logo

కేకే లైన్‌లో పట్టాలు తప్పిన గూడ్స్‌

కొత్తవలస - కిరండూల్‌ రైలు మార్గంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో కిరండూల్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది.

Updated : 03 Feb 2023 04:23 IST

విరిగిన విద్యుత్తు స్తంభాలు

అనంతగిరి గ్రామీణం, రైల్వేస్టేషన్‌, న్యూస్‌టుడే: కొత్తవలస - కిరండూల్‌ రైలు మార్గంలో గురువారం ఉదయం ఆరు గంటల సమయంలో కిరండూల్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న గూడ్స్‌ రైలు పట్టాలు తప్పింది. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం శివలింగపురం రైల్వేస్టేషన్‌లో  ఈ ఘటన జరిగింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పి ట్రాక్‌ పక్కనే ఉన్న మూడు విద్యుత్తు స్తంభాలను ఢీకొట్టడంతో విద్యుత్తు లైన్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. రైల్వే అధికారులు హుటాహుటిన ప్రమాదం జరిగిన ప్రదేశానికి చేరుకుని పునరుద్ధరణ పనులు ప్రారంభించారు. సాయంత్రానికి పనులు పూర్తి కాకపోవడంతో ఈ మార్గంలో తిరగాల్సిన కిరండూల్‌ ప్యాసింజర్‌ రైలు, రాత్రి సమయంలో వెళ్లే జగదల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. సంఘటన స్థలానికి రైల్వే ఉన్నతాధికారులు వచ్చి ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీశారు. శుక్రవారం సాయంత్రం నుంచి యథావిధిగా రైళ్లు తిరిగే అవకాశం ఉందని తెలిపారు. ఇదే లైన్‌లో వెళ్లే గూడ్స్‌ రైళ్లన్నీ రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రైళ్ల రద్దు: ఈ ఘటన నేపథ్యలో  ఈ నెల 3న విశాఖ-కిరండూల్‌-విశాఖ(08551-08552) రైళ్లను రద్దు చేశారు. రైళ్ల రద్దు నేపథ్యంలో...ముందస్తుగా టికెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నగదు వెనక్కి ఇచ్చే చర్యలను అధికారులు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని