logo

నాడు-నేడు నిధులు 41.42 కోట్లు వెనక్కి!

ఉమ్మడి జిల్లాలో నాడు నేడు పథకంలో ఖర్చుకాకుండా ఉన్న నిధులు రూ.41.42 కోట్లు వెనక్కి మళ్లనున్నాయి.

Published : 04 Dec 2022 00:49 IST

వెచ్చించకపోవడంతో ఇతర జిల్లాలకు మళ్లింపు!

రాజయ్యపేటలోని ఓ పాఠశాలలో నాడు-నేడు పనులు

ఈనాడు డిజిటల్‌, పాడేరు: ఉమ్మడి జిల్లాలో నాడు నేడు పథకంలో ఖర్చుకాకుండా ఉన్న నిధులు రూ.41.42 కోట్లు వెనక్కి మళ్లనున్నాయి. ఈ మేరకు పాఠశాల మౌలిక సదుపాయాల కమిషనర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో 1131 పాఠశాలల్లో రూ.310 కోట్లతో మొదటి విడత నాడునేడు పనులు చేపట్టారు. రెండున్నరేళ్లు పాటు ఈ పనులు కొనసాగాయి. ఇంకా కొన్ని పనులు మిగిలే ఉన్నాయి. వీటికి సంబంధించి కొంత మేర నిధులు ఖర్చుకాకుండా ఉన్నాయి. రెండో విడత పనులు జిల్లాల విభజన తర్వాత మొదలయ్యాయి. ఇప్పుడిప్పుడే పనులు ప్రారంభిస్తున్నారు. వీటికి సంబంధించి అంచనా విలువలో 15 శాతం ముందుగా రివాల్వింగ్‌ ఫండ్‌ ఖాతాల్లో వేశారు. ఈ సొమ్ములతో కొన్ని పాఠశాలల్లో పనులు జోరుగా చేపడుతుంటే మరికొన్నిచోట్ల సిమెంట్‌, ఇసుక సరఫరా తగ్గడంతో మందకొడిగా చేస్తున్నారు. మొదటి విడతలో మిగిలిన నిధులను రెండో విడతలో వినియోగించుకోవాలని భావిస్తున్నారు. ఈలోగా ఖర్చుకాని నిధులను వెనక్కి ఇచ్చేయాలని ఉన్నతాధికారులే ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 18 జిల్లాల నుంచి నిధులను వెనక్కి తీసుకుంటే అందులో విశాఖ జిల్లా నుంచే అత్యధికంగా రూ.33.84 కోట్లు ఉంది. అనకాపల్లి జిల్లా నంచి రూ.5.61 కోట్లు, అల్లూరి జిల్లా నుంచి రూ.1.97 కోట్లు వెనక్కి తీసుకోబోతున్నారు. ఈ నిధులను వెంటనే ప్రధాన కార్యాలయంలోని ఖాతాకు మళ్లించాలని సూచించారు. వాటిని నిధులు అవసరమైన జిల్లాల్లో వినియోగిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం జిల్లాలో నాడు-నేడు పనులకు నిధుల కొరత ఉంది. సొమ్ములు లేక అసంపూర్తిగా పనులు వదిలేశారు. వాటికి ఈ నిధులు వినియోగించుకునే అవకాశం ఇచ్చుంటే బాగుండేదని సంబంధిత అధికారులంటున్నారు. ఇప్పటికే పనులు మందకొడిగా జరుగుతున్నాయి. ఉన్న నిధులు వెనక్కి వెళ్లిపోతే నాడు-నేడు పనులు పడకేస్తాయంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు