మొక్కల పేరిట మెక్కుడు!
అతివల ఆదాయం పెంచడంతోపాటు పేదల జీవనోపాధులు మెరుగుపరచడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా చేపట్టిన మొక్కలు, ఉద్యానాల పెంపకం అవినీతిమయంగా మారిపోయింది.
అవెన్యూ, ఉద్యానాల పెంపకంలో అక్రమాలు
రూ. 2.38 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం
ఈనాడు డిజిటల్, పాడేరు
అతివల ఆదాయం పెంచడంతోపాటు పేదల జీవనోపాధులు మెరుగుపరచడానికి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) ద్వారా చేపట్టిన మొక్కలు, ఉద్యానాల పెంపకం అవినీతిమయంగా మారిపోయింది. వెలుగు/వైకేపీలో కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినా బాధ్యులపై పూర్తిస్థాయి చర్యలు తీసుకోలేదు.
ఉమ్మడి జిల్లాలో 10 నుంచి 14 విడతల వరకు జరిగిన సామాజిక తనిఖీల్లో ఉద్యానాలు, రహదారి పక్కన మొక్కల పెంపకాల్లో రూ. 2.38 కోట్ల మేర సొమ్ములు పక్కదారి పట్టినట్లు గుర్తించారు. ఈ మొత్తం ఇంకా బాధ్యుల నుంచి రికవరీ చేయలేదు. తాజాగా అనకాపల్లి జిల్లాలో రూ. 63 లక్షల రికవరీకి సంబంధించి 96 మందికి నోటీసులు సిద్ధం చేశారు.
ఉమ్మడి జిల్లాలో 6,874 ఎకరాల్లో డీఆర్‌డీఏ ద్వారా హార్టికల్చర్ పథకాన్ని అమలు చేశారు. సుమారు 2 వేల కిలోమీటర్ల మేర రహదారుల పక్కన (అవెన్యూ) మొక్కలు నాటారు. వీటి కోసం వేతనాలు, సామగ్రి రూపంలో సుమారు రూ. 22 కోట్ల వరకు ఖర్చుచేశారు. మొక్కల కొనుగోలు నుంచి పెంపకం వరకు కొన్నిచోట్ల వెలుగు సిబ్బంది అక్రమాలకు పాల్పడ్డారు. అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాల్లో ఇప్పటివరకు 14 విడతలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 12 విడతల సామాజిక తనిఖీలు పూర్తిచేశారు. అందులో డీఆర్‌డీఏ ద్వారా చేపట్టిన పనుల్లో రూ. 2,38,32,118 విలువైన పనులపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
20 మండలాల పరిధిలో..
అనకాపల్లి జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఈ అక్రమాలు జరిగాయి. కొన్ని మండలాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌ను ఒక ప్రైవేటు వ్యక్తికి అనధికారికంగా అప్పగించారు. దస్త్రాల్లో మాత్రం స్వయం సహాయక సంఘాలు వాటిని పెంచుతున్నట్లు చూపారు. సామాజిక తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి. అనకాపల్లి మండలంలో 12 మంది, అచ్యుతాపురంలో ఏడుగురు, మునగపాక, కశింకోట మండలాల్లో ఎనిమిది మంది చొప్పున బాధ్యులకు రికవరీ నోటీసులు జారీ అయ్యాయి. ఇందులో మునగపాకకు చెందిన ఒక ఏపీఎం నుంచి రూ. 4.11 లక్షలు, ఓ సీసీ రూ. 3.6 లక్షలు, ఏసీ రూ. 3.6 లక్షల చొప్పున అత్యధిక మొత్తాలు రికవరీ చెల్లించాల్సి ఉంది.
తనిఖీల్లో ఎక్కువ.. రికవరీల్లో తక్కువ
గ్రామైక్య సంఘం ప్రతినిధుల నుంచి క్లస్టర్ కోఆర్డినేటర్ (సీసీ), ఏపీఎంలు, ప్రాంతీయ సమన్వయకర్తలు ఇలా వందమందిని బాధ్యులుగా గుర్తించారు. తనిఖీల అనంతరం ఆధారాలు సమర్పించేందుకు వ్యక్తిగత విచారణలు చేపట్టారు. ఇక్కడే కొంతమంది ఉన్నతాధికారులను మచ్చిక చేసుకుని రూ. లక్షల్లో ఉన్న రికవరీ మొత్తాన్ని రూ. వేలల్లోకి తగ్గించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది తనిఖీల సమయంలో చూపించని ఆధారాలను వ్యక్తిగత విచారణలో చూపించి రికవరీల నుంచి పూర్తిగా మినహాయింపు పొందారు. దీంతోనే రూ. 1.61 కోట్ల అక్రమాలు కాస్తా చివరకు వచ్చేసరికి రూ. 68.73 లక్షలకు తగ్గిపోయాయి. ఇందులో రూ. 4.74 లక్షలు మాత్రమే రికవరీ చేశారు. మిగతా రూ. 63.98 లక్షలు ఈనెల 7 లోపు రికవరీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు బాధ్యులందరికీ నోటీసులు పంపిస్తున్నారు. అందులోనే తాము చెల్లించాల్సిన బ్యాంకు ఖాతా సంఖ్య పేర్కొని ఆన్‌లైన్, నెఫ్ట్ ద్వారా చెల్లించి రసీదులు చూపించాలని ఆదేశించారు. విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల అధికారులు ఈ మాత్రం చొరవా తీసుకోలేదు.
రాంబిల్లి మండలం గజిరెడ్డిపాలెం రహదారి పొడవునా తుప్పలే..
అనకాపల్లి జిల్లాలో 10వ విడత నుంచి 12వ విడత సామాజిక తనిఖీ వరకు డీఆర్‌డీఏ పరిధిలో రూ. 1.61 కోట్ల మేర నిధులు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు.
నోటీసులిస్తున్నాం..
ఉద్యానాలు, మొక్కల పెంపకం అమలులో కొంతమేర లోపాలున్నట్లు సామాజిక తనిఖీల్లో గుర్తించారు. వ్యక్తిగత విచారణలు పూర్తయిన తర్వాత రికవరీ చేయాల్సిన మొత్తానికి ఇప్పుడు నోటీసులు జారీచేస్తున్నాం. రికవరీ చెల్లించకుంటే బాధ్యులపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం.
లక్ష్మీపతి, డీఆర్‌డీఏ, పీడీ అనకాపల్లి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni Fans: ధోనీ అభిమానులకు అక్కడే పడక
-
Crime News
TDP-Mahanadu: మహానాడు నుంచి వెళ్తూ తెదేపా నాయకుడి దుర్మరణం
-
Crime News
Murder: 16 ఏళ్ల బాలిక దారుణహత్య.. 20 సార్లు కత్తితో పొడిచి చంపాడు!
-
Ts-top-news News
రాష్ట్రంలో త్వరలోనే క్రీడాపాలసీ
-
Crime News
చాట్ జీపీటీతో జవాబులు.. ఎలక్ట్రానిక్ డివైస్‌తో చేరవేత!
-
Sports News
Ambati Rayudu: చివరి మ్యాచ్‌లో రాయుడు మెరుపు షాట్లు.. చిరస్మరణీయ ఇన్నింగ్స్‌తో ముగింపు