logo

కౌమారం.. బలహీనం!

హుషారుగా తిరగాల్సిన వయసులో డీలాపడిపోతున్నారు. పట్టుమని పది నిమిషాలు నిలబడితే నిస్సత్తువ ఆవరించి నీరసించిపోతున్నారు.

Published : 25 Jan 2023 02:10 IST

75 శాతం మంది బాలికల్లో రక్తహీనత
పోషకాహార లోపమే ప్రధాన కారణం  
ఈనాడు డిజిటల్‌, పాడేరు

హుషారుగా తిరగాల్సిన వయసులో డీలాపడిపోతున్నారు. పట్టుమని పది నిమిషాలు నిలబడితే నిస్సత్తువ ఆవరించి నీరసించిపోతున్నారు. కాస్తా ఎండ ఎక్కువైతే కళ్లు తిరిగిపడిపోతున్నారు. కౌమారదశలో ఉన్న బాలికల్లోని ఎక్కువ మందిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. పోషకాహారం తీసుకోకపోవడం, జీవనశైలిలో మార్పుల కారణంగా రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్నారు. దీనివల్లే యుక్తవయసు ఆడపిల్లలు కూడా బలహీనంగా ఉంటున్నారని వైద్యులు అంటున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేకంగా వైద్య, ఆరోగ్య శాఖ చేసిన తనిఖీల్లో 75 శాతం మందిపైగా బాలికలు రక్తహీనతతో ఉన్నట్లు గుర్తించారు. వీరందరికీ అనీమియా ముక్త్‌ భారత్‌ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించి ఆ సమస్య నుంచి బయటపడేలా చేస్తామని చెబుతున్నారు.

బాధితులు ఎక్కువే..

ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల్లో పది నుంచి 19 ఏళ్ల మధ్య వయసున్న అమ్మాయిలకే రక్తహీనత పరీక్షలు చేస్తున్నారు. ఈ వయసు అమ్మాయిలు సుమారు 1.39 లక్షల మంది ఉన్నారు. గత నెలలో వీరందరికీ పరీక్షలు మొదలుపెట్టారు. ఈ నెల మొదటి వారానికి 86,577 మందిని పరీక్షించారు. వారిలో 68 వేల మందికి పైగా రక్తహీనత సమస్యతో ఉన్నట్లు గుర్తించారు. పరీక్షించిన విద్యార్థుల్లో 75 శాతం మంది ఈ సమస్య బారిన పడినట్లు స్పష్టమవుతోంది. ఈ రకాలు ఓ రకంగా ఆందోళన కలిగించేవేనని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. వీరిలో 65 నుంచి 70 శాతం మంది 7 నుంచి 9.9 గ్రాముల మధ్య హిమోగ్లోబిన్‌ కలిగి ఉన్నారు. వీరు సరైన పోషకాహారం తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చని వైద్యులంటున్నారు.

విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు చేస్తున్న ఆరోగ్య కార్యకర్త

ఎందుకు ఈ పరిస్థితి?

* అమ్మాయిలు ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. తింటే ఎక్కడ బొద్దుగా కనిపిస్తామేమోనని భయం, చిన్నపాటి ఒళ్లుచేసినా లావైపోయినట్లు భావించి తిండి మానేస్తుంటారు.

* పాఠశాలలు పెట్టే మధ్యాహ్న భోజనంలో నాణ్యత సరిగా లేకపోవడంతో ఆహారం సక్రమంగా     తీసుకోవడం లేదు.

* పోషకాహారానికి బదులు జంక్‌ఫుడ్‌, బయట వండిన వాటికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు.

* నెలసరి సమయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రక్తస్రావం జరిగి నీరసించిపోతుంటారు.

ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం..

మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు రక్తహీనత బారిన పడేలా చేస్తున్నాయి. పాఠశాలల వారీగా ఈ సమస్యతో బాధపడేవారిని గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. రక్తహీనత ఎక్కువగా ఉన్న పిల్లలకు గతంలో వారానికి ఒకసారి ఐరన్‌ మాత్రలు ఇచ్చేవారం. ఇకపై రోజువారీ భోజనంలో వారికి ఆ మాత్రలు అందేలా చూస్తాం. ఇందుకోసం ప్రతి పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు హెల్త్‌ అంబాసిడర్‌గా ఉండి పర్యవేక్షిస్తుంటారు. మరీ తీవ్రత ఎక్కువ ఉన్న పిల్లలకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో నివారణ చర్యలు తీసుకుంటాం.

- డాక్టర్‌ హేమంత్‌, డీఎంహెచ్‌ఓ, అనకాపల్లి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని