logo

నిర్లక్ష్యం వద్దు.. జాగ్రత్తే ముద్దు

మూడు దశాబ్దాల కాలంగా చాపకింద నీరులా విస్తరిస్తూ, ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతున్న ఎయిడ్స్‌పై ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలనుకున్న మానవాళికి అనుకున్న స్థాయిలో  సాధ్యం కావడంలేదు.

Published : 01 Dec 2022 03:17 IST

నేడు ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం

ఎయిడ్స్‌ నియంత్రణపై అవగాహన ర్యాలీ

నక్కపల్లి, న్యూస్‌టుడే: మూడు దశాబ్దాల కాలంగా చాపకింద నీరులా విస్తరిస్తూ, ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతున్న ఎయిడ్స్‌పై ఎప్పటికప్పుడు పైచేయి సాధించాలనుకున్న మానవాళికి అనుకున్న స్థాయిలో  సాధ్యం కావడంలేదు. లైంగిక సంబంధాల  విషయంలో పెడదారి పడుతుండటంతో చిన్నా, పెద్దా అనే తేడాలేకుండా ఈ మహమ్మారికి చిక్కుతున్నారు.   డిసెంబరు 1న ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్భంగా ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.

అక్రమ/అసహజ లైంగిక కలయికలు, వ్యాధి సోకిన వారి రక్తం దురదృష్టవశాత్తు మరొకరికి ఎక్కించడం వంటి కారణాలతో ఎయిడ్స్‌ వస్తుంది. దీనిపై ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు జనాల్లో మార్పుకోసం కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో అనేక కార్యక్రమాలనూ చేపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 190 దేశాలు ఈ వ్యాధిపై సామూహికంగా పోరు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో మన వద్ద తీసుకువచ్చిన మార్పులు, అమలు చేస్తున్న కార్యక్రమాల ద్వారా కాస్తో, కూస్తో సత్ఫలితాలు వస్తున్నాయి. గతంలో గర్భిణికి వ్యాధి ఉంటే.. పుట్టే బిడ్డా దీనిబారిన పడేది. ప్రస్తుతం వ్యాధి ఉన్నట్లు ఆదిలోనే గుర్తిస్తే డీఎల్‌టీ మందుల వాడకం ద్వారా శిశువును రక్షించగలుగుతున్నారు. సామాజిక ఆరోగ్య కేంద్రాలతో పాటు, ప్రాంతీయ, జిల్లా ఆసుపత్రుల్లో ఐసీటీసీ రక్త పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వ్యాధి సోకినవారికి అవసరమైన మందులు ఉచితంగా అందిస్తున్నారు. అదేవిధంగా వీరికి ప్రభుత్వం పింఛన్‌ సదుపాయం కల్పించింది. దీనికి తోడు స్వచ్ఛంద సంస్థల సహకారంతో గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలతోపాటు సంచార రక్తపరీక్షల కేంద్రాన్ని పల్లెల్లోకి తీసుకెళ్లి పరీక్షలు చేస్తున్నారు. ఈ ఏడాది సమానత్వం ద్వారా అసమానతలను అంతం చేయడానికి ఏమవుదాం అనే నినాదాన్ని ప్రచారం చేశారు.

గ్రామాల్లో మొబైల్‌ రక్తపరీక్ష కేంద్రం ద్వారా తనిఖీలు

ఆశాజనకంగా కేసుల తగ్గుదల

ఏటేటా చేపడుతున్న చర్యల కారణంగా కేసుల తగ్గుదల ఆశాజనకంగా ఉండటం జిల్లా అధికార యంత్రాంగానికి ఊరటనిస్తోంది. గతేడాది జిల్లాలో 30,235 మంది సాధారణ వ్యక్తులకు పరీక్షలు చేస్తే 418, ఈ ఏడాది అక్టోబరు 22 నాటికి 25,833 మందికి పరీక్ష చేస్తే, 254 ఎయిడ్స్‌ కేసులు నమోదయ్యాయి. తద్వారా 1.38 శాతం నుంచి 0.98శాతం దిగువకు కేసులు వచ్చాయి. అదేవిధంగా గతేడాది 24,760 మంది గర్భిణులను  పరీక్షించగా 31, ఈ ఏడాది 17,963కి    పరీక్ష చేస్తే కేవలం 12 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

* ఉమ్మడి విశాఖ జిల్లాలో గడిచిన అయిదేళ్లలో గర్భిణుల్లో 1 శాతం వ్యాధిగ్రస్థులున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

* అయిదేళ్ల కాలంలో సాధారణ వ్యక్తుల్లో ఇది 2.2 శాతం నుంచి 1.01 శాతానికి వచ్చింది.

* అదే విధంగా రాష్ట్రంలో మన జిల్లా గతేడాదిలానే ఆరో స్థానంలో ఉంది.


వారిపై వివక్ష చూపొద్దు
- డాక్టర్‌ ఎ.హేమంత్‌, డీఎంహెచ్‌ఓ

ఎయిడ్స్‌పై బిడియం వదిలి అంతా బహిరంగంగా చర్చించాల్సిన అవసరం ఉంది. అనుమానం ఉన్నవారు పరీక్ష చేయించుకోవాలి. వ్యాధి సోకిన వారికి మందులు, కౌన్సెలింగ్‌ ద్వారా జీవిత కాలం పెంచేలా చూస్తున్నాం. యువతలో దీనిపై చైతన్యం పెంపొందించేలా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. వ్యాధి సోకిన తర్వాత విచారించడంకంటే దీని బారినపడకుండా చూసుకోవడం మేలు. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఏ ఇబ్బందీ ఉండదు. వ్యాధి సోకిన వారిపట్ల వివక్ష చూపొద్దు. ఈ ఏడాది నినాదం ఇదే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని