logo

స్పందనకు 70 వినతులు

స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు.

Published : 29 Nov 2022 01:18 IST

పీవో గనోరేకు వినతిపత్రం అందజేసి మాట్లాడుతున్నఅటవీ అధికారులు

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్పందన కార్యక్రమంలో వచ్చిన వినతులన్నింటినీ పరిష్కరించాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఏపీవో జనరల్‌ శ్రీనివాసరావుతో కలసి ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై 70 మంది వినతులు అందజేశారు. మారేడుమిల్లి మండలంలోని బంద నుంచి కానివాడకు వెళ్లే రహదారి పూర్తిగా శిథిలమైందని, ఈ రోడ్డును పునర్నిర్మించాలని సర్పంచి పల్లాల శిల్పారాణి ఆధ్వర్యంలో గిరిజనులు వినతిపత్రం అందజేశారు. రంపచోడవరం మండలం ఆకూరు పంచాయతీ కింటుకూరు గ్రామంలో పది పశువులను పెద్దపులి చంపేసిందని, నష్టపరిహారం చెల్లించాలని సర్పంచి కత్తుల వరలక్ష్మి, ఎంపీటీసీ సభ్యుడు నర్రి పాపారావు కోరారు. పోలవరం పరిహారం చెల్లించి న్యాయం చేయాలని దేవీపట్నం మండలం సీతారం గ్రామస్థులు వినతిపత్రం అందించారు. ఈఈలు నాగేశ్వరరావు, డేవిడ్‌రాజు, ఎస్‌డీసీ వెంకటేశ్వరరావు, డీఎల్‌డీవో కోటేశ్వరరావు, సీడీపీవో సంధ్యారాణి, ఎంపీడీవో కుమార్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

రేంజి అధికారి హత్య దారుణం

తెలంగాణ రాష్ట్రం చండ్రుగొండ అటవీ క్షేత్రాధికారి (రేంజర్‌) శ్రీనివాసరావును హత్య చేయడం దారుణమని ఆంధ్రప్రదేశ్‌ ఫారెస్టు రేంజి అధికారుల అసోసియేషన్‌ రాజమహేంద్రవరం శాఖ ప్రధాన కార్యదర్శి ఎ.సునీల్‌కుమార్‌ పేర్కొన్నారు. రేంజి అధికారి హత్యను నిరసిస్తూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, కాకినాడ, రాజమహేంద్రవరం అటవీ డివిజన్ల ఉద్యోగులు సోమవారం రంపచోడవరంలో ర్యాలీ చేపట్టారు. సబ్‌ డీఎఫ్‌వో భరణి దీన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీడీఏ పీవో సూరజ్‌ గనోరే, సబ్‌ కలెక్టర్‌ శుభం బన్సల్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సునీల్‌కుమార్‌ మాట్లాడుతూ అటవీ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు. ఆయుధాలను సమకూర్చినట్లయితే క్షేత్రస్థాయిలో దైర్యంగా విధులు నిర్వహించగలుగుతామన్నారు. అంతకుముందు శ్రీనివాసరావు మృతికి నివాళి అర్పించారు. ఏపీ జూనియర్‌ ఫారెస్టు అధికారుల అసోసియేషన్‌ అధ్యక్షులు శ్యామ్‌కుమార్‌, శేఖర్‌బాబు, రేంజర్లు కరుణాకర్‌, దుర్గాకుమార్‌బాబు, అబ్బాయిదొర, ప్రసాద్‌, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని