logo

నమ్మించి.. నిండా ముంచి..

గూడెంకొత్తవీధి మండలం జి.అద్దరవీధిలో గత జూన్‌ 24న పార్వతీ పరమేశ్వరుల ఆలయం పక్కనే భూదేవి విగ్రహం ఉన్న చోట అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలోని పురాతన విగ్రహాలు మాయం కావడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

Published : 01 Feb 2023 02:01 IST

అతీంద్రియ శక్తుల పేరిట ముఠాల వ్యాపారం
చింతపల్లి, గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే

మహిమలున్నాయని ముఠా సభ్యులు చూపిస్తున్న నాణాలు ఇవే..

గూడెంకొత్తవీధి మండలం జి.అద్దరవీధిలో గత జూన్‌ 24న పార్వతీ పరమేశ్వరుల ఆలయం పక్కనే భూదేవి విగ్రహం ఉన్న చోట అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు. ఆ ప్రాంతంలోని పురాతన విగ్రహాలు మాయం కావడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.

పెదవలస సమీపంలోని ఓ చెట్టు కింద ఉన్న పురాతన కోటమ్మ తల్లి కొండ వద్ద అక్టోబర్‌ 29న దుండగులు తవ్వకాలు జరిపారు. బ్రిటిష్‌ కాలం నుంచి ఉన్న ఈ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి పక్కనే సొరంగం మాదిరిగా తవ్వడం స్థానికులు గమనించారు.

చింతపల్లి మండలం లోతుగెడ్డ సమీపంలో ఈనెల 16న ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన పురాతన నాణెం కొనుగోలుకు వచ్చిన వ్యక్తిపై పోలీసుల వేషధారణలో ఓ ముఠా దాడి చేసి అతని వద్ద రూ. 8 లక్షల కాజేశారు. చింతపల్లి పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్‌ చేశారు.

పచ్చని కొండలు, జాలువారే జలపాతాలు, సెలయేటి గలగలలు, పక్షుల కిలకిలరావాలు, మనస్సు దోచే మంచు సోయగాలు ఇలాంటి ప్రకృతి అందాలకు నిలయంగా విరాజిల్లుతున్న అల్లూరి మన్యంలో అక్రమ వ్యాపారాలకూ కొదవే లేదు. గంజాయిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు.

పురాతన విగ్రహాలు, శ్రీరామ పట్టాభిషేకం నాణేలు, రాగిచెంబు, నక్షత్ర తాబేళ్లు, అలుగుపిల్లి చిప్పలు, రెండు తలల పాముల్లో అతీంద్రియ శక్తులు ఉంటాయని కొందరి విశ్వాసం. వీటికి మహిమలున్నాయి.. కావాలంటే చూడండి, ఇవి బియ్యాన్ని ఆకర్షిస్తాయంటూ నమ్మిస్తున్నారు.

ముఠానుంచి స్వాధీనం చేసుకున్న కార్లు

ఇప్పుడు ఈ తరహా మోసాలకు ఆధునికతను జోడిస్తున్నారు. తమ వద్ద ఉన్న పురాతన నాణాలకు రేడియేషన్‌ ఉందని, వాటికి మేగ్నటిక్‌ పవర్‌ ఉందని వీటిని నాసా, డీఆర్‌డీఓ, అంతర్జాతీయ స్పేస్‌సెంటర్‌, రాకెట్‌ ప్రయోగాలకు ఉపయోగించే టెక్నాలజీల్లో వీటిని ఉపయోగిస్తున్నారని నమ్మబలుకుతున్నారు. కావాలంటే వీటిని పరీక్షించుకోవచ్చంటున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి వీటికి నిర్వహించే పరీక్షలకే సుమారు 20లక్షల వరకూ ఖర్చవుతుందని వీరు నమ్మిస్తున్నారు. వీటి విలువ కోట్లలోనే ఉంటుందని, తాము రూ.లక్షలకే ఇచ్చేస్తున్నా మని వలేస్తున్నారు.


సొమ్ము గుంజుకుని.. బెదిరించి..

రైస్‌ పుల్లింగ్‌ పేరుతో మోసం చేసి ఇటీవల చింతపల్లి పోలీసులకుచిక్కిన ముఠా

సులభంగా డబ్బు సంపాదించవచ్చన్న మాయమాటలు చెప్పే ముఠాలు మన్యంలో జోరుగా సంచరిస్తున్నాయి. చింతపల్లి, జీకేవీధి, కొయ్యూరు, జి.మాడుగుల, వైరామవరం, అడ్డతీగల, మారేడుమిల్లి, ముంచంగిపుట్టు, అరకులోయ, అనంతగిరి మండలాల పరిధిలోని శివారు గ్రామాల్లో వీటి కార్యకలాపాలు ఎక్కువగా జరుగుతున్నాయి. డబ్బులు ఎరగా వేయడంతో స్థానికుల సహకారం తోడవుతోంది.

ముఠా మాయమాటలు నమ్మి కొందరు సొమ్ము తీసుకుని కార్లలో మన్యానికి వస్తున్నారు. ముఠా సభ్యులు వారి వద్ద ఉన్న నకిలీ పురాతన నాణాలను చూపించి వారిని నమ్మిస్తున్నారు. వీటిని  ముందుకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం నిర్దేశిత ప్రాంతాలకు రావాలని రావాలని సూచిస్తున్నారు. డబ్బుతో అక్కడకు వచ్చే వారిని పోలీసుల పేరుతో అదే ముఠాకు చెందిన మరికొందరు వ్యక్తులు తనిఖీల పేరుతో బెదిరించి వారి వద్దనుంచి ఉన్న డబ్బంతా దోచుకుంటున్నారు. అవసరమైతే వారి వద్ద ఉన్న ఆయుధాలతో చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. దీంతో ప్రాణ భయంతో చేసేది లేక ముఠా సభ్యుల దురాగతాలకు వీరు బలవుతున్నారు. ఈతరహా మోసాలు తరచూ జరుగుతున్నా విషయం పోలీసులకు చెబితే తమపైనే కేసులు పెడతారన్న భయంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు.


నిర్భయంగా ఫిర్యాదు చేయొచ్చు

పురాతన నాణాలకు, రాగిచెంబులకు ఎటువంటి మహిమలు ఉండవు అయినా కొందరు ఈవిషయంలో మోసపోతూ ఉన్నారు. జరిగిన నష్టం ఎలాగూ జరుగుతుంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటకు చెందిన వ్యక్తిని మోసగించిన ఉదంతంలో ఫిర్యాదు చేసిన వెంటనే ముఠా సభ్యులను పట్టుకున్నాం. వారినుంచీ సుమారు 8లక్షల డబ్బును, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నాం. ఈతరహా మోసాలకు సంబంధించిన సమాచారం ఉంటే భయపడకుండా పోలీసులకు ఫిర్యాదు చేయొచ్చు.

ప్రతాప్‌ శివకిషోర్‌ చింతపల్లి ఏఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు