logo

శిశు మరణాలకు వైద్యులే బాధ్యులు

ఇకపై శిశు మరణం ఒక్కటి సంభవించినా సంబంధిత వైద్యాధికారులనే బాధ్యులను చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు.

Published : 01 Feb 2023 02:01 IST

కలెక్టర్‌ హెచ్చరిక

పాడేరు, న్యూస్‌టుడే: ఇకపై శిశు మరణం ఒక్కటి సంభవించినా సంబంధిత వైద్యాధికారులనే బాధ్యులను చేస్తామని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ హెచ్చరించారు. కలెక్టరేట్‌లో మంగళవారం ఆయన ఐటీడీఏ పీవో గోపాలకృష్ణతో కలిసి శిశు మరణాల నియంత్రణపై వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇకపై మరణాల నియంత్రణకు అంతా సీరియస్‌గా పని చేయాలన్నారు. చిన్న సమస్యలతో వచ్చే వారికి కూడా పరీక్షలు చేయకుండానే, బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు పై ఆసుపత్రులకు రిఫర్‌ చేస్తున్నట్లు ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు. సహేతుకమైన కారణం లేకుండా జిల్లా ఆసుపత్రి, కేజీహెచ్‌కు ఇక నుంచి రిఫర్‌ చేయకూడదన్నారు. అక్కడున్న సదుపాయాలే ఇక్కడి ఆసుపత్రుల్లోనూ ఉన్నాయన్నారు. చిన్న పిల్లల సంరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని ఆయన గుర్తు చేశారు. పిల్లలకు తల్లిపాలు ఇవ్వాల్సిన అవసరం, పాలిచ్చే విధానం తదితర అంశాలపై ఏఎన్‌ఎం, ఆశా కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలన్నారు. జిల్లా మాతాశిశు కేంద్రంలో రెండు నియోనాటిల్‌ వెంటిలేటర్లు, ఆసుపత్రిలో ఆక్సిజన్‌ సరఫరా, మాస్కులు, సెల్‌ కౌంటర్‌,  కృత్రిమ పంపింగ్‌కు సీపేప్‌ కొనుగోలు చేసి అందిస్తామన్నారు. ప్రతి పీహెచ్‌సీలో కనీసం 50 ఆక్సిజన్‌ సిలెండర్లను అందుబాటులో ఉంచుకోవాలని, రూ.50 వేలతో అత్యవసర మందులను కొనుగోలు చేయాలని సూచించారు. ఇక ప్రతి 15 రోజులకోసారి సమీక్షలు నిర్వహిస్తానన్నారు. వైద్యాధికారుల పనితీరులో మార్పులు రావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి జమాల్‌ బాషా, జిల్లా క్షయ నియంత్రణాధికారి విశ్వేశ్వరనాయుడు, అదనపు డీఎంహెచ్‌వో లీలాప్రసాద్‌, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు శంకర ప్రసాద్‌, అరకు, చింతపల్లి ఏరియా ఆసుపత్రి వైద్య నిపుణులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని