logo

హస్త కళలకు జీవం.. వరించిన పద్మం

ఆయన చదువుకుంది పదో తరగతి. అయితేనేం హస్తకళలకు జీవం పోశారు. ఈ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపారు.

Updated : 27 Jan 2023 06:25 IST

ఎలమంచిలి, న్యూస్‌టుడే

కుటుంబ సభ్యులతో పద్మశ్రీ అవార్డు గ్రహీత

ఆయన చదువుకుంది పదో తరగతి. అయితేనేం హస్తకళలకు జీవం పోశారు. ఈ కళాకారుల జీవితాల్లో వెలుగులు నింపారు. తను పుట్టిన గ్రామం పేరును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. లక్కబొమ్మల తయారీలో ప్రకృతి సిద్ధమైన రంగులు పరిచయం చేశారు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలన్న చందాన నిరాడంబరంగా కళాకారులకు సేవలందించారు. కుగ్రామమైన ఏటికొప్పాక నుంచి ప్రపంచ దేశాలకు లక్కబొమ్మలు ఎగమతులు అయ్యేలా చేశారు. కృషి, పట్టుదల ఉంటే ఏదైనా చేయవచ్చని నిరూపించారు. ఈయన  సేవలను గుర్తించిన ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకి ఎంపిక చేసింది. ఆయనే ఏటికొప్పాక గ్రామానికి చెందిన చింతలపాటి వెంకటపతి రాజు అలియాస్‌ ప్రసాద్‌బాబు.

ఏటికొప్పాక గ్రామానికి చెందిన వెంకటపతిరాజును అందరూ ప్రసాద్‌బాబు అని పిలుస్తారు. పదో తరగతి వరకు చదువుకున్నారు. ఉన్నత చదువులు చదవాలనుకున్నారు. లక్కబొమ్మలకు ఆదరణలేదని అందుకే వలసలు పోతున్నామని కళాకారులు చెప్పిన మాటలు ఆలోచింపజేశాయి. చదువును పక్కన పెట్టి లక్కబొమ్మలకు పూర్వ వైభవం తీసుకు రావడంతో పాటు గ్రామంలోని కళాకారులు ఈ వృత్తిలో జీవించేలా చేయాలని కంకణం కట్టుకున్నారు. తన పూర్తి సమయాన్ని ఈ కళను బతికించడానికి కేటాయించారు. ఆయన శ్రమ ఫలించింది.

కళాకారులకు శిక్షణ..: ఆధునిక బొమ్మల తయారీపై కళాకారులకు ఆయన ఇచ్చిన శిక్షణ, మెలకువలు ఫలించాయి. స్వగ్రామంలో హస్తకళా నిలయాన్ని ఏర్పాటుచేసి అందులోనే కళాకారులకు శిక్షణ ఇచ్చారు. ఏ బొమ్మ కావాలన్నా తయారు చేసేలా వారిని తీర్చిదిద్దారు.

విదేశాలకు ఎగుమతి..: ప్రసాద్‌బాబు ప్రకృతి సిద్ధమైన రంగులను లక్కపై వేసి వాటిని బొమ్మలకు వాడేవారు.  అమెరికా, కెనడా, నెదర్లాండ్‌, జర్మనీ, లండన్‌, ఆస్ట్రేలియా తదితర దేశాలకు పంపించి వీటిని ప్రపంచానికి పరిచయం చేశారు. విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు రావడంతో కళాకారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడింది. ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్‌ వీరికి భారీగా ఆర్డర్లు ఇచ్చింది. ఈయన దగ్గర కళను నేర్చుకున్న శ్రీశైలపు చిన్నయాచారి జాతీయ స్థాయి అవార్డును పొందాడు.


పద్మశ్రీ పురస్కారంతో ఏటికొప్పాకకు గుర్తింపు

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: తనకు వచ్చిన పద్మశ్రీ పురస్కారం 500 ఏళ్ల సుదీర్ఘ చరిత్రగల ఏటికొప్పాక హస్తకళకు లభించిన అరుదైన గౌరవంగా తాను భావిస్తున్నట్లు చింతలపాటి వెంకటపతిరాజు (సి.వి.రాజు) అన్నారు. గురువారం అనకాపల్లి వచ్చిన ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. ‘బొమ్మల తయారీ, మార్కెటింగ్‌లో ప్రభుత్వ ప్రోత్సాహం బాగానే ఉంది. రైల్వేస్టేషన్‌, ప్రభుత్వ కార్యక్రమాల్లో స్టాల్స్‌ ఏర్పాటు చేసుకోడానికి అనుమతులు ఇస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అంకుడు చెట్లు వేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నార’ని వివరించారు.


పవన్‌ కల్యాణ్‌ అభినందనలు

ఎలమంచిలి, న్యూస్‌టుడే: హస్తకళాకారుల సంక్షేమానికి వెంకటపతి రాజు కృషి స్ఫూర్తిదాయకమని జనసేన పార్టీ అధినేత పవణ్‌ కల్యాణ్‌ ఫోను ద్వారా అభినందించారు. జనసేన పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్‌ఛార్జి సుందరపు విజయ్‌కుమార్‌ గురువారం ఏటికొప్పాకలో సీవీ రాజును సన్మానించారు. ఆయన ఫోనులో వెంకటపతిరాజుతో పవన్‌ మాట్లాడారు.  


పద్మశ్రీకి ఎంపికైన కళాకారుడికి సన్మానం

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఏటికొప్పాకకు చెందిన చింతపాటి వెంకటపతిరాజుని కలెక్టర్‌ రవి, సంయుక్త కలెక్టర్‌ కల్పనాకుమారి సత్కరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎన్టీఆర్‌ క్రీడామైదానంలో నిర్వహించిన కార్యక్రమంలో వెంకపతిరాజును శాలువతో సత్కరించి జ్ఞాపిక అందజేశారు.


ఎన్నో అవార్డులు...

హస్తకళలను బతికించడం, ప్రకృతి సిద్ధమైన రంగులను పరిచయం చేసినందుకు ఈయన సేవలు గుర్తించి ప్రభుత్వం 2002లో జాతీయస్థాయి అవార్డును అందించింది. అప్పటి రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నుంచి ఆ అవార్డును అందుకున్నారు. బీ 2003లో కమలాదేవి ఛటోపాధ్యాయ అవార్డును, 2011లో ఇంటేక్‌ సంస్థ నుంచి జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్నారు. బీ క్రాప్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా నుంచి పలు అవార్డులు ఈయనను వరించాయి.

క్రాప్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణ నుంచి సైతం అవార్డు అందుకున్నారు.

తపాలా శాఖ కొత్తగా బుక్‌ నౌ పే లేటర్‌ (బీఎన్‌పీఎల్‌) పార్సిల్‌ సర్వీసును ప్రారంభించేలా ప్రోత్సహించి ఎలమంచిలిలో ప్రారంభోత్సవం చేయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని