logo

సేవల్లో వెనుకబాటు.. స్పందనలో తడబాటు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని పథకాలు, సేవల్లో పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను కేటాయించారు.

Updated : 01 Dec 2022 07:03 IST

జిల్లాల వారీగా ప్రకటించిన ర్యాంకులు ఇలా..
అల్లూరి 2, అనకాపల్లి 16, విశాఖ 21     
- ఈనాడు  డిజిటల్‌,  పాడేరు, న్యూస్‌టుడే, పాడేరు

స్పందనలో ఫిర్యాదులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న కొన్ని పథకాలు, సేవల్లో పనితీరు ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను కేటాయించారు. గత ఆరునెలల్లో సచివాలయ సేవలు, స్పందన, గృహనిర్మాణం, భూ సమగ్ర సర్వేలో పురోగతిని కొలమానంగా చేసుకుని ఈ ర్యాంకులను వెల్లడించారు. జూన్‌ నుంచి నవంబర్‌ చివరి వారం వరకు సాధించిన ఫలితాల ఆధారంగా విభాగాల వారీగా పాయింట్లు కేటాయించారు. వాటన్నింటి సరాసరిలో తక్కువ పాయింట్లు సాధించిన జిల్లాలను మెరుగైన ప్రతిభ కనబర్చినట్లు, ఎక్కువ పాయింట్లు వస్తే వెనుకబడినట్లు ప్రకటించారు. ఈ లెక్కన ఉమ్మడి జిల్లా మిశ్రమ ర్యాంకులను సాధించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా 14.31 పాయింట్లతో రాష్ట్రస్థాయిలో రెండోస్థానంలో మెరిసింది.. అనకాపల్లి జిల్లా 30.95 పాయింట్లతో తడబడి 16వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక విశాఖ జిల్లా 41.60 పాయింట్లతో 21వ స్థానంతో వెనుకబడింది. జిల్లా అధికారులు మరింత మెరుగ్గా పనిచేయాల్సిన అవసరముందని ఈ ర్యాంకులు చెబుతున్నాయి.

వినతులకు పరిష్కారం

స్పందన కార్యక్రమంలో ఇచ్చే వినతుల పరిష్కారంపై అర్జీదారులు సంతృప్తి చెందకుంటే వాటిని పునఃపరిశీలిస్తారు. ఈ విషయంలో అల్లూరి జిల్లా 3.33 పాయింట్లతో ఉన్నతాధికారులను మెప్పించింది. సోమవారం రంపచోడవరం ఐటీడీఏ కేంద్రంలో, శుక్రవారం జిల్లా కేంద్రం పాడేరులో స్పందన కార్యక్రమాలను కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చేపడుతున్నారు. అందిన వినతులకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నారు. చాలావరకు సమస్యలను ఐటీడీఏ పీఓ స్థాయిలో పరిష్కరించడంతో ఇక్కడకు వచ్చే ఫిర్యాదులు తక్కువగానే ఉంటున్నాయి. వాటిని పనఃపరిశీలన చేసే అవకాశం ఉండడం లేదు. అందువల్లే రాష్ట్రస్థాయిలో రెండో స్థానంలో నిలవగలిగింది.


మెప్పించని సిబ్బంది పనితీరు..

* సచివాలయ సేవలకు గాను అల్లూరి జిల్లాకు 24.83 పాయింట్లు దక్కాయి. ఈ జిల్లాలో 352 సచివాలయాలున్నాయి. వీటి ద్వారా అందించాల్సిన సేవలు సంతృప్తికరంగా లేవు. సిగ్నల్స్‌ సమస్యలు, సిబ్బంది గైర్హాజరు వంటి కారణాలతో మెప్పించలేకపోయారు. ఈ జిల్లాలో గృహనిర్మాణం, సమగ్ర సర్వే విషయాలను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అల్లూరి జిల్లాకు ర్యాంకింగ్‌లో కలిసివచ్చింది.

* అనకాపల్లి జిల్లాకు సచివాలయ సేవల విషయంలో 16 పాయింట్లు దక్కాయి. ఈ జిల్లాలో 465 గ్రామ, 57 వార్డు సచివాలయాలున్నాయి. వీటిని కలెక్టర్‌ రవి పట్టన్‌శెట్టి ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పనితీరు బాగోలేని సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. సచివాలయాల్లో పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులోకి రాకపోవడం, సిబ్బంది కార్యాలయంలో ఉండకపోవడంపై కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది.

* విశాఖ జిల్లాకు సచివాలయ సేవల విషయంలో 15 పాయింట్లు లభించాయి. జిల్లాలో 578 వార్డు, 54 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. కలెక్టర్‌ మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌ తరచూ వార్డు సచివాలయాలను పరిశీలిస్తూ సిబ్బంది పనితీరు మెరుగుపడేలా చర్యలు తీసుకుంటున్నారు. అయినా కొన్నిరకాల సేవలకు కాళ్లరిగేలా తిప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.


సమగ్ర భూసర్వే గందరగోళం..

భూ వివాదాలకు తావులేకుండా చేయాలనే ఉద్దేశంతో కొన్ని నెలలుగా భూములు రీసర్వే చేపడుతున్నారు. ఇందులో అనకాపల్లి 39 పాయింట్లు, విశాఖపట్నం 36 పాయింట్లు దక్కించుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో 737 గ్రామాలకు 427 చోట్ల డ్రోన్లు ఎగరవేశారు. 121 గ్రామాలకు 13 చోట్ల నోటిఫికేషన్‌ జారీచేశారు. విశాఖ జిల్లాలో 79 పంచాయతీల్లో 110 రెవెన్యూ గ్రామాల్లో డ్రోన్‌ సర్వే చేయాల్సి ఉంది. ప్రస్తుతం 30 శాతం గ్రామాలకే ఈ సర్వే పరిమితం అయింది.


లక్ష్యం చేరని గృహ నిర్మాణం..

ఏ లేఅవుట్‌ చూసినా అసంపూర్తి నిర్మాణాలే

బీ పేదలందరికీ ఇళ్లు పథకం అమలులో అనకాపల్లి జిల్లా 74 పాయింట్లతో ఫర్వాలేదనిపిస్తే, విశాఖ జిల్లా 125 పాయింట్లతో వెనకబడిపోయింది. అనకాపల్లి జిల్లాకు 44,133 ఇళ్లు మంజూరు చేశారు. వీటిని వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తిచేయాలని లక్ష్యం నిర్దేశించారు. పురోగతి చూస్తే మరో ఏడాది దాటినా ఇళ్లు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అక్టోబర్‌ మొదటి వారం నాటికి కేవలం 5,439 ఇళ్లు మాత్రమే పూర్తిచేశారు.


* విశాఖ జిల్లాకు మొదటి విడతగా 14,937 ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 13,530 ఇళ్ల పనులు మొదలుపెట్టారు. ఈ దశలో పురోగతి పరిశీలిస్తే రాష్ట్రంలో ఒకటి రెండు స్థానాల్లో  నిలిచేది. రెండో విడతగా మరో లక్ష ఇళ్లు మంజూరు చేశారు. వీటిలో 46 శాతం మొదలుపెట్టినట్లు చూపించారు. మొత్తంగా 1.14 లక్షల ఇళ్ల పురోగతిని మిగతా జిల్లాలతో సమానంగా చూడడం వల్లే ఈ ర్యాంకింగ్‌లో వెనుకబడినట్లు చూపిస్తోందని కలెక్టర్‌ మల్లికార్జున చెప్పారు. ఈ సాంకేతిక సమస్యలను ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టినట్లు తెలిపారు.


* వినతుల పునఃపరిశీలనలో అనకాపల్లి జిల్లా 13.67 పాయింట్లు, విశాఖపట్నం జిల్లా 12.50 పాయింట్లతో కాస్త ఫర్వాలేదనిపించాయి. వచ్చిన అర్జీలను ఆయాశాఖలకు పంపిస్తుంటారు. కొన్ని తప్పుగా పంపించడం, ఫొటోలు అప్‌లోడ్‌ చేయడంలో పొరపాట్ల కారణంగా కొన్ని సమస్యలు పరిష్కారంలో జాప్యం జరుగుతోంది.

* ఈ విషయంలో అనకాపల్లి 12.25 పాయింట్లు, విశాఖ జిల్లాకు 19.50 పాయింట్లు వచ్చాయి. దీంతో ఈ రెండు జిల్లాల అల్లూరితో పోల్చితే బాగా వెనకబడినట్లు కనిపిస్తున్నాయి.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు