logo

లోతుగెడ్డలో యువకుడి హత్య

చిన్న వివాదం కారణంగా ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది.

Published : 26 Nov 2022 02:26 IST

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చిన్న వివాదం కారణంగా ఒక యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన మండలంలోని లోతుగెడ్డ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సరమండ దిలీప్‌కుమార్‌ మద్యం మత్తులో అదే గ్రామానికి చెందిన పేరూరి శ్రీనివాసరావు (39) ఇంటికి వెళ్లాడు. ఇంటి బయట ఎండబెట్టిన ఉప్పును పారవేస్తుండగా శ్రీనివాసరావు భార్య కుమారి ప్రశ్నించింది. దీంతో ఆమెను కొట్టాడు. బాధితులు అన్నవరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న దిలీప్‌కుమార్‌ మరింత రెచ్చిపోయి గ్రామంలో కోడికత్తితో హల్‌చల్‌ చేస్తూ తిరిగాడు. శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి అతని ఛాతి, పొట్టపై బలంగా పొడిచాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆయన అపస్మారక స్థితికి చేరుకోవడంతో లోతుగెడ్డ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీనిపై సమాచారం అందిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నవరం ఎస్సై సాయికుమార్‌ తెలిపారు.


సీలేరు సర్పంచి పరదేశీ ఆకస్మిక మృతి

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు మేజర్‌ పంచాయతీ సర్పంచి కొర్రా పరదేశీ (70) శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా మృతి చెందారు. ఉదయం ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు స్థానిక జెన్‌కో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో జెన్‌కో సీఎస్‌ఆర్‌ అంబులెన్స్‌లో భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. గతంలో పరదేశీకి ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏపీఎస్‌ఈబీలో పనిచేసి పదవీ విరమణ పొంది సీలేరులో స్థిరపడ్డారు. గతంలో ఓసారి కాంగ్రెస్‌ పార్టీ మద్దతుతో సర్పంచిగా పోటీ చేసి గెలుపొందారు. 2021లో కాంగ్రెస్‌, తెదేపా పార్టీల మద్దతుతో పోటీచేసి విజయం సాధించారు. సౌమ్యుడిగా, అందరిని ఆప్యాయంగా పలకరించే వ్యక్తిగా పరదేశీ పేరు పొందారు. ఈయన ఆకస్మిక మృతితో సీలేరులో విషాదం నెలకొంది.


రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

దేవీపట్నం, రంపచోడవరం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రంపచోడవరం మండలం ముసురుమిల్లి పునరావాస కాలనీ సమీపంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవీపట్నం మండలం రాయవరం గ్రామానికి చెందిన చారపు బుల్లిఅబ్బాయిదొర (30) రంపచోడవరం వైపునకు శుక్రవారం ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. ముసురుమిల్లి పునరావాస కాలనీ సమీపంలో ద్విచక్రవాహనం ప్రమాదవశాత్తు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై మోహన్‌కుమార్‌ తెలిపారు.


 


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని