logo

కార్యాలయం సరే.. కార్యకలాపాలేవి?

చింతూరు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసింది. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోనే ఆర్డీవో కార్యాలయాన్ని సైతం ఏర్పాటుచేశారు.

Published : 01 Dec 2022 03:17 IST

నేటి వరకు సిబ్బంది నియామకమే లేదు

నిర్మాణ దశలో చింతూరు ఆర్డీవో కార్యాలయం

చింతూరు, న్యూస్‌టుడే: చింతూరు కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసింది. స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోనే ఆర్డీవో కార్యాలయాన్ని సైతం ఏర్పాటుచేశారు. నేటికీ సిబ్బందిని నియమించకపోవడంతో కార్యకలాపాలు సాగడం లేదు. సెప్టెంబరులో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడంతోపాటు సబ్‌ కలెక్టర్‌గా ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ను నియమించింది. రెండు నెలలైనా సరిపడా సిబ్బంది, వసతులు లేకపోవడంతో విలీన మండలాల ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండటం లేదు.

రాష్ట్ర విభజన తరువాత ఖమ్మం జిల్లాలోని చింతూరు, కూనవరం, వరరామచంద్రాపురం, ఎటపాక మండలాలను తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేశారు. విలీన మండలాల్లో రెవెన్యూ సేవలు అందించేందుకు అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఎటపాక కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌, చింతూరు కేంద్రంగా ఐటీడీఏలను ఏర్పాటు చేసింది. దీంతో ఈ మండలాల ప్రజలు రంపచోడవరం వెళ్లకుండా ఇక్కడే భూసమస్యల పరిష్కారం, ఇతర సేవలు పొందారు. వైకాపా ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో చేపట్టిన జిల్లాల పునర్విభజనలో రంపచోడవరం నియోజకవర్గాన్ని పాడేరు కేంద్రంగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చేర్చింది. ఇదే క్రమంలో ఎటపాక కేంద్రంగా ఉన్న రెవెన్యూ డివిజన్‌ను రద్దు చేసింది. జులై, ఆగస్టు నెలల్లో గోదావరి, శబరి నదులకు సంభవించిన వరదల్లో విలీన మండలాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విలీన మండలాల్లో పర్యటించిన సందర్భంగా చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ ఏడాది సెప్టెంబరులో చింతూరు కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్‌ అధికారి ఫర్మాన్‌ అహ్మద్‌ఖాన్‌ను సబ్‌ కలెక్టరుగా నియమించింది. కార్యాలయాల నిర్వహణకు సిబ్బందిని నియమించకపోడంతో ఇంకా కార్యకలాపాలు జరగడం లేదు. చింతూరులో రెవెన్యూ కార్యాలయానికి నిర్మిస్తున్న భవన నిర్మాణం అసంపూర్తిగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు