logo

కష్టం తెలిసి.. అండగా నిలిచి..

గుప్పెడు గుండెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడిన వేళ బండెడు బరువునైనా, కష్టపడి గమ్యానికి చేర్చగలమంటున్నారు.

Published : 03 Dec 2022 00:58 IST

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నేడు

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే

గుప్పెడు గుండెలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడిన వేళ బండెడు బరువునైనా, కష్టపడి గమ్యానికి చేర్చగలమంటున్నారు. వైకల్యంతో తాము పడ్డ కష్టాలను గుర్తెరిగి తమలాంటి వారికి అండగా నిలవడంలో ముందుంటున్నారు.

దివ్యాంగులకు బస్‌పాస్‌ ఇప్పిస్తున్న రవి

నేటి కంప్యూటర్‌ యుగంలో సకలాంగులతో పోటీపడి దివ్యాంగులు గెలిచేందుకు అండదండలు అందిస్తున్నారు విలీన మండలాల దివ్యాంగుల సమన్వయకర్త నెరుపటి రవి. పోలియో మహమ్మారి కారణంగా ఈయన దివ్యాంగుడిగా మారారు. డిగ్రీ వరకు చదివాక తనలాంటి మిగతావారికి మార్గదర్శకంగా మారాలని నిర్ణయించుకున్నారు. 2000లో తెలంగాణ రాష్ట్రం జమ్మికుంటలో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి సొసైటీ స్థాపించారు. 2010లో హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో మన్యంవాసుల ప్రస్తావన రావడంతో ఇక్కడకు వచ్చారు. స్థానిక ఏఎస్‌డీఎస్‌ సంస్థలో చేరి, విలీన మండలాల్లో ముందుగా సర్వే చేశారు. వారికి ప్రభుత్వ పథకాలు, రాయితీలు, దివ్యాంగులకు నిర్దేశించిన చట్టాలపై పెద్దగా అవగాహన లేదని తెలుసుకున్నారు. ప్రభుత్వ పింఛన్లు, రాయితీ బస్‌పాస్‌లు ఇప్పించడమేకాక, దివ్యాంగుల వివాహాలకు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రోత్సాహకం దాదాపుగా 30 కుటుంబాలకు ఇప్పించారు. గ్రహణమొర్రి కలిగిన దాదాపు 20 మంది శస్త్రచికిత్సలకు ప్రభుత్వం, దాతల సహకారంతో నిధులు సేకరించారు. ఉపాధి హామీలో వికలాంగుల సంఘాలు ఏర్పాటుచేసి, ఆ పనులతో సొంత కాళ్లపై నిల్చునేలా పలువురిని ప్రోత్సహించారు.


నిబంధనలు సడలించాలి : దివ్యాంగుల చట్టాలకు సంబంధించి మన్యంలో కొన్ని సడలింపులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం దివ్యాంగుల వివాహ ప్రోత్సాహకానికి కనీసం పదో తరగతి అర్హత ఉండాలని నిబంధన పెట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో చాలామందికి నష్టం జరుగుతుంది.

రవి


సాటివారికి సాయంలో ముందు..

కొయ్యూరు, న్యూస్‌టుడే: తాను దివ్యాంగుడే అయినా తనలాంటి తోటివారికి సాయం అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు శరభన్నపాలెంలోని వనగల వెంకటేశ్వర్లు. పోలియో కారణంగా ఈయన రెండు కాళ్లు పనిచేయవు. చేతికర్రల సాయంతో నడిచే వెంకటేశ్వర్లు డిగ్రీవరకు చదువుకున్నారు. స్థానిక గిరిజన సంక్షేమ వసతిగృహంలో దినసరి కూలిగా పనిచేస్తున్నారు. ధ్రువపత్రాల కోసం వచ్చే ప్రతి దివ్యాంగుడికి తనవంతు సాయం చేస్తారు. శిబిరాలకు కొంతమందిని తన సొంతఖర్చుతో తీసుకెళ్తుంటారు. దివ్యాంగులకు అవసరమైన ఉపకరణాలు, రుణాల కోసం వారిని అధికారులు, ప్రజా ప్రతినిధుల వద్దకు తీసుకెళ్లి వాటి కోసం కృషి చేస్తుంటారు. దివ్యాంగుల సంఘం చురుగ్గా పనిచేస్తూ ఇతరుల మన్ననలు పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు