logo

వైద్యారోగ్యశాఖలో అనిశా తనిఖీల కలకలం

విశాఖలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ శాఖలో జరిగిన పలు అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలోని ఓ బృందం విచారణ మొదలుపెట్టింది.

Published : 01 Dec 2022 03:17 IST

30 మంది అధికారులపై విచారణ
నిధుల దుర్వినియోగం.. నియామకాల్లో అక్రమాలపై నిశిత పరిశీలన
ఈనాడు డిజిటల్‌, విశాఖపట్నం, సీతంపేట, న్యూస్‌టుడే

డీఎంహెచ్‌వో కార్యాలయంలో పరిపాలనాధికారి గదిలో దస్త్రాలు పరిశీలించి వివరాలు సేకరిస్తున్న అనిశా సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌

విశాఖలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ శాఖలో జరిగిన పలు అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ సురేష్‌ ఆధ్వర్యంలోని ఓ బృందం విచారణ మొదలుపెట్టింది. నిధుల దుర్వినియోగం, నకిలీ ఉత్తర్వుల జారీ, నియామకాల్లో వసూళ్ల పర్వం, నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగ్‌లు ఇవ్వడం వంటి పలు అంశాలకు సంబంధించి రికార్డులను పరిశీలించారు. డీఎంహెచ్‌వో డా.విజయలక్ష్మి సెలవులో ఉండడంతో పరిపాలనాధికారి (ఏవో) సుమతి గదిలో కూర్చొని సిబ్బందిలో ఒక్కొక్కరినీ పిలిచి విచారిస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు గతంలో ఇక్కడ పనిచేసిన బదిలీపై ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఉద్యోగ విరమణ పొందిన అధికారులు వెరసి 30 మందిపై ఫిర్యాదులు అందాయని సీఐ రామకృష్ణ చెప్పారు. వారందరినీ విచారించాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారం ఒక్కరోజుతో అయిపోయేది కాదని, కొన్ని రోజుల పాటు కొనసాగుతుందన్నారు. తొలిరోజు కొద్దిమందినే విచారించారు. డీఎంహెచ్‌వోతో పాటు ముఖ్యమైన అధికారులు, సిబ్బంది సెలవులో ఉండడంతో అందుబాటులో ఉన్న కొంతమందిని విచారించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. అనిశా తనిఖీలతో సంబంధిత అధికారుల్లో కలవరం మొదలైంది. ప్రాంతీయ శిక్షణ కేంద్రం (పురుషులు)లో శిక్షణలు పేరిట నిధుల దుర్వినియోగం చేసినట్లు ఒకరు అనిశాతో పాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. డీఎంహెచ్‌వో స్టోర్స్‌లో ఏకరూప దుస్తులను గతంలో సిబ్బందికి ఇవ్వకుండా బయటకు అమ్మేసుకున్నారని, పదోన్నతులు, పోస్టింగుల్లోను భారీగా సొమ్ములు వసూళ్లు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిసింది. వాటన్నింటిపైనా ఒకేసారి విచారణ చేపట్టడంతో ఎక్కువ మందిని ప్రశ్నించాల్సి వస్తోంది.

కొలువులు భర్తీలో కాసుల వేట..

డీఎంహెచ్‌వో కార్యాలయంలో కొంతమంది అధికారులపై గత కొన్నాళ్లుగా తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరిపై పోలీసులకు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. గతేడాది కొవిడ్‌ నుంచి వైద్యులు, స్టాఫ్‌నర్స్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, ఫార్మసిస్ట్‌, లాస్ట్‌గ్రేడ్‌ సర్వీసులు వంటి పోస్టులను భర్తీచేసుకుంటూ వస్తున్నారు. ఈ నియామకాల్లో నిరుద్యోగుల నంచి భారీగా సొమ్ములు వసూళ్లు చేశారనే ఆరోపణలున్నాయి. అధికారులే దళారులను పెట్టుకుని డబ్బులు దండుకుని పోస్టింగ్‌లు ఇచ్చినట్లు ఫిర్యాదు వచ్చాయి. మెరిట్‌ లిస్ట్‌లో ఉన్నవారికి ఫోన్‌ చేసి మీకు ఉద్యోగం వచ్చేలా చూస్తాం, రూ.లక్ష వరకు ఖర్చవుతుందని బేరాలు పెట్టుకున్నారు. కొన్ని వాయిస్‌ రికార్డులు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో శాఖాపరమైన విచారణలు చేపడుతున్నారు. ఒకరైతే సొమ్ములు తీసుకుని నకిలీ నియామక ఉత్తర్వులను చేతిలో పెట్టారు. దీనిపై బాధితులు పాడేరు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇవే కాకుండా పదోన్నతులు, బదిలీల్లో నిబంధనలు పాటించలేదని ఫిర్యాదులున్నాయి. కారుణ్య నియామకంలో ఒకరి బదులు వేరొకరికి పోస్టింగ్‌ ఇచ్చిన ఘటనపై విచారణకు ఆదేశించినా కొందరు ఒత్తిడి తెచ్చి విచారణలు నిలిపేసిన సందర్బం ఉంది. ఇలా ఏపనిలోనైనా ముడుపులు తప్పనిసరి కావడంతోనే వ్యవహారం అనిశా తనిఖీల వరకు వెళ్లినట్లు ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.


Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు