logo

అవును.. అక్కడ గాలి, నీరు కలుషితమే...

పరవాడ సింహాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కొంతమేర కలుషితమైనట్లు ఎట్టకేలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తేల్చింది.

Updated : 01 Feb 2023 06:40 IST

ఎన్‌జీటీ ఆదేశాలతో ఎన్టీపీసీ పరిసరాల్లో పీసీబీ తనిఖీలు
కాలుష్య నిర్ధారణ కావడంతో థర్మల్‌ విద్యుత్తు కేంద్రానికి నోటీసులు
ఈనాడు డిజిటల్‌, అనకాపల్లి

ఎన్టీపీసీ పరిసరాల్లో ఇలా నిత్యం పొగ కనిపిస్తూనే ఉంటుంది

పరవాడ సింహాద్రి థర్మల్‌ విద్యుత్తు కేంద్రం పరిసర ప్రాంతాల్లో గాలి, నీరు కొంతమేర కలుషితమైనట్లు ఎట్టకేలకు కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) ఆదేశాల మేరకు ఇటీవల ఎన్టీపీసీ పరిసరాల్లో పీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.

గాలి, నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా కొన్ని అంశాల్లో పరిమితికి మించి కాలుష్యం ఉన్నట్లు గుర్తించింది. ఈ మేరకు కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోనున్నారో వారం రోజుల్లో తెలియజేయాలంటూ ఎన్టీపీసీ సింహాద్రి యూనిట్‌కు నోటీసులు జారీచేసింది. దీంతో ఇన్నాళ్లు ఎన్టీపీసీ కాలుష్యంపై స్థానికులు చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరినట్లయింది.

విశాఖ శివారు.. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఈ థర్మల్‌ విద్యుత్తు కేంద్రం కాలుష్యం కారణంగా సమీప గ్రామాల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఏళ్ల తరబడి స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీపీసీ నుంచి వెలువడే బూడిదతో పక్కనే ఉన్న పిట్టవానిపాలెం వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

* మొదట్లో 600 ఎకరాల్లో యాష్‌ పాండ్‌ (బూడిద కొలను) నిర్వహించగా తర్వాత కాలంలో వెయ్యి ఎకరాలకు పైగా విస్తరించడంతో దుమ్ము, ధూళీ అంతా ఇళ్లలోకి నేరుగా చొరబడి కిడ్నీ, గుండె జబ్బులకు గురవుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.

* పిట్టవానిపాలేనికి చెందిన బట్టు సతీష్‌రెడ్డి అనే వ్యక్తి 2021లో ఎన్జీటీలో ఎన్టీపీసీ కాలుష్యంపై కేసు వేశారు. అతని ఫిర్యాదు స్వీకరించిన ఎన్జీటీ తీవ్రంగానే స్పందించింది. కలెక్టర్‌ సంబంధిత అధికారులను తీసుకుని వెళ్లి స్వయంగా పరిశీలించి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. వారిచ్చిన నివేదికను పరిశీలించిన హరిత ట్రైబ్యునల్‌ 2022 డిసెంబర్‌ 19న మరోసారి తనిఖీలు నిర్వహించాలని కాలుష్య నియంత్రణ మండలికి సూచింది.

* తాజా ఆదేశాలతో తనిఖీలు చేపట్టగా కాలుష్య నియంత్రణ పాటించడంలో పలు నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించి నివేదికను జిల్లా అధికారుల నుంచి ఎన్జీటీ వరకు అందజేశారు.

కాలుష్య నమోదు ఇలా..

* ఎన్టీపీసీ ఆవరణంతో పాటు బొగ్గు మండించే బాయిలర్లు, బావులు, బూడిద నిల్వచేసే ప్రాంతం, ఫిర్యాదుదారుని ఇంటి సమీపంలో నమూనాలు సేకరించారు. యూనిట్‌- 4 వద్ద ఉద్గారాలను కొలిచినప్పుడు క్యూబిక్‌ మీటర్‌కు 50 మిల్లీ గ్రాములు నమోదవ్వాలి.. కానీ, 68.3గా నమోదైంది. అలాగే నైట్రోజన్‌ ఆక్సైడ్లు 450 ఎంజీ నమోదు కావాలి కానీ 494.6గా నమోదైంది.

* నాలుగు బావుల వద్ద నీటి నమూనాలు పరిశీలించారు. వాటిలో అన్నీ నిర్దేశిత ప్రమాణాల మేరకు ఉన్నాయి. ఒక్క టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌ (టీడీఎస్‌) లీటర్‌ 500 మిల్లీ గ్రాముల వరకు అనుమతిస్తారు.. 2000 మి.గ్రా ఉన్నా ఫర్వాలేదు. కానీ ఈ నాలుగు బావుల్లోను 5,884 నుంచి 34,280 మి.గ్రా టీడీఎస్‌ నమోదవ్వడం విశేషం.

* ఎన్టీపీసీ పరిపాలనా భవనం వద్ద గాలిలో పీఎం10 (ధూళి రేణువులు) క్యూబిక్‌ మీటర్‌కు 176 మైక్రో గ్రాములుగా నమోదైంది. అక్కడ 100 మైక్రోగ్రాముల కంటే ఎక్కువ నమోదు కాకూడదు. పీఎం2.5 ధూళి రేణువులు కూడా నిర్దేశిత ప్రమాణం కంటే ఎక్కువగానే నమోదయ్యాయి. గాలి స్వచ్ఛతలో తేడాలు గుర్తించారు.

* ఫిర్యాదుదారుని ఇంటి సమీపంలోనూ పీఎం10 ధూళి కణాలు పరిమితికి మించి నమోదయ్యాయి.


నాడు అలా.. నేడు ఇలా..

విధ్యుత్తు కేంద్రం బూడిదతో ప్రభావితమైన పిట్టవానిపాలెం గ్రామం

కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఇదివరకు ఓసారి ఎన్టీపీసీ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేసి గాలి నాణ్యత అంతా బాగానే ఉందని నివేదిక ఇచ్చారు. దీపావళి కారణంగా నగరమంతా పొగ వ్యాపించడంతో అక్కడ కూడా అదే తీరున గాలి నాణ్యత లోపం కనిపించింది తప్పితే పెద్దగా తేడా లేదని పేర్కొంది. అయితే ఈ నివేదికను ఎన్జీటీ తిరస్కరించి దీపావళి సమయంలో తనిఖీలు ఎందుకు నిర్వహించారు.. సాధారణ రోజుల్లో పరిశీలించి మరలా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఈ ఏడాది జనవరి 25 నుంచి 27, 29 తేదీల్లోని ఎన్టీపీసీ పరిసరాల్లో నమూనాలను సేకరించి విశ్లేషించారు. గాలి, నీటి నాణ్యతలో నిర్దేశిత ప్రమాణాలకు మించి కొన్ని అంశాల్లో ఎక్కువ ఉన్నట్లు తేలడంతో ఎన్టీపీసీకి నోటీసులు జారీచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని