logo

Super Star Krishna: మన్నెం మదిలో అల్లూరి ఆయనే..

తెలుగు చిత్రసీమలో అల్లూరి సీతామరాజు ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ చిత్రం తన జీవితాన్ని ఓ మలుపు     తిప్పిందంటూ కృష్ణ అనేక సందర్భాల్లో చెప్పారు

Updated : 16 Nov 2022 09:35 IST

సూపర్‌స్టార్‌ కృష్ణ జ్ఞాపకాలు పదిలం
మరవలేని వ్యక్తి

ఈనాడు డిజిటల్‌ పాడేరు, న్యూస్‌టుడే చింతపల్లి

తెలుగు చిత్రసీమలో అల్లూరి సీతామరాజు ఒక ప్రభంజనం సృష్టించింది. ఆ చిత్రం తన జీవితాన్ని ఓ మలుపు     తిప్పిందంటూ కృష్ణ అనేక సందర్భాల్లో చెప్పారు. ఒక సీతారామరాజు మరణిస్తే వందల సీతారామరాజులు పుట్టుకొస్తారు.. అంటూ బ్రిటిష్‌ సైనికులకు రొమ్ము చూపించి అక్కడ కాదురా, ఇక్కడ కాల్చు అంటూ గుండెలు ఎదురొడ్డిన అల్లూరిని అడవి బిడ్డలు ఎప్పటికీ మరచిపోరు. ఆయన జీవిత గాథను ఆధారంగా చేసుకుని చిత్రీకరించిన సినిమాలో జీవించిన కృష్ణనూ మరచిపోరు. నాడు విప్లవ వీరుడు దాడి  చేసిన చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌. ఇక్కడే అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరించారు అల్లూరి సీతారామరాజు సినిమా చిత్రీకరణలో నాటి చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌ అల్లూరి దాడి సన్నివేశాలను ఇక్కడ పాత పోలీస్‌ స్టేషన్‌లోనే చిత్రీకరించారు. ఆసినిమాలో చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సైగా రాజుబాబు నటించారు. అల్లూరి పాత్రలో కృష్ణ అనుచర గణంతో పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడి ఆయుధాలు పట్టుకువెళ్లారు.

మన్యం పేరు చెపితే అల్లూరి సీతారామరాజు గుర్తుకొస్తారు. బ్రిటిష్‌ సైనికులను గడగడలాడించిన నిజమైన అల్లూరి గురించి ఇప్పటికీ చాలామందికి తెలీదు. ఆయన పేరు చెబితే నేటికీ అంతా సినీ నటుడు కృష్ణనే ఊహించుకుంటారు. అంతలా ఆయన నటనలో జీవించారు అనడంలో సందేహం లేదు. ఆ సినిమా చిత్రీకరణలో చాలా భాగం ఉమ్మడి విశాఖ, ప్రస్తుత అల్లూరి జిల్లాలోనే జరిగింది. అల్లూరి నడయాడిన నేలగా మన్యానికి చారిత్రక నేపథ్యం ఉంది.

కృష్ణ బసచేసిన చింతపల్లి జడ్పీ అతిథిగృహం

నాటి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గిరిజనులతో కలసి బ్రిటిష్‌ సైనికులతో పోరాడిన సమయంలో చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై సాయుధ దాడి, బ్రిటిష్‌ సైనికులకు మిరపకాయ టపాతో హెచ్చరికలు జారీచేయడం వంటి సంఘటనలు నిజంగానే జరిగాయి. ఆయన జీవిత గాథ ఆధారంగా తీసిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో సూపర్‌స్టార్‌ కృష్ణ అత్యద్భుతంగా నటించారు. దీనికోసం ఆయన చాలాకాలం పాటు చిత్రయూనిట్‌తో కలసి మన్యంలోనే ఉన్నారు. ఆ నటశేఖరుడు మంగళవారం గుండెనొప్పితో దివికేగిన విషయం తెలిసి జిల్లా వాసులంతా ఇక్కడి షూటింగ్‌ విశేషాలను స్మరించుకున్నారు.

ఆయన చొరవతో మరమ్మతులు

లంబసింగిలో అప్పటి బ్రిటిష్‌ అధికారి రూథర్‌ ఫర్డ్‌ బసచేసేందుకు ప్రత్యేకంగా అతిథి గృహాన్ని నిర్మించారు. ఆ సమయంలోనే లంబసింగి ఘాట్‌ రోడ్డును అప్పటి ఆంగ్లేయ పాలకులు నిర్మించారు. అల్లూరి సీతారామరాజు సినిమాలో సీతారామరాజును బంధించి, తుపాకీతో కాల్చి చంపిన సన్నివేశం ఇక్కడే చిత్రీకరించారు. తిరిగి వెళ్లేటప్పుడు కృష్ణ చొరవ చూపి ఈ గెస్ట్‌ హౌస్‌కు మరమ్మతులు చేయించారు. దీంతో అనంతర కాలంలో పలువురు అధికారులు, నాయకులు దీన్లో బస చేయడం మొదలెట్టారు. ఇది గమనించిన మావోయిస్టులు ఈ అతిథి గృహంపై దాడి చేసి కొంతమేర ధ్వంసం చేయడం గమనార్హం.

పాటలూ ఇక్కడే..: తాజంగి సమీపంలోని గొప్పులపాలెం వద్ద తెల్ల సైనికులతో పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. దీనికోసం

అక్కడ డమ్మీ ఫిరంగులను వినియోగించారు. ‘తెలుగువీర లేవరా.. దీక్ష బూనిసాగరా!’ అంటూ రోమాలు నిక్కబొడుచుకునేలా రచించిన పాటను ఇక్కడే చిత్రీకరించారు. ‘వస్తాడు నా రాజు.. ఈరోజు’ పాటను ఇక్కడి జలపాతం వద్ద చిత్రంలోని కథానాయిక విజయనిర్మలపై చిత్రీకరించారు.

కృష్ణకు ఏయూ డాక్టరేట్‌...

ఏయూ ప్రాంగణం, న్యూస్‌టుడే : ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ఘట్టమనేని కృష్ణకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 2008 జనవరి 16న 75వ స్నాతకోత్సవంలో డాక్టరేట్‌తో గౌరవించింది. అప్పటి ఉపకులపతి గోపాలకృష్ణారెడ్డి ఆయనకు డాక్టరేట్‌ అందించారు. ఈ కార్యక్రమంలో అప్పటి జాతీయ నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌ శ్యామ్‌ప్రిటోడా ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కృష్ణతో పాటు ఇదే వేదికపై ప్రముఖ సినీ గేయ రచయిత జాలాది రవి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ సుంకరి ఆదినారాయణరావు, విద్యావేత్త దొడ్ల రామచంద్రరెడ్డి ఏయూ నుంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నారు. కృష్ణ సినీరంగ ప్రవేశానికి ముందు ఏలూరు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పుడు సి.ఆర్‌.రెడ్డి కళాశాలలో ఏయూ పరిధిలో ఉండేది. దీంతో ఆయన ఏయూ పూర్వ విద్యార్థిగా ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు అందుకోవడానికి వచ్చినపుడు విజయనిర్మలతో కలసి ఏయూని సందర్శించారు.

స్థానికులకే తెరపై అవకాశం..:

అల్లూరి సీతారామరాజు సినిమా అంతా అమాయక గిరిజనులు, వారి ఆహారపు అలవాట్లు, చైతన్యం లేమి వంటి గిరిజన జీవన విధానాలతో ముడిపడి ఉంటుంది. అప్పట్లో గిరిజన గూడేల్లో పూరి గుడిసెలతో మట్టి ఇళ్లే ఉండేవి. సినిమా కోసం ప్రత్యేకంగా సెట్లు నిర్మించకుండా గిరిజనుల పూరి గుడిసెల్లోనే సినిమా చిత్రీకరించారు. ఈ సినిమాలో అల్లూరి అనుచరులుగా స్థానిక గిరిజనులకే నటించే అవకాశం కల్పించారు.  

*‘నివురుగప్పిన నిప్పు’ సినిమా షూటింగ్‌ కోసం శివాజీగణేశన్‌, షావుకారు జానకి తదితర నటులతో కలిసి కృష్ణ నెలపాటు చింతపల్లిలో జడ్పీ అతిథి గృహంలో బస చేశారు. దోనుగుమ్మల, కొత్తూరు తదితర పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరణ జరిగింది.  
వలిసె పూలకు డబ్బులు చెల్లించి..: పాడి పంటలు సినిమా చిత్రీకరణ కోసం హీరో కృష్ణ గూడెంకొత్తవీధి మండలం పెదవలస, జడుమూరు వచ్చారు. అందులో ఒక పాటను వలిసె పూల తోటలో చిత్రీకరించాల్సి వచ్చింది. ఆ సమయంలో వలిసెల సాగుచేస్తున్న రైతును కృష్ణ పిలిపించి చిత్రీకరణ వల్ల తోటకు నష్టం జరుగుతుంది కనుక కొంత నగదును ఇచ్చినట్టు స్థానికులు చెప్పారు.
వీసీ సంతాపం: కృష్ణ మృతిపట్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య పి.వి.జి.డి.ప్రసాదరెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు ప్రజల మనసులో ఆయన స్థానం సుస్థిరమైనదని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ఆ పేరే పెట్టారు..

లంబసింగి గ్రామ పరిసరాల్లో చిత్రీకరణ సమయంలో మా మూడో తమ్ముడు జన్మించగా ఆయనకు మా తల్లిదండ్రులు రామరాజు అనే పేరును పెట్టారని మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి పేర్కొన్నారు. ‘మాది లంబసింగి గ్రామం. ఆ షూటింగ్‌ చివరి దశలో ఉన్న సమయంలో మా తమ్ముడు జన్మించాడు. నిజమైన సీతారామరాజును మేము చూడకపోయినా.. హీరో కృష్ణను చూస్తే అల్లూరి చూసినట్లే ఉండేద’న్నారు.

కోయదొర వేషం మధుర జ్ఞాపకం

పాడేరు, న్యూస్‌టుడే: విప్లవ వీరుడి జీవితం ఆధారంగా సూపర్‌స్టార్‌ కృష్ణ నిర్మించిన చిత్రంలో తాను భాగం పంచుకోవడం నా జీవితంలో మరువలేని జ్ఞాపకంగా నిలిచిపోతుందని అప్పట్లో ఈ చిత్రంలో బాణం పట్టుకుని కోయ వేషధారణ వేసిన లువ్వాబు పండుదొర తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ప్రస్తుతం ఈయన లంబసింగి గ్రామంలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కృష్ణ మరణవార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటి మధురమైన జ్ఞాపకాలను ఆయన ‘న్యూస్‌టుడే’తో పంచుకున్నారు. ‘మేము చదువుకునే రోజుల్లో ఆర్నెల్లకు పైగా ఈ సినిమాను ఇక్కడే తీశారు. ఆ సమయంలో షూటింగ్‌కు వీక్షించేందుకు వెళుతుండేవాళ్లమన్నారు. ఒక రోజు చిత్రం యూనిట్‌ సభ్యులు మమ్మల్ని చూసి రామరాజుకు వెనుక భాగంలో కోయ వేషంలో బాణం పట్టుకుని ఉండే వేషం వేస్తావా అని అడిగారు. నాతో పాటు ఉన్న మరో ఐదుగురు హీరో కృష్ణతో కలిసే భాగ్యం కలుగుతుందని వేషం వేసేందుకు ఒప్పుకొన్నాం. అప్పట్లో సొంత కెమెరాలు లేవు, యూనిట్‌ సభ్యులు కృష్ణ పక్కన ఉండేలా ఫొటో తీసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు. నిజమైన అల్లూరిని చూడకపోయినా ఆ వేషధారణలో కృష్ణను చూసిన తర్వాత విప్లవ వీరుడ్ని చూసినంత సంతృప్తి తమకు కలిగింద’ని పండుదొర చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని