logo

సమన్వయ లోపం.. సంకేత సంకటం

వందేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రక్ష పథకంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ- రీ సర్వే అల్లూరి జిల్లాలో మందకొడిగా సాగుతోంది.

Published : 29 Nov 2022 01:18 IST

జిల్లాలో సాగని రీ సర్వే
పాడేరు, చింతపల్లి,  న్యూస్‌టుడే

డి.గొందూరు పంచాయతీలో డీజీపీఎస్‌ సర్వే చేస్తున్న బృందం

వందేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రక్ష పథకంలో భాగంగా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ- రీ సర్వే అల్లూరి జిల్లాలో మందకొడిగా సాగుతోంది. మొదట్లో చింతపల్లి, రంపచోడవరం మండల పరిధిలో రెండు గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా చేపట్టారు. అది విజయవంతం కావడంతో 2600 గ్రామాల్లో సర్వే చేయాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా రెవెన్యూ సిబ్బందికి, సర్వే బృందాలకు మధ్య సమన్వయ లోపం, గిరిజన ప్రాంతంలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో సర్వే నత్తనడకన సాగుతోంది.

సర్వే ప్రక్రియను క్రోడీకరిస్తున్న సిబ్బంది

అడ్డంకులెన్నో..

జిల్లావ్యాప్తంగా షెడ్యూల్డు ప్రాంతం కావడం ఆపై కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడంతో పాటు మారుతున్న వాతావరణ పరిస్థితులు భూ- రీ సర్వేకు అడ్డంకులను కలిగిస్తున్నాయి. సర్వేలో కచ్చితత్వం కోసం అధునాతన ఉపగ్రహ డిఫరెన్షియల్‌ గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (డీజీపీఎస్‌)ను వినియోగిస్తున్నారు. ఇక్కడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా సర్వేకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఉదయం 10 గంటల వరకు మంచు వీడకపోవడం, అప్పుడప్పుడూ వర్షం కురుస్తుండటంతో పరికరాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక్కో రోజు అంతర్జాల సమస్యలు ఎదురవుతున్నాయి. జిల్లాలో 60 శాతానికి పైగా గ్రామాల్లో శాటిలైట్‌ సంకేతాలకు ప్రతికూలంగానే ఉన్నాయి. కొన్నిచోట్ల రెవెన్యూ సిబ్బంది, సర్వే చేపడుతున్న ఏజెన్సీల మధ్య సమన్వయ లోపం ప్రభావం సర్వేపై పడుతోంది.

బాలాజీపేట రైతుకు భూపట్టా అందిస్తున్న తహసీల్దార్‌


సమగ్ర సర్వే నివేదికలో పరిశీలించేవి..

* అడంగల్‌, భూపట్టాల మధ్య ఉన్న వ్యత్యాసం సరిచేయడం

* దీర్ఘకాలికంగా భూమి అనుభవిస్తున్న వారి పేరున ప్రస్తుతం పట్టా ఉందా, లేదో పరిశీలించడం 

* పట్టాదారుడి వద్ద భూ రికార్డుల్లో   ఉన్న సరిహద్దులు సక్రమంగా ఉన్నాయా లేదో చూసి నిర్ణయించడం

* ప్రభుత్వ, ప్రైవేటు భూముల గుర్తింపు తదితర విషయాలు


గ్రామ సభల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాల్సి ఉంది. సర్వేపై ముందస్తు సమాచారం లేకపోవడంతో కొన్నిచోట్ల వారి వ్యవసాయ పనులకు వెళ్లిపోతున్నారు. సర్వేపై అవగాహన లేక ప్రజలు సైతం ఉత్సాహంగా ముందుకు రావడం లేదు.


చింతపల్లి మండలం బాలాజీపేట వద్ద గతంలో పనిచేసిన సబ్‌ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు హయాంలో ప్రయోగాత్మకంగా డ్రోన్లద్వారా భూ-సర్వే చేపట్టారు. ఓ పది మందికి పట్టాలు తయారు చేశారు. పట్టా పుస్తకాల్లో తప్పులు దొర్లడంతో సరిదిద్దేందుకు రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ మండలంలో ప్రస్తుతం ఆరు గ్రామాల్లో సర్వే చేసినట్లు చెబుతున్నారు.

జిల్లా విస్తీర్ణం     12,253 చ.కి.మీ.
తొలి దశ సర్వేలో  2600 గ్రామాలు

జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 గ్రామాల్లో సర్వే పూర్తయినట్లు కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ ఇటీవల ప్రకటించారు. పాడేరు, రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లు ఉండగా ముంపు గ్రామాలను మినహాయించారు.
ప్రజల సహకారంతో ముందుకెళ్తున్నాం : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం ఐదు బృందాల ద్వారా భూ సర్వే సమర్థంగా నిర్వహిస్తున్నాం. ప్రయోగాత్మకంగా సర్వే చేసిన రెండు గ్రామాల్లో త్వరలో 13బి పట్టాలు అందిస్తాం. డ్రోన్‌ పైలట్‌, డెస్టినేషన్‌ సర్వే వంటి విధానాలతో కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. షెడ్యూల్డు ప్రాంతంలో మంచు త్వరగా వీడకపోవడంతో పాటు కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ప్రజల సహకారం మాకు మెండుగా ఉంది. అడ్డంకులను దాటుకుంటూ ముందుకెళ్తున్నాం.

వై.మోహన్‌రావు, అదనపు సంచాలకులు, భూ-సర్వే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని