logo

విద్యార్థి కుటుంబాన్ని ఆదుకుంటాం

పాడేరు మండలం డోకులూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్వగ్రామం గున్నమామిడిలో అనారోగ్యంతో మృతిచెందిన సీదరి సూరిబాబు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు తెలిపారు.

Published : 04 Dec 2022 00:49 IST

గిరిజన సంక్షేమ డీడీ కొండలరావు

గున్నమామిడిలో కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు

జి.మాడుగుల, పాడేరు, న్యూస్‌టుడే: పాడేరు మండలం డోకులూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతూ స్వగ్రామం గున్నమామిడిలో అనారోగ్యంతో మృతిచెందిన సీదరి సూరిబాబు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని గిరిజన సంక్షేమశాఖ డీడీ కొండలరావు తెలిపారు. విద్యార్థి గత నెల 29న పాఠశాల నుంచి స్వగ్రామానికి వచ్చాడు. తీవ్ర అనారోగ్యానికి గురై 2వ తేదీ రాత్రి మృతి చెందాడు. మృతదేహంతో పాడేరు ఐటీడీఏ కార్యాలయం వద్ద కుటుంబసభ్యులు, పలు ప్రజా సంఘాలు నిరసన తెలిపే అవకాశాలు ఉన్నాయని తెలుసుకున్న అధికారులు ఆగమేఘాల మీద గ్రామానికి చేరుకున్నారు. డీడీ కొండలరావు, ఏటీడబ్ల్యూవో రజని, డోకులూరు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు హేమచందర్‌, ఉపాధ్యాయులు గ్రామానికి చేరుకొని కుటుంబసభ్యులతో మాట్లాడారు. ముందుగా కుటుంబసభ్యులు పాఠశాల ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కుమారుడి మృతితో తల్లిదండ్రులు, కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. డీడీ మాట్లాడుతూ విద్యార్థి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. కుటుంబంలో ఒకరికి ఏదైనా పాఠశాలలో శానిటరీ వర్కర్‌గా ఉద్యోగం ఇప్పిస్తామని, ప్రభుత్వం నుంచి రూ.1 లక్ష అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతో కుటుంబీకులు నెమ్మదించారు. దహన సంస్కారాల నిమిత్తం పాఠశాల యాజమాన్యం కొంత నగదు అందజేసింది.

* విద్యార్థుల వరుస మరణాలతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. సూరిబాబు మృతిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. 

అరెస్టు అన్యాయం

సూరిబాబు కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న గిరిజన సంఘం మండల కార్యదర్శి దీనబంధును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం అన్యాయమని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మన్నపడాల్‌ అన్నారు. ప్రభుత్వ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఇలా అక్రమ అరెస్టులకు పూనుకుంటోందని విమర్శించారు. బాలుడి మృతికి కారణమైన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోకుండా నిలదీసిన ప్రజా సంఘ నాయకులను అరెస్టు చేయడం తగదన్నారు. బాలుడి కుటుంబానికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందించాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని