logo

అందరి సహకారంతో అగ్రపథానికి..

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు అంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 27 Jan 2023 02:28 IST

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ సుమిత్‌

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యాలకు అనుగుణంగా కొత్తగా ఏర్పడిన అల్లూరి సీతారామరాజు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టేందుకు అంతా శక్తివంచన లేకుండా కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం పాడేరులో 74వ గణతంత్ర దిన వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కలెక్టర్‌తోపాటు ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, సంయుక్త కలెక్టర్‌ శివ శ్రీనివాస్‌, ఎస్పీ సతీష్‌కుమార్‌, ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, సబ్‌ కలెక్టర్‌ అభిషేక్‌, ఏఎస్పీ తుహిన్‌ సిన్హా, చింతలవీధి సర్పంచి సీతమ్మ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా పోలీసులు, విద్యార్థులతో పరేడ్‌ నిర్వహించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, లక్ష్యాలు, పరిపాలనా విధానాన్ని ప్రజలకు వివరించారు. షెడ్యూల్డ్‌ ప్రాంతం ఎక్కువగా ఉన్న జిల్లా కావడంతో బడుగు, బలహీనవర్గాల ప్రాధాన్యానికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలుచేస్తున్న నవరత్నాల ద్వారా ప్రజలకు ఎక్కువ మేలు జరుగుతోందన్నారు. రూ.500 కోట్లతో పాడేరులో నిర్మితమవుతున్న వైద్య కళాశాల నిర్మాణం తుది దశలో ఉందని చెప్పారు. స్పందన కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తక్షణమే పరిష్కరిస్తూ వారి విశ్వాసాన్ని పొందుతున్నామన్నారు. 352 గ్రామ సచివాలయాల ద్వారా 525 రకాల సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన 574 పనులకు 17 విడతల్లో రూ.19 కోట్లు మంజూరైనట్లు వివరించారు.

ఆపరేషన్‌ పరివర్తన, ఉపాధి కల్పన, స్వయం ఉపాధి రంగాల ద్వారా యువత, డ్వాక్రా సంఘాల సభ్యులకు రాయితీపై రుణాలందిస్తున్నట్లు చెప్పారు. నాడు-నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి జరుగుతోందన్నారు. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా రూ.630 కోట్లతో 1250 తాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతోందని పేర్కొన్నారు జిల్లావ్యాప్తంగా నాలుగు జాతీయ రహదారి ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయని వివరించారు. జిల్లా అభివృద్ధికి సహకరిస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఉత్తమ సేవలందించిన పోలీసు, ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో చక్కని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ శాకల పనితీరుపై ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అతిథులు సందర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు