన్ని వివాదాల కారణంగా అక్కడ ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి.

చూడాలనుందా..
డైనోసార్‌ కాలి ఎముక, వాటి గుడ్డు ఎలా ఉంటుందో చూడాలనుందా.. అయితే పాయకరావుపేట రండి. దక్కన్‌ పరిశ్రమలో ఎలక్ట్రికల్‌ ఇంజినీరుగా పని చేస్తున్న కందుల వెంకటేష్‌ ఇలాంటివి ఎన్నో సేకరించి భద్రపరుస్తున్నారు. కోట్లాది సంవత్సరాల కిందట మట్టిలో కప్పబడిన జీవులు, చెట్ల ఆకులు, బెరడు భూమిలోపల మట్టితో కలిసి యథాతథంగా రాళ్లుగా మారి శిలాజాలుగా రూపొందుతాయనే విషయం తెలిసిందే. డైనోసార్‌ ఎముకలు, కాలి భాగాలను ఆయన సేకరించారు. తెలంగాణాలోని గోదావరి, ప్రాణహిత బేసిన్‌లో ఇవి లభ్యమయ్యాయని చెబుతున్నారు. బొద్దింకలను పోలి ఉండే కీటకాలు, చేప, ఆకులు, సముద్ర జీవులు, నత్తలు తదితర శిలాజాలను సేకరించారు. గోదావరి పరివాహక ప్రాంతాలు, రాజమహేంద్రవరం, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి వాటిని సేకరించారు. శిలాజాలుగా మారిన డైనోసార్‌ గుడ్లు వెంకటేష్‌ వద్ద ఉన్నాయి. పునాదులు, బావులు, లోతైన గుంతలు, కాలువలు తవ్విన చోట్ల ఆయన శిలాజాల కోసం వెతుకుతుంటారు. శిలాజాలన్నీ 5.5 కోట్ల ఏళ్ల కిందటివి కావడం విశేషం.

భూవైవిధ్యంపై అవగాహన తప్పనిసరి
భూవైవిధ్యంపై అవగాహన తప్పనిసరిగా పెంచుకోవాలి. భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. ఇందులో భాగంగానే విశ్వవిద్యాలయాలు, కళాశాలల విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా ఆసక్తిని పెంచుతున్నాం. చరిత్రకు సంబంధించిన ఆనవాళ్ల కోసం నిరంతరం శ్రమిస్తున్నా. దీనిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నా. - కందుల వెంకటేష్‌,

శిలాజంగా మారిన చేప

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని