logo

తపాలా కార్యాలయ భవనం సిద్ధం

చింతపల్లిలో 91 ఏళ్ల తరువాత ఎట్టకేలకు తపాలాశాఖ కార్యాలయానికి సొంత భవనం సమకూరింది.

Published : 25 Nov 2022 02:15 IST

చింతపల్లి, న్యూస్‌టుడే: చింతపల్లిలో 91 ఏళ్ల తరువాత ఎట్టకేలకు తపాలాశాఖ కార్యాలయానికి సొంత భవనం సమకూరింది. నిర్మాణ పనులన్నింటినీ పూర్తి చేసుకుని త్వరలో ప్రారంభానికి సిద్ధం అవుతోంది. చింతపల్లిలో తపాలాశాఖ కార్యాలయానికి చారిత్రక నేపథ్యం ఉంది. 1930లో ఇది ప్రారంభమైంది. అప్పటి బ్రిటిష్‌ అధికారులు స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదుట నిర్మించిన రేకుల భవనంలో ఈ కార్యాలయాన్ని నెలకొల్పారు. కాలక్రమంలో ఈ భవనాన్ని రహదారులు, భవనాలశాఖ స్వాధీనం చేసుకుంది. ప్రభుత్వశాఖ అయినప్పటికీ నామమాత్రపు అద్దె చెల్లించాలన్న నిబంధన ఉండటంతో అప్పట్లో ఈ భవనానికి కేవలం నెలకు రూ. 10 అద్దెను తపాలాశాఖ చెల్లిస్తూ వచ్చింది. రేకుల భవనం శిథిలమవడంతో దీన్ని పూర్తిగా తొలగించారు. పాత భవనం ఉన్న ప్రాంతాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని వారి అవసరాలకు తగ్గట్టుగా రక్షణ గోడ నిర్మించారు. దీంతో తపాలాశాఖ కార్యాలయాన్ని కొద్దికాలం కిందట మరో అద్దె భవనంలోకి మార్చారు. అప్పటినుంచి ఇది అద్దె భవనంలోనే కొనసాగుతోంది. చింతపల్లిలో గిరిజన సహకార సంస్థ పెట్రోలు బంకు ఎదుట తపాలాశాఖకు సొంత స్థలం ఉంది. ఇది చాలాకాలంపాటు ఖాళీగానే ఉండిపోయింది. ఎట్టకేలకు ఈ స్థలంలో కార్యాలయాన్ని నిర్మించేందుకు అధికారులు అంగీకరించారు. ఇందుకోసం రూ.30 లక్షలు విడుదల చేశారు. దీంతో భవన నిర్మాణం పూర్తయ్యింది. ప్రస్తుతం ఫర్నిచర్‌ పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయిన తరువాత డిసెంబరు నెలలో దీన్ని ప్రారంభించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని తపాలాశాఖ ఇన్‌స్పెక్టర్‌ శ్రీకాంత్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని