logo

జగనన్న కాలనీల్లోకి బినామీలు

‘ప్రభుత్వం ఇచ్చే రూ.1.8 లక్షలతో ఏజెన్సీ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదు.. సిమెంటు సరఫరా చేయడం లేదు.. ఇసుక అందుబాటులో లేదు.. మరి గూడు ఎలా పూర్తవుతుంది..?

Updated : 27 Nov 2022 09:40 IST

ఉపాధి హామీ అక్రమార్కులకు కొమ్ముకాస్తున్నవారెరు?
జడ్పీ సర్వసభ్య సమావేశంలో నిలదీసిన సభ్యులు
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం

‘ప్రభుత్వం ఇచ్చే రూ.1.8 లక్షలతో ఏజెన్సీ ప్రాంతంలో ఇళ్లు నిర్మించుకునే పరిస్థితి లేదు.. సిమెంటు సరఫరా చేయడం లేదు.. ఇసుక అందుబాటులో లేదు.. మరి గూడు ఎలా పూర్తవుతుంది..? ఇక్కడ యూనిట్‌ విలువ పెంచాలి’ అంటూ మన్యానికి చెందిన జడ్పీటీసీ సభ్యులు మంత్రి అమర్‌నాథ్‌ దృష్టికి తీసుకువెళ్లారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన, పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ప్రభుత్వ విప్‌ కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో శనివారం జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సభ్యులు పలు సమస్యలను లేవనెత్తారు. వాటన్నింటికి పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో తాత్కాలికంగా జడ్పీ కార్యాలయం ఏర్పాటు చేసి పూర్తిస్థాయి డిప్యుటీ సీఈవోని నియమించనున్నట్లు చెప్పారు. సీఈవో కూడా వారంలో మూడు రోజులు అక్కడే ఉంటారని తెలిపారు. సభ్యులడిగిన ప్రశ్నలకు అనకాపల్లి జిల్లా కలెక్టరు రవి పట్టన్‌శెట్టి, విశాఖ, అల్లూరి జిల్లాల జేసీలు విశ్వనాథ్‌, శివశ్రీనివాస్‌, జడ్పీ సీఈవో శ్రీరామమూర్తి సమాధానాలు చెప్పారు.

జడ్పీ సమావేశం పది గంటలకే మొదలుకావాల్సి ఉన్నా ఆ సమయానికి నేతలెవరూ రాకపోవడంతో ఆలస్యంగా ప్రారంభించారు. ముందు ఛైర్‌పర్సన్‌ సుభద్ర, విశాఖ, అల్లూరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వచ్చి భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు. 11 గంటలకు పాడేరు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి వచ్చారు. తర్వాత మంత్రి అమర్‌, విప్‌ ధర్మశ్రీ వేదికపైకి వచ్చారు. కొంత సమయంలో తర్వాత అనకాపల్లి కలెక్టర్‌ రవి, ఎమ్మెల్సీ మాధవ్‌, వరుదు కళ్యాణి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ డా.సత్యవతి ఒక్కొక్కరుగా వచ్చారు. నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్‌ విశ్రాంతిలో ఉన్నారు. విశాఖ, అరకు ఎంపీలు, ఎలమంచిలి, పాయకరావుపేట, అరకులోయ, పెందుర్తి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు ముఖ్యమంత్రితో భేటీ ఉందని హాజరు కాలేదు. జడ్పీటీసీ సభ్యుల్లోనూ కొందరు రాలేదు.

మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ సుభద్ర, పక్కన అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ రవి

ఇవిగో సమస్యలు.. పరిష్కారం చూపండి..

* జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పించిన తర్వాత నిర్మాణాలపై ఒత్తిడి తెస్తే బాగుంటుంది. కొంతమంది ఇళ్లు కట్టుకోలేక బయటవారికి అమ్మేస్తున్నారు.. అలాంటి బినామీ లబ్ధిదారులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ మాధవ్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రభుత్వ విప్‌ ధర్మశ్రీ మాధవ్‌ లేవనెత్తిన అంశంతో ఏకీభవించారు. చాలామంది ఇళ్లు అమ్మేసుకుంటున్నారని, అలాకాకుండా ఇళ్ల నిర్మాణాలు చేపట్టని వారి పట్టాలు రద్దుచేసి తర్వాత క్రమంలో అర్హులకు అందజేయాలని అధికారులకు సూచించారు. ఓటీఎస్‌ కింద డబ్బులు తీసుకుని పట్టాలు ఇవ్వలేదని, ఆ డబ్బులైనా ఇప్పించండి లేకుంటే పట్టాలైనా ఇవ్వాలని దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం కోరారు.

* గతంలో ఇళ్లు మంజూరు చేసి వారి పేరిట ఖాతాలో ఒక్క రూపాయి వేశారు.. కొందరికి పది బస్తాల సిమెంట్‌ ఇచ్చారు.. వాళ్లు ఇళ్లు కట్టుకోలేదు.. ఇప్పుడు మంజూరు చేద్దామంటే ఇప్పటికే వారి పేరిట ఇళ్లున్నట్లు చూపుతోంది. ఈ సమస్యను పరిష్కరించాలని గొలుగొండ, దేవరాపల్లి జడ్పీటీసీ సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

* ఉపాధిహామీ పథకంలో అక్రమాలు జరిగినట్లు తేలినా బాధ్యులైన వీఆర్పీలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని బుచ్చెయ్యపేట, కోటవురట్ల జడ్పీటీసీ సభ్యులు ప్రశ్నించారు.

* పాఠశాలలను సందర్శించడానికి వెళితే ఉపాధ్యాయులు తమను ఆవరణలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఏజెన్సీకి చెందిన సభ్యులు ఆరోపించారు. దీనిపై మంత్రి అమర్‌ విద్యాశాఖ అధికారులపై సీరియస్‌ అయ్యారు. ప్రజాప్రతినిధులను పాఠశాలల్లోకి ఎందుకు అనుమతించడం లేదని.. మరోసారి ఈలాంటి ఫిర్యాదు వస్తే ముందుగా డీఈవోపైనే చర్య తీసుకుంటామని హెచ్చరించారు.

* పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో జరిగిన పనుల్లో వాస్తవ వివరాలనే చెప్పాలని అంకెలు చెబితే ఎలా..? ఒకసారి క్షేత్రస్థాయి పనులు వివరాలు ఎలా ఉన్నాయో పరిశీలించాలని ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అధికారులకు సూంచించారు.

* జీఎస్టీ నిబంధనతో జిల్లా పరిషత్తు నిధుల నుంచి మంజూరు చేసిన పనులు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని.. దీంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయని అనకాపల్లి ఎంపీపీ గొర్లె సూరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని టెండర్‌లోకి తీసుకువచ్చిన పనుల్లో కదలిక వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

* గతంలో మంజూరు చేసిన మినీ గోకులాలకు సంబంధించి బిల్లులు చెల్లింపుల్లో  పశుసంవర్థక శాఖ, డ్వామా అధికారుల తీరు బాగోలేదని భీమిలి జడ్పీటీసీ సభ్యుడు గాడు వెంకటప్పడు ఆరోపించారు. ఆ రెండు శాఖల సమన్వయ లోపం కారణంగా రైతులు ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. దీనిపై ఇరుశాఖల అధికారులతో మాట్లాడి బిల్లులు చెల్లించేలా చూస్తానిని అనకాపల్లి  కలెక్టర్‌ హామీ ఇచ్చారు.

* కేజీహెచ్‌లో ఎస్టీ సెల్‌ సిబ్బంది పనితీరు బాగోలేదని, గిరిజనులు చనిపోతే  వారిని మహాప్రస్థానంలోకి పంపించడానికి ఇబ్బందులు పెడుతున్నారని ఏజెన్సీకి చెందిన పలువురు సభ్యులు ఆరోపించారు.

* ఏజెన్సీలో ఇళ్ల నిర్మాణంలో ఉన్న అడ్డంకులను తొలగించాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి జిల్లా అధికారులను కోరారు. తెదేపా హయాంలో కొందరికి ఇళ్లు ఇచ్చి బిల్లులు ఇవ్వకపోవడంతో వేల ఇళ్లు అసంపూర్తిగా ఉండిపోయాయని, వాటిని పూర్తి చేయిస్తే బాగుంటుందని హుకుంపేట జడ్పీటీసీ సభ్యుడు మత్స్యలింగం చెప్పారు. పాత ఇళ్లకు సుమారు రూ.9 కోట్లు చెల్లించాల్సి ఉందని ఆ ప్రతిపాదన ప్రభుత్వం దృష్టిలో ఉన్నట్లు హౌసింగ్‌ అధికారులు తెలిపారు.

* అనంతగిరి మండలంలో రహదారి పనులు చేయకపోయినా చేసినట్లు చూపించి సుమారు రూ.8 కోట్లు స్వాహాకు పాల్పడ్డారని, ఆ సొమ్ములు రికవరీ చేశారా లేదా?.. బాధ్యులపై చర్యలేవంటూ అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీసరి గంగరాజు అధికారులను ప్రశ్నించారు. దీనిపై విచారణ జరిపిస్తామని వారు హామీ ఇచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని