logo

7 కి.మీ. నడిస్తేనే బడి

చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని రాజుక్యాంపు మారుమూలన ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ 12 కుటుంబాలు నివసిస్తున్నాయి.

Updated : 30 Jan 2023 12:32 IST

అభయారణ్యంలో చిన్నారుల అవస్థలు
న్యూస్‌టుడే, మోతుగూడెం

కాలినడకన గుట్టలపై ఉన్న రాజుక్యాంపునకు వెళ్తున్న ఆదివాసులు

చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీలోని రాజుక్యాంపు మారుమూలన ఒడిశా రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఇక్కడ 12 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఫోర్‌బే జలాశయం పర్యవేక్షణకు జెన్‌కో సంస్థ ఏర్పాటు చేసిన రహదారి శివారులో గుట్టలపై ఉన్న ఏకైక గిరిజన గ్రామం కావడంతో అటువైపుగా వాహనాల రాకపోకలు ఉండవు.

ఇక్కడి ఆదివాసీలంతా పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులు 15 మంది వరకు ఉన్నారు. ఈ గ్రామంలో పాఠశాల లేకపోవడంతో ఏడు కి.మీ. దూరంలోని ఫోర్‌బే గ్రామానికి కాలినడకన వెళ్లాలి. ఇరువైపులా 14 కి.మీ. నడవాల్సిన పరిస్థితి.

కాలిబాటంతా అడవిలో..

కాలిబాటంతా అభయారణ్యంలో ఉండటంతో తరచూ అడవి జంతువులు తారసపడుతుంటాయి. వేసవిలో ఎక్కువగా ఎలుగుబంట్లు కనిపిస్తుంటాయి. ఇలాంటి భయానక పరిస్థితుల్లో కొంతమంది చిన్నారులు పాఠశాలకు వెళ్లలేమని చదువుకు స్వస్తి చెప్పేశారు. ఐదో తరగతి చదివే ఏడుగురు విద్యార్థుల తల్లిదండ్రులు పనులు మానుకొని తమ పిల్లలకు తోడుగా పాఠశాలకు తీసుకెళ్తున్నారు. వీరు సైతం రోజూ పాఠశాలకు హాజరు కావడం లేదని ప్రధానోపాధ్యాయులు సురేష్‌ తెలిపారు. ఇంటి పెద్దలు కూలి పనులకు వెళ్లకపోతే పూట గడవని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో తల్లిదండ్రులు వంతులవారీగా రోజుకు ఇద్దరు చొప్పున పిల్లలను పాఠశాలకు తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. సాయంత్రం ఇంటికి వచ్చే చిన్నారులు కాళ్ల నొప్పులతో బాధపడుతుంటే ఆ తల్లిదండ్రులు విలపిస్తున్నారు. వర్షా, వేసవికాలాల్లో వీరి బాధలు వర్ణనాతీతం.

అందని ద్రాక్షలా సదుపాయాలు

ఈ గ్రామస్థులకు ఓటు, రేషన్‌ కార్డులున్నా తాగునీరు, విద్య, విద్యుత్తు, రహదారి సదుపాయాలు అందని ద్రాక్షలా మిగిలాయి. జెన్‌కో జలాశయ రహదారి పాయింట్‌ నుంచి రాజుక్యాంపునకు చేరాలంటే కాలినడకన రెండు కి.మీ. మేర ఎత్తైన గుట్టలు ఎక్కాలి. ఇప్పటికైనా అధికారులు ఈ గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించాలని, గ్రామంలో విద్యా వాలంటీరును నియమించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని