logo

ఇలాగైతే ఇంటర్‌ గట్టెక్కేదెలా?

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవితవ్యం గాలిలో దీపంలా మారింది.

Published : 26 Jan 2023 02:26 IST

ముగియనున్న ఒప్పంద అధ్యాపకుల కాల పరిమితి

రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో విద్యార్థులు

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల భవితవ్యం గాలిలో దీపంలా మారింది. పాఠాలు చెప్పేందుకు పూర్తిస్థాయిలో అధ్యాపకులు లేక.. సొంతంగా చదువుకునేందుకు పాఠ్య పుస్తకాలు లేక ఇంటర్‌ పరీక్ష ఎలా గట్టెక్కాలో తెలియక సతమతం అవుతున్నారు. దీనికితోడు ఒప్పంద ప్రాతిపదికన పని చేస్తున్న అధ్యాపకుల కాల పరిమితి ఈ నెలాఖరుతో ముగియనుంది. చాలా కళాశాలల్లో సిలబస్‌ 60 నుంచి 70 శాతం వరకు మాత్రమే పూర్తయింది. మరో పది రోజుల తరవాత ఒప్పంద అధ్యాపకులూ కళాశాలకు రాకపోతే మిగిలిన పాఠ్యాంశాలు చెప్పేదెవరు? పరీక్షలు గట్టెక్కించేదెవరు అన్న ప్రశ్నకు సమాధానం కరవైంది.

పాడేరు, రాజవొమ్మంగి, న్యూస్‌టుడే

జిల్లావ్యాప్తంగా 20 మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. గతేడాది జులై 1న తరగతులు ప్రారంభం అయ్యాయి. 3467 మంది ప్రథమ, 2869 మంది ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. దాదాపు అన్ని కళాశాలల్లోనూ ఒప్పంద అధ్యాపకులే అధిక సంఖ్యలో ఉన్నారు. 20 కళాశాలల్లో 22 మంది పూర్తిస్థాయి అధ్యాపకులుంటే, ఒప్పంద ప్రాతిపదికన ఏకంగా 122 మంది పని చేస్తున్నారు. రాజవొమ్మంగి, రంపచోడవరం, అనంతగిరి, పాడేరు తదితర కళాశాలల్లో దాదాపుగా ఒప్పంద అధ్యాపకులే ఉన్నారు.మొదట్లో వీరి సర్వీసులను పునరుద్ధరించకపోవడంతో బోధనకు కొంత ఇబ్బంది ఎదురైంది. అక్టోబరులో వీరి నియామకాలకు అవకాశం కల్పించారు. 2022-23 విద్యా సంవత్సరానికి పది నెలల కాల పరిమితిలో భాగంగా 2022 ఏప్రిల్‌ నుంచి 2023 జనవరి నెలాఖరు వరకు పని చేయాల్సి ఉంది. గతంలో 12 నెలల కాలపరిమితితో వారు సేవలందించగా ప్రస్తుత విద్యాసంవత్సరంలో పది నెలలకే కుదించారు. మరో పది రోజుల్లో కాల పరిమితి ముగియనున్న నేపథ్యంలో వీరిని కొనసాగించే విషయమై ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. ఈ ఏడాది పరీక్షలు మార్చి 15 నుంచి నిర్వహించాలని బోర్డు నిర్ణయించడంతో కనీసం పరీక్షలు పూర్తయ్యే వరకైనా అధ్యాపకులను కొనసాగిస్తే బాగుంటుందని అంతా భావిస్తున్నారు.

* రాజవొమ్మంగి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 288 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్థులు చదువుతున్నారు. వీరికి 9 మంది అధ్యాపకులు బోధిస్తుండగా వీరిలో ఒకరు (డిప్యుటేషన్‌) పూర్తిస్థాయి ప్రాతిపదికన, 8 మంది ఒప్పంద అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉండగా ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు అందలేదు. బోధన విషయమై ఒప్పంద అధ్యాపకులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది.

* జిల్లా కేంద్రమైన పాడేరు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 900 మంది విద్యార్థులున్నారు.. పూర్తిస్థాయి అధ్యాపకుడు ఒక్కరే. 10 మంది ఒప్పంద, ఐదుగురు అతిథి అధ్యాపకులున్నారు. చింతపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 631 మంది విద్యార్థులుండగా.. ఇద్దరు పూర్తిస్థాయి, ఏడుగురు ఒప్పంద, ఇద్దరు అతిథి అధ్యాపకులు విధులు నిర్వరిస్తున్నారు. రంపచోడవరం కళాశాలలో 424 మంది విద్యార్థులకు ఒక పూర్తిస్థాయి, పదకొండు మంది ఒప్పంద,

ఇద్దరు అతిథి అధ్యాపకులున్నారు.

ప్రభుత్వ నిర్ణయం మేరకు...: ఏటా ప్రభుత్వం  నిర్దేశిత పరిమితి ప్రకారం ఒప్పంద అధ్యాపకుల నియామకాలు చేపడుతుంది. ఈ ఏడాది నెలాఖరుకు వారి కాల పరిమితి ముగిసినా ప్రభుత్వం నిర్ణయం ప్రకారం వారికి కొనసాగింపు ఉత్తర్వులు జారీ అవుతాయి. ఈ ప్రక్రియ ఏటా జరుగుతూనే ఉంటుంది. చాలా కళాశాలల్లో సిలబస్‌ దాదాపుగా పూర్తయింది. మిగులు సిలబస్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టంగా ఆదేశించాం. విద్యార్థులను ప్రీ-ఫైనల్‌ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాం.

 బెన్నాస్వామి, డీఐఈఓ 


ఉద్యోగ భద్రత కల్పించాలి

సంవత్సరంలో 12 నెలలూ పూర్తి స్థాయిలో వేతనం అందజేయాలి. ఈ ఉద్యోగంపైనే మా కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. మమ్మల్ని రెగ్యులర్‌ చేయాల్సింది పోయి పది నెలలకే సర్దుబాటు చేయడం సరికాదు. ఫిబ్రవరి నుంచి యథావిధిగా రెన్యువల్‌ ఇవ్వాలి.

 గొర్ల మాణిక్యం, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు