logo

‘గవర్నర్‌తో అబద్ధాలు చెప్పించారు’

గణతంత్ర దినోత్సవాన గవర్నర్‌ హరిచందన్‌తో అబద్ధాలు మాట్లాడించారని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

Published : 29 Jan 2023 03:19 IST

నర్సీపట్నం అర్బన్‌: గణతంత్ర దినోత్సవాన గవర్నర్‌ హరిచందన్‌తో అబద్ధాలు మాట్లాడించారని మాజీమంత్రి, తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు విమర్శించారు. నర్సీపట్నంలో శనివారం విలేకర్లకు పంపిన వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ ఎవరో రాసిచ్చిన ప్రసంగం చదివారని, ఇది వాస్తవమో కాదో చూసుకుని ఉండాల్సిందన్నారు. అసత్యాలు విని ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యా విధానం గొప్పగా ఉందని గవర్నర్‌ చెప్పారని, రాష్ట్రంలో 30 వేల పాఠశాలలు మూసేసిన విషయం అందరికీ తెలుసన్నారు. వ్యవసాయం బాగుందని చెప్పుకొచ్చారని, ధాన్యం కొనేవారు లేరని, పంటలకు గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. పశువులు వ్యాధులతో చనిపోతున్నాయని, చెరకు రైతులకు చెల్లింపులు లేవని పేర్కొన్నారు. రహదారులు అధ్వానంగా ఉంటే 5181 కిలోమీటర్ల రోడ్డేస్తున్నట్లు చెబుతున్నారని, గుత్తేదారులకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉందని విమర్శించారు. పోలవరాన్ని త్వరలో పూర్తి చేస్తున్నామంటున్నారని, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన పనులే ఇప్పటికీ కనిపిస్తున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. వీరి అభివృద్ధి కోసం ఖర్చు చేయాల్సిన సబ్‌ ప్లాన్‌ నిధులు నవరత్నాలకు మళ్లించారని, ఈ అధికారం ఎవరిచ్చారని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని