logo

పచ్చకామెర్లతో ఇంటర్‌ విద్యార్థిని మృతి

పచ్చకామెర్లతో బాధపడుతున్న ఇంటర్‌ విద్యార్థిని సోమవారం ఉదయం పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

Published : 29 Nov 2022 01:18 IST

హారిక

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పచ్చకామెర్లతో బాధపడుతున్న ఇంటర్‌ విద్యార్థిని సోమవారం ఉదయం పాడేరు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పాడేరు బాలికల గురుకుల జూనియర్‌ కళాశాలలో ఏఎన్‌టీ ఒకేషనల్‌ కోర్సు ప్రథమ సంవత్సరం చదువుతున్న కంకిపాటి హారిక (16) ఈ నెల 21వ తేదీ నుంచి అనారోగ్యంతో బాధపడింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కళాశాలకు వచ్చి తమ కుమార్తెకు సెలవు మంజూరు చేయాలని సిబ్బందిని కోరారు. తామే విద్యార్థినికి పూర్తి వైద్య సేవలు అందిస్తామని, ఇంటికి పంపించమని చెప్పడంతో వారు వెనుదిరిగారు. విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తల్లిదండ్రులు వేడుకుంటే ఈ నెల 25వ తేదీన సెలవు ఇచ్చారు. తల్లిదండ్రులు బాలికను పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరీక్షించి పచ్చకామెర్లు ఉన్నట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ క్రమంలో ఆసుపత్రిలో వైద్యం పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.  విషయం తెలుసుకున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభుదాస్‌ మాట్లాడుతూ కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే విద్యార్థిని మృతి చెందిందని ఆరోపించారు. 21వ తేదీ నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థినికి ఆసుపత్రికి తీసుకెళ్లకపోవడం దారుణమన్నారు.బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.


విద్యుత్తు తీగలు తగిలి గిరిజనుడి మృతి

వై.రామవరం, న్యూస్‌టుడే: అటవీ ప్రాంతంలో విద్యుత్తు తీగలు తాకి ఒకరు దుర్మరణం పాలవగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వై.రామవరం మండలం బుల్లోజిపాలెం అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడేందుకు గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్తు తీగలను అమర్చారు. సింహాద్రిపాలెం గ్రామానికి చెందిన వేట్ల శ్రీరాములురెడ్డి (50), వేట్ల సంకురురెడ్డి సోమవారం పనుల నిమిత్తం అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఈ విద్యుత్తు తీగలను వీరు తాకడంతో శ్రీరాములురెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. సంకురురెడ్డి తీవ్రగాయాలపాలయ్యారు. సీఐ రాంబాబు, తహసీల్దారు సుధాకర్‌, అదనపు ఎస్సై రాంబాబు సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. విద్యుత్తు తీగలను అమర్చిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని