logo

ఆట.. కొలువుల బాట

విద్యాలయాలలో ఆటలు ఓ భాగం. ఇవి నేర్చుకున్నాక పోటీల్లో ప్రావీణ్యం చూపితే, అక్కడే వీక్షకుల ప్రశంసలు, అభిమానం పొందుతారు.

Updated : 25 Nov 2022 05:59 IST

ఉపాధ్యాయులుగా ఎంపికైన క్రీడాకారుల స్ఫూర్తిమంత్రం
వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

విద్యాలయాలలో ఆటలు ఓ భాగం. ఇవి నేర్చుకున్నాక పోటీల్లో ప్రావీణ్యం చూపితే, అక్కడే వీక్షకుల ప్రశంసలు, అభిమానం పొందుతారు. ఇలా ప్రతిభ కనబర్చుతూ, క్రీడల్లో ముందుకు సాగితే, చక్కటి ఫలితాలు కనిపిస్తాయి.

ఉమ్మడి తూ.గో. జిల్లాలో 2018 డీఎస్సీలో క్రీడా విభాగంలో ప్రతిభతో ఎనిమిది మంది అర్హత సాధించారు. కొందరు డీఎస్సీ అభ్యర్థులు న్యాయస్థానం వరకు వెళ్లడంతో పాటు కొన్ని సాంకేతిక కారణాల దృష్ట్యా పోస్టింగ్‌లు ఇవ్వడం ఆలస్యమైంది. తీర్పు వెలువడటంతో ఈనెల మొదటి వారం నుంచి వీరందరికి పోస్టింగ్‌లు ఇచ్చారు. సరదాగా ఆడిన ఆటలు వారి భవిష్యత్తుకు అండగా, ఉద్యోగ అవకాశాలకు సోపానంగా మారడంతో వారి ఆనందానికి అంతులేకుండా పోయింది. ప్రధానంగా రంపచోడవరం మన్యం నుంచి ఐదుగురు ఎంపికవ్వడం విశేషం.

పరుగుల దొర

రంపచోడవరానికి చెందిన యాదిద్యా దొర వ్యవసాయ ఆధారిత కుటుంబానికి చెందినవాడు. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో, ఇంటర్‌ను దూర విద్యా విధానంలో పూర్తిచేశారు. గోకవరంలో డైట్‌ కళాశాలల్లో శిక్షణ పొందారు. పాఠశాలలో, కళాశాలల్లో 100 మీటర్ల పరుగు, హర్డిల్స్‌ పరుగులో ప్రావీణ్యం చూపారు. ఇదే ఉపాధి మార్గమైంది. ప్రస్తుతం ఈయన సొంత మండలంలోని సీడిపాలెంలో గిరిజన ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు.


పవన్‌కల్యాణ్‌

వీఆర్‌పురం మండలానికి చెందిన పవన్‌కల్యాణ్ ఫెన్సింగ్‌లో ప్రతిభ చూపేవారు. ఇదే మండలంలోని చింతరేవుపల్లి  పాఠశాలలో ఎస్‌జీటీగా కొలువు సాధించారు.


విద్యార్థులకు పాఠ్యాంశాలు చెబుతున్న దొర

దుర్గమ్మ (రెజ్లింగ్‌), కె.శ్రీబాల (హాకీ), వి.రాజు (చదరంగం), డి.పవన్‌కల్యాణ్‌ (ఫెన్సింగ్‌), ఎస్‌.సంజీవరెడ్డి (ఫుట్‌బాల్‌), కె.యాదిద్యా దొర (పరుగులు), రమాదేవి (వాలీబాల్‌), ఎ.సుబ్బలక్ష్మి (ఫుట్‌బాల్‌) క్రీడాకోటాలో కొలువు సాధించిన వారిలో ఉన్నారు. వారి నేపథ్యాలు, స్ఫూర్తి ప్రస్థానంపై ‘న్యూస్‌టుడే’ కథనం..


వాలీబాల్‌..  రమా ఆయుధం

కూనవరం మండలం చూచిరేవులగూడెంకు చెందిన అనిగి రమాదేవి పదో తరగతి వరకు స్థానిక గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో చదివారు. ఇంటర్‌ సుదిమళ్లలోని ప్రభుత్వ గిరిజన బాలికల కళాశాలలో, డిగ్రీని భద్రాచలంలో పూర్తిచేశారు. పాఠశాలలో, ఇంటర్‌లో వాలీబాల్‌ పోటీలలో అద్భుతమైన ప్రతిభను కనబర్చి దాదాపుగా నాలుగుసార్లు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఆమె జీపీస్‌ కూనవరంలో ఉపాధ్యాయురాలిగా చేరారు.


ఫుట్‌బాల్‌తో గోల్‌ సాధించి..

రంపచోడవరానికి  చెందిన సంజీవరెడ్డి పేద గిరిజన కుటుంబానికి చెందిన వాడే. మారేడుమిల్లి ఏపీఆర్‌ కళాశాలలో ఆరు నుంచి ఇంటర్‌ వరకు చదివారు. డిగ్రీ కాకినాడలో పూర్తి చేశారు. డైట్‌ రావులపాలెంలో చేశారు. పాఠశాలలో, ఇంటర్‌లో ఆడిన ఫుట్‌బాల్‌కు కాకినాడలో మరింత మెరుగులు దిద్దుకున్నారు. రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సాధించారు. దీని ఫలితంగా ఉద్యోగం సాధించారు. ప్రస్తుతం దేవిపట్నం మండలంలోని దండంగిలో గిరిజన ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు.


కండక్టర్‌గా చేస్తూ..

గంగవరం మండలంలోని గొరగొమ్ముకు చెందిన ఎ.సుబ్బలక్ష్మి వాలీబాల్‌లో ఉత్తమ ప్రతిభ చూపారు. ప్రభుత్వ పాఠశాల, కళాశాలలో ఇంటర్‌వరకు చదివారు. డైట్‌ గోకవరంలో పూర్తి చేశారు. వెంటనే ఉద్యోగం రాకపోవడంతో ఆర్టీసీ కండక్టర్‌గా ఎంపికయ్యారు. కోర్టు తీర్పు అనంతరం మల్లవరం జీపీఎస్‌కు ఉపాధ్యాయురాలిగా నియమితులయ్యారు. ఆర్టీసీ ఉద్యోగాన్ని వదిలి ఉపాధ్యాయురాలిగా చేరతానని తెలిపారు.


చదువుతోపాటు క్రీడలు ముఖ్యమే : ఆటలను తేలికగా కొట్టిపారేయకూడదు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలపైన పట్టు సాధించాలి. అవి ప్రధానంగా ఆరోగ్యానికి దోహదం చేయడంతో పాటు భవిష్యత్తులో ఉద్యోగావకాశాలకు దారి చూపుతాయి. కళాశాల నుంచి టెక్నికల్‌ కోర్సులపైన విద్యార్థులు దృష్టి సారించాలి. ఆ ధ్రువ పత్రాలు ఉద్యోగాలు పొందడానికి సోపానాలుగా మారతాయి.

లక్ష్మీనారాయణ, ఎంఈవో


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts