logo

గుప్పుగుప్పు ఎక్కువే.. చిక్కేది తక్కువే!!

దేశంలో ఎక్కడ గంజాయి వంటి మత్తుపదార్థాలు చిక్కినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజులో ఉండటం పరిపాటిగా మారింది. ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ’ (డి.ఆర్‌.ఐ.) వార్షిక నివేదికలో ఇది వెల్లడైంది.

Published : 06 Dec 2022 01:34 IST

పాడేరు, చింతపల్లి, చింతూరు, న్యూస్‌టుడే

దేశంలో ఎక్కడ గంజాయి వంటి మత్తుపదార్థాలు చిక్కినా దాని మూలాలు అల్లూరి సీతారామరాజులో ఉండటం పరిపాటిగా మారింది. ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ’ (డి.ఆర్‌.ఐ.) వార్షిక నివేదికలో ఇది వెల్లడైంది. దేశవ్యాప్తంగా గంజాయి స్మగ్లింగ్‌కు సంబంధించిన వివరాలను, మాదకద్రవ్యాలు, నేరాలపై ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు తయారుచేసిన నివేదిక వివరాలను పొందుపరచారు. మన్యంలో 20 వేల ఎకరాలకు పైగా గంజాయి సాగవుతోందని, కోట్లాది రూపాయలు అక్రమ వ్యాపారం సాగుతోందని సమాచారం. ఈ దందా వెనుక కొన్ని చోట్ల పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బంది హస్తం పరోక్షంగా ఉన్నట్లు కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది.


త ఏడాది తెలంగాణా రాష్ట్రానికి చెందిన పోలీసులు పాడేరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన నిందితులను పట్టుకునేందుకు చింతపల్లి అటవీ ప్రాంతానికి వచ్చారు. నిందితులను వారి వెంట తీసుకువెళుతున్న సమయంలో స్థానికులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పర దాడులకు దిగడంతో ఇద్దరు గిరిజనులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతరం అప్పట్లో గంజాయి మూలాలు ఏజెన్సీలో ఎంతగా నాటుకున్నాయో బయటకొచ్చింది. దీనిపై తెదేపాతో పాటు వివిధ రాజకీయ పార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేశాయి.

అల్లూరి జిల్లాలో గంజాయి తోటలు


విపక్షాల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చింది. ఏజెన్సీలో ఒక్క మొక్క కూడా పండటం లేదని చెబుతూ వస్తోన్న పోలీసులు తప్పనిసరై గంజాయి తోటలపై దాడులకు దిగారు.


పోలీసులు, ఎక్సైజ్‌, అటవీ శాఖ అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు గత ఏడాది చేపట్టిన దాడుల్లో సుమారు 14 వేల ఎకరాల తోటలను ధ్వంసం చేశారు. నిఘా వర్గాలకు చిక్కని తోటలు మరో ఆరు వేల ఎకరాల్లో ఉండొచ్చని అంచనా వేశారు.


స్థానికంగా కేజీ రూ.5 వేల వరకు ఉన్న గంజాయి చెన్నై, ముంబయి, హైదరాబాద్‌ ప్రాంతాల్లో రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు పలుకుతోందని కొన్ని నిఘా వర్గాలే చెబుతున్నాయి. దీంతో గడిచిన మూడేళ్లుగా గంజాయి రవాణా పెద్దఎత్తున సాగుతోంది.  అల్లూరి జిల్లా ఇటు ఒడిశా, ఛతీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఆనుకుని ఉండడంతో ఆయా ప్రాంతాల నుంచి గంజాయిని ఈ జిల్లా ప్రధాన ప్రాంతాలైన పాడేరు, చింతపల్లి, అరకులోయ మీదుగా సులభంగా తరలిస్తున్నారు. అటువైపు చూస్తే చింతూరు, రంపచోడవరం ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తారు. బైకులు, గుర్రాలు, పెట్రోల్‌ ట్యాంకర్లతో పాటు ఆఖరికి ఆర్టీసీ బస్సులను సైతం రవాణాకు వినియోగిస్తుండటం విశేషం.

వాహనంలో చిక్కిన గంజాయి ప్యాకెట్లు


మచ్చుకు కొన్ని..

గూడెంకొత్తవీధి నుంచి పాడేరు వెళుతున్న డొంకరాయి బస్సును పోలీసులు తనిఖీ చేయగా మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా పట్టుబడింది. గంజాయి స్మగ్లర్లతో పాటు ఆర్టీసీ కండక్టర్‌పై కూడా పోలీసులు కేసు నమోదు చేయడం గమనార్హం.

ఇటీవల పెదబయలు ప్రాంతం నుంచి గంజాయితో వస్తున్న వాహనాన్ని పట్టుకునేందుకు ఎక్సైజ్‌ సిబ్బంది బయలుదేరారు. గబ్బంగి సమీపంలో ఎక్సైజ్‌ వాహనం ఎదురుగా వస్తోందని తెలుసుకున్న రవాణాదారులు ఆ వాహనాన్ని తప్పించుకునే క్రమంలో ఢీకొట్టారు. తర్వాత కొంత దూరం వెళ్లి కొండవాలు వద్ద వాహనాన్ని వదిలిపెట్టి పరారయ్యారు.

హుకుంపేట మండలం కామయ్యపేట వద్ద గంజాయితో వస్తున్న ముఠా ఆ ప్రాంతంలో వేరే పనిపై వెళుతున్న పోలీసు సిబ్బందిని చూసి తప్పించే క్రమంలో తాము ప్రయాణిస్తున్న వాహనాన్ని వదిలి వెళ్లారు. భారీ గంజాయితో పాటు ఓ పిస్తోలు సైతం లభ్యమయ్యాయి.


ఆ మరక లేకుండా చేస్తున్నాం...

సతీష్‌ కుమార్‌, ఎస్పీ, అల్లూరి సీతారామరాజు జిల్లా

గతంలో పోల్చితే గంజాయిపై దాడులు విస్తృతంగా చేస్తున్నాం. గత ఏడాది భారీ స్థాయిలో దాడులు నిర్వహించి వేలాది ఎకరాలను ధ్వంసం చేశాం. రైతులకు ప్రత్యామ్నాయంగా రాజ్‌మా, ఇతర పంటలకు సంబంధించి ప్రోత్సాహకాలను అందిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా చింతూరు, సీలేరు ప్రాంతాల్లో రవాణా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. పెదబయలు, ముంచంగిపుట్టు మండలాల్లో కొద్దొ గొప్పో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆయా ప్రాంతాలపైనా కూడా గురిపెట్టి దాడులు ఉద్ధృతం చేస్తాం. జిల్లాలో దాదాపుగా గంజాయి రవాణా తగ్గినట్లే భావిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని