logo

ముప్పు తప్పించి..ఖర్చు తగ్గించి..

డ్రోన్‌తో జీవరసాయనాల పిచికారీపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండేళ్లు పరిశోధనలు చేస్తారు.

Updated : 08 Dec 2022 05:08 IST

డ్రోన్లతో జీవ రసాయనాల పిచికారీ
అనకాపల్లి, న్యూస్‌టుడే

ప్రయోగాన్ని పరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు

డ్రోన్‌తో జీవరసాయనాల పిచికారీపై అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రెండేళ్లు పరిశోధనలు చేస్తారు. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో డ్రోన్‌తో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాతావరణ కాలుష్యంతోపాటు వాటిలోని అవశేషాలు పంట ఉత్పత్తులపై ఉండి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అంతేకాకుండా తరచూ ఒకే క్రిమిసంహారక మందు పిచికారీ చేయడం వల్ల పురుగులు ఆయా మందుల నుంచి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే క్రిమిసంహారక మందులకు బదులుగా కీటక నాశక జీవ శిలీంద్రాలను పిచికారీ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిని అనకాపల్లి పరిశోధన కేంద్రంలో ఉత్పత్తి  చేేస్తున్నారు. వరి, మొక్కజొన్న, చెరకు, కంది, పెసర, మినుము, కొబ్బరి పంటలకు జీవ రసాయనాలను ఇక్కడ రూపొందించారు. వీటిని డ్రోన్‌తో పిచికారీ చేసే విధానంపై పరిశోధనలు చేపట్టారు. ఇటువంటి పరిశోధనలు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పరిశోధన కేంద్రం ఏడీఆర్‌ డాక్టరు పి.వి.కె.జగన్నాథరావు, ప్రధాన శాస్త్రవేత్త డాక్టరు ఎం.విశాలాక్షి తెలిపారు వాటి వివరాలను ‘న్యూస్‌టుడే’కి వివరించారు. అవి వారి మాటల్లోనే..‘

ముందుగా మొక్కజొన్న, వరి పంటలపై పరిశోధనలు ప్రారంభించాం. రెండు ఖరీఫ్‌, రబీ సీజన్లలో పరిశోధనలు నిర్వహిస్తాం. మొక్కజొన్నలో కత్తెర పురుగు ప్రధాన సమస్యగా ఉంది. దీని నివారణకు బ్యాక్టీరియా ఆధారిత జీవ శిలీంద్రమైన బాసిల్లస్‌ తురింజెన్సిస్‌ (బిట) లేదా కీటక నాశక జీవశిలీంద్రమైన మోటారైజియం అనిసోప్లియాలను ఇక్కడే ఉత్పత్తి చేస్తున్నాం. వీటిని డ్రోన్‌తో ఏవిధంగా ఉపయోగించాలనే అంశంపై పరిశోధనలు చేస్తున్నాం. స్ప్రేయర్‌ ద్వారా చేస్తే మందుద్రావణం చేసేందుకు ఎక్కువ నీరు అవసరం. కూలీల ఖర్చూ ఎక్కువే. డ్రోన్‌తో చేసే సమయంలో ఎంత ఎత్తు నుంచి చేయాలి, వేగం ఎంత, మందు శాతం ఎంత ఉండాలి, ఎన్ని పర్యాయాలు పిచికారీ చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి చేయాలి వంటి పలు అంశాలపై పరిశోధనలు చేస్తున్నాం. స్ప్రేయర్‌ ద్వారా ఎకరాకు మందు ద్రావణం పిచికారీ చేయడానికి నాలుగు గంటల సమయం పడుతుంది. డ్రోన్‌తో కేవలం 10 నిమిషాలలో చేయొచ్చు. స్ప్రేయర్‌తో చేస్తే 200 లీటర్ల నీరు ఉపయోగించాలి. డ్రోన్‌తో చేస్తే కేవలం 10 లీటర్ల నీరు సరిపోతుంది. దాంతో పంట అంతా సమానంగా పడుతుంది. నేరుగా పురుగుకు చేరుతుంది. మొక్కజొన్న, వరిపై పరిశోధనలు తర్వాత ఇతర పంటలపై చేపడతాం. వరి పంటకు సోకే కాండం తొలుచు పురుగు, ఆకు ముడత దోమలను, చెరకు పంటకు వచ్చే వేరుపురుగు, కంది, పెసర, మినుము పంటలలో వచ్చే మారుకా మచ్చల పురుగు, కాయతొలుచు పురుగులను, కొబ్బరిలో వచ్చే సర్పిలాకార తెల్లదోమలపై జీవరసాయనాలు ఉపయోగించొచ్చు.’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని