logo

రంప మన్యానికి ఆరోగ్య రక్ష

మన్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.49.26 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు.

Published : 28 Jan 2023 03:23 IST

49 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి
- రంపచోడవరం, న్యూస్‌టుడే

మన్యంలో గిరిజనులకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో రూ.49.26 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిని మంజూరు చేశారు. ప్రస్తుతం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 50 పడకలతో ఉన్న స్థానిక సామాజిక ఆసుపత్రిని ఇటీవల 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిగా అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతోపాటు ప్రభుత్వం మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి మంజూరు చేయడంతో గిరిజనుల కష్టాలు తీరనున్నాయి. ఏరియా ఆసుపత్రి సమీపంలోనే 4.48 ఎకరాల విస్తీర్ణంలో రెండు ఫ్లోర్లలో దీన్ని నిర్మించనున్నారు. రోగుల కోసం 146 పడకలతోపాటు ఆపరేషన్‌ థియేటర్లు, ఆధునిక సదుపాయాలను కల్పించబోతున్నారు. ఓపీ సేవలతోపాటు జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, గైనిక్‌, డెంటల్‌ అండ్‌ పీడియాట్రిక్‌ సేవలు అందుబాటులో రానున్నాయి.

* గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డయాలసిస్‌ విభాగంలో 19, జనరల్‌ ఐపీ 30, క్యాజువాలిటీ విభాగంలో 20 చొప్పున పడకలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి ఫ్లోర్‌లో పిల్లల వార్డులో 20, ఆర్థోపెడిక్‌ వార్డులో 30, జనరల్‌ ఐపీ వార్డులో 9, సర్జరీ ఐసీయూలో 10, మెడికల్‌ ఐసీయులో 10, ఫ్రీ, పోస్ట్‌ ఓపీ విభాగాల్లో 8, రేడియాలజీ విభాగంలో నాలుగు చొప్పున పడకల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు.

50 మంది వైద్య నిపుణులు

సుమారు 50 మంది వైద్య నిపుణులతో ఈ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. కార్డియాలజీ, న్యూరో, క్యాన్సర్‌ శస్త్రచికిత్సలు, ఆర్థోపెడిక్‌కు సంబంధించి జాయింట్స్‌ రీప్లేస్‌మెంట్‌, ఈఎన్‌టీకి సంబంధించి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు ఇక్కడ చేయనున్నారు. ఎండోక్రైనాలజిస్టు (సుగర్‌, థైరాయిడ్‌) తదితర సేవలతోపాటు ప్లాస్టిక్‌ సర్జరీ వైద్యసేవలూ అందుబాటులోకి రానున్నాయి. స్కానింగ్‌, ఎక్స్‌రే, రక్తపరీక్షల విభాగాలకు సంబంధించి ప్రత్యేక ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు.

త్వరితగతిన పనులు

రంపచోడవరంలో 4.48 ఎకరాల్లో రూ. 49.26 కోట్లతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు జరుగుతున్నాయి. త్వరితగతిన ఈ పనులు పూర్తి చేస్తాం. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రోగులకు అన్ని సదుపాయాలు కల్పిస్తాం.

సీతారామరాజు, ఈఈ, ఏపీఎంఎస్‌ఐడీసీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని